Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా..? ఫోన్ లేకపోయినా.. రింగ్ అవ్వకపోయినా.. మెసేజ్ రాకపోయినా కలవరపడుతున్నారా? ఫేస్ బుక్ చూడకపోతే నిద్రరావడం లేదా..? ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఇది సాధారణం కాదట. సెల్ ఫోన్ అతి వినియోగం అత్యంత ప్రమాదమని అంటున్నాయి సర్వేలు. నూటికి తొంభై శాతం మంది ఇదే లక్షణాలతో ఉన్నారట. ఇది వారికి తెలియకుండా జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు మానసిక నిపుణులు. సెల్‌ఫోన్ అతి వినియోగం సరికొత్త సమస్యలకు కారణమవుతోంది. గంటల తరబడి ఫోన్ వినియోగించే వారిలో కంటి సంబంధిత సమస్యలు కనిపిస్తున్నట్టు ఇప్పటివరకూ వైద్యులు చెబుతూ వచ్చారు. తాజాగా మరో సమస్య ఈ జాబితాలో చేరినట్టు మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. అదే రింగ్జైటీ.
యాంగ్జయిటీ గురించి విని ఉంటాం. కానీ అతికొద్దిమందికి మాత్రమే ఈ రింగ్జైటీ అనే సమస్య గురించి తెలుసు. ఎందుకుంటే రింగ్జైటీతో బాధపడుతున్న వాళ్లు మనలో చాలామంది ఉంటారు. కానీ అది సమస్యగా ఎవరూ భావించారు. సెల్‌ఫోన్ వినియోగం ఒక పరిధి దాటిపోయిన వారిలో ఈ సమస్య కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
రింగ్జైటీ సమస్యతో బాధపడేవాళ్లు.. ఫోన్ వినియోగిస్తున్నప్పుడే కాదు, పక్కన పెట్టినప్పుడు కూడా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఫోన్ రింగ్ అవుతుందేమోనని పదేపదే చూడడం, చిన్నపాటి శబ్ధం వచ్చినా వాట్సాప్ మెసేజ్ వచ్చిందేమోనని చూడడం, మొబైల్‌కు అప్డేట్స్ వస్తున్నాయేమోనని ఆలోచన చేయడం వంటివన్నీ ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.
ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా ఫోన్ అప్ డేట్స్ చూసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం, పక్కన ఎవరి ఫోన్ మోగినా తన ఫోన్ మోగుతున్నట్టు చూసుకోవడం వంటివి కూడా దీని లక్షణాలేనంటున్నారు. దీనిని ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని కూడా పేర్కొంటున్నారు. కాలేజీ విద్యార్థులు, సెల్‌ఫోన్‌తో ఎక్కువ గడిపే ఉద్యోగులు, మహిళల్లో ఈ సమస్య ఎక్కువ వున్నట్టు చెబుతున్నారు.
విద్యార్థులు తరగతిలో వున్నప్పుడు కూడా ఫోన్‌పైనే దష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు. ఏమని చేశారో చూసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఉద్యోగులు కూడా పనిపై దష్టి పెట్టకుండా ఫోన్లో నచ్చిన అంశాలను వెతుక్కునేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో విద్యార్థులు, కొంతమంది ఉద్యోగులు ఈ తరహా లక్షణాలతో తమ వద్దకు వస్తున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. అయితే దాన్ని ఒక సమస్యగా గుర్తించకపోవడం వల్ల చాలామంది అలానే ముందుకు సాగుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
సెల్‌ఫోన్ అతి వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను చూడడం వల్ల కొందరిలో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడినవాళ్లు ప్రయాణంలోను సెల్‌ఫోన్‌ను వదలడం లేదు. దీనివల్ల మెదడు, కండ్లు ఒత్తిడికి గురై అలసటగా కనిపిస్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరహా ఇబ్బందుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు చెబుతున్నారు.