Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందగడ్డను చూస్తే చాలామంది మొహం మాడ్చేస్తారు. కానీ ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే కందతో చేసే కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం...
కంద పులుసు
కావాల్సిన పదార్ధాలు: ఒక గిన్నె నిండా చిన్నగా తరిగిన కంద ముక్కలు, చింతపండు గుజ్జు - చిన్న గిన్నెడు, పచ్చిమిర్చి - ఆరు, ఉల్లిగడ్డ - ఒకటి (సన్నగా తరిగిన ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి, బెల్లం చిన్న ముక్క, కరివేపాకు, ఇంగువ, నూనె, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, గసగసాలు - మూడు స్పూన్లు, కొత్తిమీర - కొంచం.
తయారు చేయువిధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి అది వేడి ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా, పొడవుగా చీల్చి వేయాలి. అవి కొంచం వేగిన తర్వాత కంద ముక్కలు, చింతపండు గుజ్జు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, బెల్లం వేసి మరి కొద్దిసేపు ఉడికించాలి. ఇవి ఉడికేలోపు బాండీలో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, గసగసాలు, ఆవాలు నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి చల్లారాక పొడి చేసి వుడుకుతున్న పులుసులో వేసి కలపాలి. కమ్మని వాసనతో పులుసు కొంచెం చిక్క పడుతుంది. బాగా ఉడికి చిక్కబడ్డాక దించేముందు కొత్తిమీర వేసి దించేయాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది
కంద వడ
కావలసిన పదార్ధాలు: కంద తురుము - ఒక చిన్న గిన్నెడు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ - ఒకటి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు - 6 చెంచాలు (మిర్చి ముక్కలు ఎక్కువగా ఉండేలా వేసుకోవాలి. అల్లం ఘాటుకి పిల్లలు తినటానికి ఇష్టపడరు) కొత్తిమీర - సన్నగా తరిగినది. బియ్యపు పిండి - కొంచం, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించుకోవడానికి.
తయారు చేయు విధానం: వెడల్పాటి గిన్నెలోకి కంద తురుముతో పాటు మిగిలిన పదార్థాలు వేసి బాగా ముద్దలగా కలుపుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి బాగా వేడెక్కాక చిన్న చిన్న వడల్లాగ చేసి నూనెలో వేసి వేయించాలి. కొంచం ఎరుపు రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని టమాటో సాస్‌తో తింటే బావుంటాయి. (బియ్యపు పిండి వేయటం వలన కొంచం క్రిస్పీగా, బైండింగ్ చేయటానికి తేలికగా ఉంటుంది)
కంద అట్టు
కావలసిన పదార్ధాలు: కంద ముక్కలు - ఒక మీడియం సైజ్ గిన్నెడు, పెసరపప్పు - ఒక కప్పు, బియ్యము - అరకప్పు, ఉప్పు - తగినంత, అల్లం ముక్కలు - నాలుగు చిన్నవి, పచ్చి మిర్చి - నాలుగు, జీలకర్ర - ఒక చెంచా, కొత్తిమీర సన్నగా తరిగినది - ఒక చిన్న కట్ట. నూనె - సరిపడా.
తయారు చేయు విధానం: ముందుగా పెసర పప్పు, బియ్యాన్ని విడివిడిగా గంట నాన పెట్టుకోవాలి. అవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో కంద ముక్కలతో పాటుగా అన్ని వేసి కొంచం నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. పిండి గరిట జారుగా ఉండాలి. ఆ తర్వాత పెనం పెట్టి దానిమీద కొంచం నూనె వేసి అది వేడెక్కాక కొంచం మందంగా అట్టు వేసుకోవాలి. ముందు స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి రెండు నిమిషాల తర్వాత సిమ్‌లో పెట్టి సన్నని మంట మీద అట్టు కాలనివ్వాలి. నూనె వేసి బాగా కాలాక రెండోవైపు తిప్పుకొవాలి. ఇది వేడి వేడిగా అప్పటికప్పుడు అల్లం చట్నీతో కానీ ఆవకాయతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.
రోటీ పచ్చడి
కావలసిన పదార్ధాలు: కంద తురుము - ఒక చిన్న గిన్నెడు, చింతపండు గుజ్జు - నాలుగు స్పూన్లు, వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి - పది, మెంతులు - కొంచం, ఆవాలు - ఒక స్పూను, ఉప్పు - సరిపడా, పసుపు - చిటికెడు.
తయారు చేయువిధానం: ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి, ఆవాలు, మెంతులు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ఉప్పు తగినంత, పసుపు కొంచం, చింతపండు గుజ్జు నాలుగు స్పూన్లు వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత తురిమిన కందను వేసి మెత్తగా దంచుకోవాలి. బాగా అన్ని కలిసేట్టుగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసి వేరే బాండీలో కొంచం నూనె వేసి ఎండుమిర్చి, శనగపప్పు, ఇంగువ, మినపప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఎంతో బావుంటుంది
- పాలపర్తి సంధ్యారాణి