Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాణి తుల్జా... ఔరంగాబాద్‌కు చెందిన ఈ మహిళా పారిశ్రామికవేత్త ఒకప్పుడు విపరీతమైన వివక్షను ఎదుర్కొన్నారు. గృహహింసకు గురై ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళారు. ఆ అడ్డంకులన్నింటినీ ఎదిరించి మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకునే వ్యాపారాన్ని సొంతంగా ప్రారంభించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రాబోయే కష్టాలను ఎదుర్కొనేందుకు తనని తాను సిద్ధం చేసుకున్నాని ధైర్యంగా చెబుతున్న ఆమె హెవీ మెటల్‌కు సరికొత్త అర్థాన్ని ఇచ్చారు.
34 ఏండ్ల ఓ మహిళ వర్షం పడుతుంటే గొడుగు కింద బస్సు కోసం వేచి ఉంది. ఆమె సొంతంగా వ్యాపారం చేస్తుంది. తన కస్టమర్లను కలిసే మార్గంలో ఆమె ఉంది. ఇటీవల వ్యాపార సంఘం, మీడియా వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా భారతదేశంలో మహిళా వ్యాపారవేత్తల పెరుగుదల గురించి చర్చించుకుంటున్నపుడు ఆ మహిళ వారికి గుర్తుకొచ్చింది.
ఆమె తక్షణ లక్ష్యాలు
రాణి తుల్జా ఔరంగాబాద్‌లో తుల్జా టూలింగ్ పేరుతో మెషిన్ టూల్స్ వ్యాపారం చేస్తున్నారు. ఆమెకు ఓ చిన్న వర్క్‌షాప్ ఉంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆమె ఎండా, వానలను లెక్క చేయకుండా తన ఉత్పత్తులను విక్రయించడానికి పారిశ్రామికవేత్తలు, తయారీదారులను కలిసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె తక్షణ లక్ష్యాలు తన సొంత వెబ్‌సైట్‌ను రూపొందించుకోవడం అలాగే డిజిటల్ మార్కెటింగ్ ప్రక్రియను ప్రారంభించడం. తద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవడం సాధ్యమవుతుందని ఆమె ఆలోచన. అలాగే తన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు సిఎన్సి మెషీన్‌ను కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కఠినమైన వ్యాపారం
రాణి తుల్జా వంటి జీవితాలు ఎందరిలోనే స్ఫూర్తి నింపుతున్నాయి. ఆమె గురించి చెప్పుకోబోయే ముందు అసలు ఆమె చేస్తున్న వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆమె ధైర్యం.. ఆమె సాహసం.. ఆమె కృషి గురించి మనకు తెలుస్తాయి. మెషిన్ టూలింగ్ వ్యాపారం అనేది ఆటోమొబైల్స్, భారీ యంత్రాలు మొదలైన అన్ని రకాల తయారీ పరిశ్రమలకు అవసరమైన ఫిక్చర్లు, గేజ్‌లు, అచ్చులు, కట్టింగ్ పరికరాలు, నమూనాలు వంటి భాగాల తయారీ ప్రక్రియ. దీని నిర్వహణ అంత సులభం కాదు.
అతి కొద్దిమందిలో ఒకరు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఓ పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఆ పారిశ్రామిక ప్రాంతాలలో చిన్న, పెద్ద ఉపకరణాల తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వేరొకరి సంస్థలో పని చేయకుండా తమ సొంత టూలింగ్ వర్క్‌షాప్‌ని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన అతికొద్ది మంది మహిళల్లో ఒకరు రాణి తుల్జా. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ పని వారి కోసం కాదు
మహిళలు ఇలాంటి ఓ కఠినమైన వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నపుడు మహిళలు హార్డ్‌కోర్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించరని, ఈ పని వారి కోసం కాదని, దీనికి బదులుగా టైలరింగ్ లేదా క్యాటరింగ్ వంటి వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిదని తరచుగా అందరూ అంటుండేవారు. ఆరేండ్ల కొడుక్కి ఒంటరి తల్లి అయిన రాణి కూడా అలాంటి మాటలను ఎదుర్కొన్నారు. కానీ ఆ మాటలు విని వారికి సమాధానం చెప్పే సమయం కూడా ఆమె దగ్గర లేనంత బిజీగా తన వ్యాపారంతో గడిపేశారు. అసలు వారి మాటలను కూడా పట్టించుకోలేదు.
