Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ మెల్లమెల్లగా పెరుగూ వస్తోంది. గత రెండు మూడు నెలల కాలంలో పదుల సంఖ్యలో నమోదైన కరోనా కేసులు మరల పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు పదుల సంఖ్య దాటి వందల సంఖ్యలోకి వచ్చింది. ఈ మధ్య 200 నుండి 300ల కరోనా పాజిటివ్ కేసులు జిల్లా స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ రెండు మూడు నెలల కాలంలో పెండిండ్లు, ఫంక్షన్లు బాగా జరిగాయి. పండుగలూ బాగానే వచ్చాయి. చాలా కాలంగా స్తబ్దుగా ఇంట్లో కూర్చున్న వారికి పండుగలు, పెండిండ్లు నూతనోత్తేజాన్ని కలిగించాయి. అందుకే అందరూ జైల్లో నుండి బయటపడ్డ పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగారు. ఇప్పటికీ ముప్పు తొలగిపోలేదు కాబట్టి జాగ్రత్త మాత్రం అవసరమే. ప్రతి ఒక్కరూ వాక్సిన్లు వేయించుకోవాలి. మేం బయటకు వెళ్ళటం లేదు కదా అని ఇప్పటికీ చాలా మంది వాక్సిన్ వేయించుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలి. తెలిసిన వారు వాక్సిన్ వేయించుకోని వారిని ప్రోత్సహించాలి. ఏది ఏమైనా జాగ్రత్తలు అవసరం. ఇంట్లో ఉందాం.. కళాత్మకంగా గడుపుదాం...
రెడ్ బెర్రీలతో...
ఈ మధ్య ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఫిట్నెస్ పట్ల కాంక్షా పెరిగింది. ఫలితంగా దాదాపు చాలా ఇళ్ళలో డ్రైఫ్రూట్స్ వాడకం పెరిగింది. పూర్వపు రోజుల్లో పండుగ నాడు స్వీట్లలో, పాయసాలలో వేసుకునేవారు. అదీ అందరికీ తెలిసిన డ్రైఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్లే. ఇప్పుడు అడవిలో దొరికే పండ్లన్నీ కోసుకొస్తున్నారు. అందంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. జనం కూడా ఎగబడి కొనుక్కుంటున్నారు. బెర్రీ పండ్లను ఎండబెట్టి బాగా అమ్ముతున్నారు. వీటిలో రెడ్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్రాన్బెర్రీ అని రకరకాల పండ్లను మా పిల్లలు ఆన్లైన్లో తెప్పించారు. వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను. తినడం కన్నా వాళ్ళు తెచ్చుకున్న కొత్తరకాలను బొమ్మలు చేసేయాలన్న ఆరాటమే నాకు ఎక్కువ. ఈ రోజు రెడ్ బెర్రీలతో కాటర్ పిల్లర్‌ను చేశాను. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉండి బచ్చలి చెట్ల విత్తనాల వలె ఉన్నాయి. బాగా తియ్యగా ఉన్నాయి. ఏమైనా వాళ్ళు తినేలోపు నేను కాటన్ పిల్లర్ చేసేశాను. చిన్నగా కండతో, రసంతో నిండి గుండ్రంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు ఎండబెడితే కిస్మిస్ అయినట్టుగా రసాలూరే బెర్రీపండ్లు ఇలా డ్రైఫ్రూట్స్‌గా మారాయి. ఇంకా రాస్ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, వైట్ కరెంట్స్ అని చాలా రకాలున్నాయి. వీటిని ఎక్కువగా జామ్‌లు, కేకులు, 'పై'లలో ఉపయోగిస్తారు. వీటిలో కొన్ని విషపూరితంగా ఉంటాయి. బెర్రీలలో కొన్నింటినే తింటారు.
సీసా మూతలతో...
ఇంట్లోకి ప్రతిరోజూ ఎన్నో రకాల సీసాలను తెచ్చుకుంటాము. ముఖ్యంగా మంచినీళ్ళ బాటిల్స్ ప్రముఖంగా కనిపిస్తాయి. మంచినీళ్ళ సీసా, మంచి నూనె సీసా, కొబ్బరి నూనె సీసా, ఫినాయిల్ సీసా, టానిక్ సీసా, సెలైన్ సీసా, కిరోసిన్ సీసా... ఇలా ఎన్నో రకాల ద్రవపదార్థాలు సీసాలలోనే వస్తాయి. వాటన్నింటికీ ప్లాస్టిక్ మూతలే ఉంటాయి. తేనె సీసా, పాలసీసా, ఇంజక్షన్ల బుల్లి సీసాలతో పాటు అన్ని రకాల నూనెలూ సీసాల్లో లభ్యమవుతాయి. నేనిలా రకరకాల సీసాలతో బొమ్మలు చేసి ''సీసాల సోయగం'' అనే పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించాను. సరే ఈరోజు సీసాలనొదిలి సీసాల మూతల్ని పట్టుకుందాం. రకరాల సీసాల మూతల్ని సేకరించి నేను కాటర్ పిల్లర్‌ను తయారు చేశాను. 'మూతల ముద్దుగుమ్మలు' అని పేరు పెడదాం గానీ కాటర్ పిల్లర్ అంటే తెలుసా? గొంగళి పురుగు. ప్రతి కీటకానికీ గుడ్డు, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి అని నాలుగు దశలుంటాయి. గుడ్డు తర్వాతి దశనే లార్వా అన్నమాట. ఇవన్నీ చిన్నతనంలో సైన్స్ పాఠాలలో చదువుకున్నాం. మరీ ముఖ్యంగా దోమల ఈగల లార్వాలను ఆ దశలోనే చంపేస్తుంటారు. పెరగక ముందే చంపేయడం వలన వ్యాధులను నివారించవచ్చు. దోమ లార్వాలను తినేసే గుంబూసియా అనే చేపల్ని మురికి గుంటల్లో వదిలితే అది లార్వాలన్నింటినీ తినేస్తుంది. లార్వాలకూ ప్రౌఢ జీవులకూ అస్సలు పోలికే ఉండదు.
