Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటరితనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఓసారి ఎదురవుతుంది. అయితే కొందరు కొంతకాలం.. మరికొందరు చాలా కాలం పాటు ఒంటరిగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో చాలా మంది మానసికంగా కుంగిపోతారు. ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరని, జీవితం ఇంతేనా అనుకుంటూ బాధపడతారు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్లోకి వెళతారు. ఇలాంటి సమయాల్లో కింది సూత్రాలు పాటిస్తే ఒంటరితనంలో ఉన్న బాధపోయి.. లోన్లీనెస్‌ను ఆస్వాదిస్తారు.
ఒంటరితనం వల్ల వచ్చే పర్యవసానాలను ముందుగానే గుర్తించాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు అలవాట్లు మారడం, బద్దకంగా ఉండడం, సమయానికి తినకపోవడం లాంటివి జరుగుతుంటాయి. వీటి వల్ల రక్తపోటు, శరీరంలో కొవ్వు పెరగడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం లాంటివి ఎదురవుతాయి. అందుకే చురుగ్గా ఉండేలా, సమయానికి తినేలా ముందే ప్రణాళిక వేసుకోవాలి. చెడు అలవాట్లు సైతం చేరవయ్యే అవకాశం ఉండడంతో పాటి పట్ల కూడా నిగ్రహంగా ఉండాలని మనసుకు నచ్చజెప్పుకోవాలి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం.
ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో బంధం మరింత బలపరుచుకునే ప్రయత్నం చేయాలి. బయట వారిని తరచూ కలుస్తుండడంతో పాటు వీలైనప్పుడల్లా ఫోన్లలో మాట్లాడుతూ అభిప్రాయాలను పంచుకోవాలి. దీని ద్వారా వారి ఆలోచనలో ఉండి ఒంటరితనం అనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఆ మాటలన్నీ పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ జీవితం వృథా, ఇక ఇంతే లాంటి మాటలు ఎప్పటికీ దగ్గరికి రానీవకూడదు. ఒంటరితనంలో ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తున్నాం.. ఏదో సాధించేందుకే ఇలా ఉన్నా అని అనుకోవాలి. చేస్తున్న పనిని సాధిస్తామనే నమ్మకంతో ఉన్నామని తలుచుకోవాలి.
ఒంటరిగా ఉండడం ప్రారంభయ్యాక ఏదైనా కొత్త హాబీని కానీ.. ఉన్నదానిని మళ్లీ మొదలుపెట్టడమే చేయాలి. దీని ద్వారా ఏదో కొత్తగా నేర్చుకుంటున్నామన్న సంతృప్తి కలుగుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. ఖాళీ సమయం తెలియకుండానే ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యంగా మంచి, విజయవంతమైన వ్యక్తుల జీవితచరిత్రల పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం. దీనివల్ల కొత్త విషయాలు తెలియడంతో పాటు ఇతరుల అనుభవాల వల్ల జీవితంలో ఎలా ముందుకు సాగాలో, కష్ట సమయాలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులతో టచ్‌లో ఉండాలి. ఆన్లైన్ చర్చల్లో పాల్గొనడం కూడా చాలా మంచిది. అలాగే ఆసక్తి ఉన్న, చేస్తున్న పనికి ఉపయోగపడే విషయాలను ఇంటర్నెట్లో శోధించాలి. దీనిద్వారా జ్ఞానం పెరగడంతో పాటు సమయం ఇట్టే గడిచిపోతుంది.