తీవ్రంగా బాధించిన సంఘటన
డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఆమె తన సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకునే కృషి చేశారు. దానికోసం అప్రెంటిస్‌గా రూ. 1,500 సంపాదిస్తూ వివిధ చిన్న సంస్థలలో ఉద్యోగం చేశారు. ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉన్నతాధికారితో జరిగిన ఓ సంఘటన ఆమెను తీవ్రంగా బాధించించి. అవమానకరంగా అనిపించింది. దాంతో రాణి ''ఏదో ఒక రోజు నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి'' అని నిర్ణయించుకున్నారు.
విఫలమైన ప్రణాళికలు
2017లో ఆమె అద్దెకు తెచ్చుకున్న మెషీన్‌తో సొంత వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. తను అప్పటి వరకు పని చేసిన ఇతర సంస్థలలోని సీనియర్ సహోద్యోగులలో ఒకరి నుండి పొందిన మార్గదర్శకత్వం, వారు ఇచ్చిన హామీతో ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ప్రభుత్వ పథకం కింద బ్యాంకు ద్వారా రూ.10 లక్షల రుణం కూడా పొందగలిగారు. అయినప్పటికీ భర్త చేతిలో ఆమె అనుభవించిన గృహ హింస కారణంగా ఎంతో బాగా రూపొందించిన ప్రణాళికలు విఫలమయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాలు అలా గడిచిపోయాయి. తన సొంత డబ్బుతో స్థాపించిన తన వ్యాపారంపై తన నియంత్రణను కోల్పోయింది. అదే సమయంలో హింసను ఇక భరించలేక తన భర్త నుండి కూడా విడిపోయారు.
కఠినమైన రోజులు
''మేరే లియే వో బహుత్ హీ బురా సమరు థా. అబ్ భీ హై, పర్ అబ్ మెయిన్ స్ట్రాంగ్ హున్ (ఆ రోజులు నా జీవితంలో చాలా కఠినమైనవి. సమయం ఇప్పటికీ కఠినమైనదే. కానీ నేను దాన్ని ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తితో సిద్ధంగా ఉన్నాను)' అని ఆమె తన కష్టాలను గుర్తుచేసుకుంది. రాణి 2020లో మహమ్మారి సమయంలో తన తల్లిదండ్రుల నుండి కొంత డబ్బు తీసుకొని, తన బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ తన వ్యాపారాన్ని పునఃప్రారంభించింది. ఈరోజు ఆమె వద్ద ఐదు యంత్రాలు ఉన్నాయి. వాటిలో మిల్లింగ్ మెషిన్, లాత్ మెషిన్, డ్రిల్ మెషిన్ ఉన్నాయి. అందులో ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. డిజైన్, టెక్నికల్ వర్క్, మార్కెటింగ్ వంటివి ఆమే స్వయంగా చేస్తున్నారు. కృషి, పట్టుదలతో వ్యాపారాన్ని విస్తరింపజేసి గత సంవత్సరం రాణి 24 లక్షల రూపాయలను సంపాదించారు.
హింసను భరించలేక
డ్రాఫ్ట్‌మ్యాన్ మెకానికల్‌లో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత రాణి ఓ మహిళగా ఈ సమాజంలో, ఇంట్లో ఘోరమైన వివక్షను ఎదుర్కొన్నారు. ఆ బాధను భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముంగించాలని కూడా ఆలోచించారు. అన్ని కష్టాలు ఎదుర్కొన్న ఆమె ఈరోజు అందరది ముందు ఉన్నతంగా నిలుస్తున్నారు. నైపుణ్యం ఉన్న వ్యాపారంలో తనకు ఓ స్థిరమైన స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాదు తమకు పొరుగున ఉన్న కొలాÛపూర్, నాగ్‌పూర్, గుజరాత్, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాలకు తన ఉత్పత్తుల మార్కెట్‌ను విస్తరింపజేశారు. ''యే మేరీ జిద్ హై. మెయిన్ కుచ్ కర్ కే దిఖౌంగీ'' (నేను కచ్చితంగా విజయం సాధించి చూపిస్తాను. ఆ పట్టుదల నాలో వుంది) అని ఆమె అంటున్నారు.
- సలీమ