గాజులతో...
మహిళల దగ్గర మిగిలిపోయిన మట్టిగాజులు చాలా ఉంటాయి. చీరల రంగులకు తగినట్టుగా గాజుల్ని వేసుకుంటున్నారు. పాత బడిపోయిన గాజులతో నేను చాలా బొమ్మలు వేశాను. ఈసారి కాటర్ పిల్లర్‌ను చేశాను. సీసాకోకచిలుకలు, మాతల లార్వాలను కాటర్ పిల్లర్ అంటారు. కీటకాలకు, నీళ్ళలో ఉండే జీవులకు చాలా వాటికి నాలుగు రకాల జీవిత దశలు ఉంటాయి. ఒక్కొక్క జీవి లార్వాకు ఒక్కొక్క పేరు ఉంటుంది. తేనెటీగలు, కందిరీగల లార్వాలను 'మాగట్' అంటారు. బీటిల్స్ లార్వాలను 'గ్రబ్' అంటారు. క్రస్టేషియన్స్ లార్వాలను నాప్లియస్, జోయా, సైప్రిస్ లార్వాలు అంటారు. గుడ్డు దశ నుండి ప్రౌఢ జీవులుగా మారడానికి రూపవిక్రియ జరుగుతుంది. ప్రౌఢ జీవికి మధ్యలోని దశల్లో ఉండే రూపాలకు ఏ మాత్రం పోలిక ఉండదు. వీటి గురించి పరిశోధన జరగనపుడు లార్వాలు ప్రౌఢజీవులు రెండూ వేర్వేరు జీవులుగా పరిగణించేవారు. ఆ తర్వాత గానీ ఇవి జీవుల రూప విక్రియలోని దశలని గుర్తించారు. బెర్రీల్లోని వైట్ కరెంట్స్తో కాళ్ళు, యాంటిన్నాలను పెట్టాను.
కీరదోసకాయలతో...
వెజిటబుల్ కార్వింగ్‌లో భాగంగా ఎన్నో జంతువుల్ని సృష్టించాను. వీటిని నేను 'బొటానికల్ జూ' అనే పుస్తకంగా తీసుకొచ్చాను. అలాగే కూరగాయలతో లార్వాలనూ తయారు చేశాను. కీరా దోసకాయతో లార్వాను తయారు చేశాను. అలాగే అరటి పండుతో కూడా లార్వాను చేశాను. డిగ్రీ చదివేటపుడు ఎన్ని రకాల లార్వాలను రికార్డులలో శ్రద్ధగా గీశాను. లార్వా శరీరం ఖండితాలుగా ఉంటుంది. నా బొమ్మలు చూసి 'కొద్ది కొద్దిగా కదిలి ముందుకు వస్తున్నాయనిపిస్తుంది' అనేది మా మేడమ్. వాతావరణ పరిస్థితుల కనుగుణంగా లార్వాల, జీవన విధానం ఉంటుంది. ఇది ఆకారంలోనే కాక ఆహారం విషయంలోనూ ప్రౌఢ జీవులకు విభిన్నంగానే ఉంటాయి. నేను కీరా దోసకాయను గుండ్రంగా చక్రాలుగా కోసి ఒక ప్లేట్లో చక్కగా అమర్చాలి. ముందు ఉన్న దోసకాయ చక్రానికి యాంటిన్నాలు, కండ్లు పెట్టాలి. అలా కాటర్ పిల్లర్ తయారయింది.
క్రీము బిస్కెట్లతో...
బాలల దినోత్సవం నాడు తెచ్చిన బిస్కెట్లలో కొన్ని మిగిలిపోయాయి. వాటిలోని క్రీము బిస్కెట్లను తీసుకొని కాటర్ పిల్లర్‌ను తయారు చేశాను. ఈ బిస్కెట్ల మధ్యలో చిన్న రంధ్రం ఉండి క్రీమ్ బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రీము బిస్కెట్ల లార్వాకు కండ్లు, కాళ్ళు, యాంటిన్నాలు పెట్టాను. లవంగాలతో వీటిని అమర్చాను. లవంగాలు మసాలా ద్రవ్యాలలో ఒకటి. ఇది చెట్టు పూ మొగ్గ. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, విటమిన్లు ఉంటాయి. ''షైజీజియమ్ ఆరోమాటికమ్'' అని దీని శాస్త్రీయనామం. ఈ లవంగాలను ''దేవకుసుమ'' అని కూడా అంటారు. నీళ్ళలో నివసించే మలస్క్లు, యాంఫీబియన్లు, ఫిష్‌లకు లార్వాలు విధిగా ఉంటాయి. కప్ప లార్వా దశను 'టాడ్‌పోల్' అంటారు. ఆ దశలో కప్పకు తోక ఉంటుంది. పెద్దది అయిన తర్వాత ఆ తోక పోతుంది. ఎభైనోడెర్మేటా వర్గ జీవుల లార్వాలను ఓఫియో ప్లూటియస్, ఆరిక్యులేరియా, ప్లూటియస్, విటిల్లేరియా, ఎభైప్లూటియస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్