Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలిసిన విద్యను నేర్పడం సులువే... కానీ ఆ విద్య మంచి సమాజానికి పునాదులు వేస్తున్నదా లేదా అన్నది ప్రశ్న. సరిగ్గా ఇటువంటి సంఘర్షణలోంచే రూపుదిద్దుకుని 'మెరీడియన్' పాఠశాల...! సేవే లక్ష్యంగా.. పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధనకై కలలుగన్న పి.మాధురిరెడ్డి ఏన్నో ఏండ్ల తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఉన్నతమైన సమాజానికై మెరుగులు దిద్దుతున్నారు. కుటుంబ ప్రోత్సాహం, భర్త సహకారంతో విలువలతో కూడిన భావిపౌరులను సమాజానికి అందించేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో మెరిడీయన్ స్కూల్‌ను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతస్థితిలో నిలిపేందుకు పాటుపడుతున్న ఆమె పరిచయం...
మహబూబాబాద్ జిల్లా అమన్‌గల్‌కు చెందిన పెసరు మాధురి రెడ్డి వ్యవసాయాధారిత కుటుంబంలోనే జన్మించారు. సరిగ్గా ముప్పై ఏండ్ల కిందట ఆమె చదువుకుంటున్న కాలంలో 'ఆడపిల్లలకు చదువు అవసరమా?' అని తండ్రిని ఎంతోమంది అడిగారు. ఎంత మంది ఇలా ప్రశ్నించినా ఆ తండ్రి నిరుత్సాహానికి లోనుకాకుండా ఇద్దరు అమ్మాయిలను, కొడుకుని ఉన్నతంగా చదివించాడు. అందులో పెద్దకూతురు మాధురిరెడ్డి. ఇంటర్మీడియట్ వరకు మహబూబాబాద్‌లో విద్యనభ్యసించి తర్వాత డిగ్రీ, పిజి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో పూర్తిచేశారు. 1995-97లో టీచర్‌గా పనిచేశారు. వివాహం తర్వాత భర్త రాంగోపాల్‌రెడ్డితో కలిసి అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. వీరి ఇద్దరు కూతుళ్లలో ఒకరు డాక్టర్. చిన్నమ్మాయి అమెరికాలో ఇంటర్మీడియట్ చేస్తున్నారు.
కల సాకారానికి బాటలు
ఎంఎస్సీ మాథమేటిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన మాధురి 1995 లోనే స్కూల్ పెట్టాలనుకున్నారు. ఆ కాలంలోనే తన చదువుకు తండ్రి సహకరించడం, భర్త కూడా తన ఆలోచనను గౌరవించడంతో ఆమె కల సాకారానికి బాటలు పడ్డాయి. 2009లో యుఎస్ నుంచి స్వదేశానికి రాగానే దాదాపు పదేండ్లపాటు కుటుంబానికి సమయం వెచ్చించారు. 2012 నుంచి స్కూల్ ప్రాజెక్టు ఆలోచన ఉన్నప్పటికీ 2019లో అది కార్యరూపం దాల్చింది.
కరోనా విజృంభించడంతో...
యుఎస్ పాఠశాలల్లో ఉన్న వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే ఓ బ్రాంచీని ఎంపిక చేసుకునే క్రమంలో 'మెరిడీయన్' పట్ల ఆసక్తి చూపారు. 27 సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థ కావడం, అప్పటికే ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఇక ఆలస్యం చేయకుండా అభివృద్ధి సంతరించుకుంటున్న ఉప్పల్ ప్రాంతంలో మెరిడీయన్ స్కూల్‌ను ప్రారంభించారు. అదే సమయంలో కరోనా విజృంభించడంతో 'ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామా..?' అన్న ప్రశ్న ఎదురైనా.. టీచర్ల సహకారంతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించి తల్లిదండ్రులు, విద్యార్థులకు భరోసా కల్పించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఫిజికల్ క్లాసులు కొనసాగిస్తుండటంతో పాఠశాలకు కొత్త కళ సంతరించుకుంది.
అంతర్జాతీయ లక్ష్యాలతో
పుస్తక జ్ఞానం ఎవరైనా ఇస్తారు... కానీ మెరీడియన్ పాఠశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అంటున్నారు చైర్పర్సన్ మాధురి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కాదు ఇక్కడ కూడా సాధారణ స్థాయి పిల్లలను అంతర్జాతీయ మార్కెట్లో రాణించే విధంగా సకల సౌకర్యాలతో మెళుకువలు నేర్పే అవకాశం కల్పించారు. విద్యార్థులకు మానసికోల్లాసం పంచేందుకు అన్ని క్రీడలూ ఇక్కడ ప్రవేశపెట్టారు.
అధునాతన హంగులు..
ఐదో తరగతిలోపే అన్నిరకాల గేమ్స్ అలవాటు చేయించేవిధంగా రూపకల్పన చేశారు. రాక్ క్లైంబింగ్ వాల్, ఆర్చరీ, స్విమ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, క్రికెట్ తదితర క్రీడల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కోచ్‌లను నియమించారు. అధునాతన హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన ఈ పాఠశాల ఆరు ఎకరాల స్థలంలో నిర్మించారు. ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత, సువిశాలమైన ప్రాంతం వెరసి అందరి చూపు మెరీడియన్ వైపే ఉందనడంలో అతిశయోక్తి లేదు. 25 మంది స్టాఫ్, 300 మంది విద్యార్థులు గల ఈ పాఠశాలను రాబోయే రోజుల్లో మరింత నాణ్యతా ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తామని ఆమె ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు. త్వరలోనే సెమీ రెసిడెన్షియల్ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారు
సేవా దృక్పథంతో నెలకొల్పిన ఈ స్కూల్లో విలువలతో కూడిన బోధన పంచుతాం. మెరీడియన్ బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామనే నమ్మకంతోనే మాకు లభించింది. వ్యాపారం కోసం కాదు, పిల్లలను స్వేచ్ఛా జీవులుగా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేవిధంగా వారిని తీర్చిదిద్దుతాం. మా పాఠశాల ఏర్పాటుకు ఎంతో మంది సహకరించారు. భూ యజమాని దీప్కరణ్రెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రేఖారావు, స్థానిక నాయకుల సహకారం ఎప్పటికీ మరువలేనిది. చదువు చెప్పడంలో ఉన్న సంతృప్తి ఇతర ఏ రంగంలోనూ ఉండదు. అందుకే 2013లో మడికొండలో రామన్ హైస్కూల్ స్థాపించి ఎంతోమంది అనాథలకు విద్యనందిస్తున్నాం. మెరీడియన్లోనూ రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం.
- మాధురి, చైర్పర్సన్