Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే బిజీ లైఫ్... చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయి ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో గానీ, తినే సమయం గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
బరువు తగ్గడానికి డాక్టర్లు సాధారణంగా వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అయితే మీ ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చుకుంటే మీ బరువు తగ్గించుకోవచ్చు
కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ తీసుకోవడం మంచిది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది.
ఆహారంలో పచ్చి మిర్చీని విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల సూచన.
కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. తద్వారా బరువు తగ్గుతూ అదుపులోఉంటుంది.
వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది.
ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది.