Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమ బెంగాల్‌కి చెందిన మహిళా రైతులు సాధికారత కార్యక్రమంలో చేరారు. వారి జీవితాల్లో ఊహించని మార్పులు చూడగలిగారు. మహిళా సాధికారతకై పని చేస్తున్న పెస్పికో, యుఎస్ఏఐడి వారి ఫార్మింగ్ ప్రోగ్రాం ద్వారా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామీణ మహిళా రైతులు ఉపాధిని పొందుతున్నారు. వారిలో మాలతి, షమీమా అనే మహిళా రైతులు ఆలుగడ్డ పండిస్తున్నారు. వాకి అనుభవాలు మనమూ తెలుసుకుందాం...
2019లో పెప్సికో మహిళల గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రోస్పెరిటీ (యుఎస్ఏఐడి) కింద యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (డబ్లూ-జీడీపీ)తో వ్యవసాయ రంగంలో మహిళలను శక్తివంతం చేయడానికి అలాగే మరింత స్థిరమైన ఆహార వ్యవస్థను నిర్మించడంలో కృషి చేస్తుంది. ఇది దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆలుగడ్డ పండించే మహిళా రైతులకు శక్తినిస్తూ కొత్త నైపుణ్యాలను అందిస్తుంది.
అవగాహనా కార్యక్రమాలు
ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 20 మిలియన్ల మహిళా రైతులు తమతో భాగస్వాములయ్యారని పెప్సికో, యుఎస్ఏఐడి ప్రకటించింది. పెప్సికో ప్రధాన ఉద్దేశం మహిళల కోసం పెట్టుబడి పెట్టడం. దీనివల్ల ఎక్కువ లాభదాయకత, స్థ్థిరత్వం అలాగే లింగ సమానత్వం, ఆర్థిక వృద్ధి వంటి అభివృద్ధి ఫలితాలు లభిస్తాయి. దీనికోసమే పశ్చిమ బెంగాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. అక్కడ పెప్సికో ఇండియా యుఎస్ఏఐడితో కలిసి రెండు సంవత్సరాలుగా పని చేస్తోంది. మహిళా రైతులకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ఉత్తమ నీటిపారుదల, పంట మార్పిడి పద్ధతులు, ఆర్థిక అక్షరాస్యత, వ్యవస్థాపకత మొదలైన వాటిపై అవగాహన కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తోంది. ఇవి వారు సొంతంగా ప్రధాన రైతులుగా మారడానికి సహాయపడతాయి.
లింగ వివక్షపై కూడా...
ఇతర కమ్యూనిటీ కార్యక్రమాలలో మహిళలు భూమిని లీజుకు తీసుకోవడానికి వారికి అవసరమరైన మద్దతు ఇవ్వడం, లింగ వివక్షలో మార్పులు తీసుకురావడానికి పురుషులు, మహిళలకు శిక్షణ ఇవ్వడం, మరింత సమానమైన, స్థిరమైన వ్యవసాయానికి స్థానిక విధానాలను రూపొందించడంలో అవగాహన కల్పించడం వీరి ముఖ్య లక్ష్యాలు.
ఎక్కువ మందికి చేరువ కావాలి
''ఇప్పటి వరకు మేము 1,000 మంది మహిళా రైతులకు ఆలుగడ్డ ఉత్పత్తిలో శిక్షణ అందించాము. 32 మంది పెప్సికో ఇండియా సిబ్బంది ద్వారా లింగ వివక్షపై అవగాహన కల్పించాము. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కూడా శిక్షణా మాడ్యూల్‌ను అభివృద్ధి చేసాం. ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్లో ఆలుగడ్డ పండించే కాలంలో 1,500 మంది మహిళా రైతులను భాగస్వామ్యం చేసుకోవాలని ఆశిస్తోంది. అంతిమంగా పశ్చిమ బెంగాల్లో శిక్షణా కార్యక్రమం రాబోయే కొద్ది సంవత్సరాలలో ప్రత్యక్ష, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా 3 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలకు చేరుకుంటుందని భావిస్తున్నాం'' ''అని పెప్సికో ఇండియా, వ్యవసాయం అసోసియేట్ డైరెక్టర్ ప్రతాప్ బోస్ చెప్పారు.
సొంత వ్యవసాయం చేస్తూ
పెప్సికో ఇండియా, యుఎస్ఏఐడి కూడా మహిళా రైతులకు వ్యవసాయ భూముల్లో పని చేయడానికి భూమిని లీజుకు ఇవ్వడానికి మద్దతు ఇస్తుంది. దాని నుండి వారు స్వతంత్రంగా ప్రయోజనం పొందవచ్చు. ఈ మహిళా సాధికారత కార్యక్రమంలో చేరి తమ జీవితాల్లో అద్భుతమైన మార్పులు చూసిన వారే మాలతీ, షమీమా.
వెనుకబడిన జిల్లాగా
హరిశ్చంద్రపూర్ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో మహానంద నదికి పశ్చిమాన, కాళింద్రికి ఉత్తరాన ఉంది. ఒండ్రు నేలలు, నదుల సమృద్ధి కారణంగా, ఇది అక్కడ ముఖ్యమైన వ్యవసాయ ప్రాంతం. దట్టమైన మానవ నివాసాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ ఈ జిల్లా వెనుకబడినదిగా జాబితాలో చేర్చబడింది. అలాగే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతుంది.
అద్భుతాలు చేశాయి
మాలతి హరిశ్చంద్రపూర్‌లో ఆలుగడ్డ పండించే వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. కంపెనీ 'మహిళా సాధికారత ఇనిషియేటివ్' కింద రెండు సంవత్సరాలుగా పెప్సికో ఇండియాతో కలిసి పని చేస్తున్నారు. మాలతి దంపతులిద్దరికీ కలిపి 0.8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత 22 ఏండ్లుగా వీరి ఈ భూమిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ప్రోగ్రామ్‌లో చేరిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పు గురించి మాలతి మాట్లాడుతూ ''ఉత్తమ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకోవడంలో శిక్షణా మాడ్యూల్స్ మాకు సహాయం చేశాయి. ఇవి చివరికి ఉత్పత్తిని పెంచడంలో మాకు అద్భుతాలు చేశాయి. ఇప్పుడు ఆలుగడ్డ పెంపకం మొత్తం ప్రక్రియలో ఏం జరుగుతుందో, ప్రతి దశ ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మేము అర్థం చేసుకున్నాము'' అన్నారు.
గతంలో అవగాహన లేదు
పెప్సికో ఇండియా 'ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్'లో చేరడానికి ముందు మాలతి తన భర్త కలిసి లాభదాయకం కాని ఇతర రకాల విత్తనాలను పండించేవారు. పంట ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆ సమయంలో ఆమెకు వ్యవసాయం గురించి, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో శిక్షణ ఇచ్చేవారు లేరు. పంటకు పట్టిన చీడను తొలగించి దాన్ని కాపాడుకునే ఎరువులు అందుబాటులో లేవు.
కుటుంబ అవసరాలు తీర్చగలిగారు
మాలతీ ఇప్పుడు వ్యవసాయ ప్రక్రియలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా ఆలుగడ్డ మొక్కలకు అవసరమైన పోషకాహారం, సాధారణ తెగుళ్ళను ఎలా ఎదుర్కోవాలి మొదలైన అనేక అంశాలపై తన భర్తకు అవగాహన కల్పిస్తుంది. ఆమె ఇటీవల సంపాదించిన లాభాలతో తన కుటుంబానికి ఒక గొట్టపు బావి, టాయిలెట్‌ని నిర్మించగలిగింది. మాలతి మహిళా సాధికారత కార్యక్రమంలో చేరిన తర్వాత మాత్రమే తన కుటుంబానికి ప్రాథమిక సౌకర్యాలు సాధ్యమయ్యాయి. ''నేను మరింత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి నా కుటుంబానికి ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను. వచ్చే ఆలుగడ్డ సీజన్లో గ్రూప్ సేద్యానికి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నాను'' అని మాలతి చెప్పారు.
గృహిణి గ్రూపు లీడరయ్యారు
షమీమా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలోని మొలరుపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు. పెప్సికో ఇండియాతో రెండేండ్లకు పైగా అనుబంధాన్ని కలిగి ఉంది. పెప్సికో, యుఎస్ఏఐడి వారి మహిళా సాధికారత కార్యక్రమంలో చేరడానికి ముందు గృహిణిగా ఉండేవారు. ఈరోజు ఆమె ఈద్ ముబారక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కు లీడర్. మలరుపూర్-ఐ గ్రామం హుగ్లీ-చుచురా జిల్లా కేంద్రానికి పశ్చిమాన 72 కి.మీ దూరంలో ఉంది. ఇది హుగ్లీ, బర్ధమాన్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ గ్రామస్తులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి.
ఒక్క పైసా సంపాదించని నేను
తాను మంచి లాభాలు సంపాదిస్తున్నానని, ఇది ఇంటి ఖర్చులకు తన సహకారం అందించిందని, ప్రస్తుతం నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న తన కుమార్తె అవసరాలు తీర్చగలుగుతున్నాని షమీమా చెప్పింది. ''ఒక్క పైసా సంపాదించని నేను ఇప్పుడు నా భర్తతో కలిసి ఇంటి ఆర్థిక అవసరాలు తీర్చగలుగుతున్నాను. నేను చాలా దూరం వచ్చినట్టు భావిస్తున్నాను. ఈ సంవత్సరం నా గ్రూప్‌కి రూ.56,000 లాభం పెంచగలిగాను'' అని షమీమా చెప్పింది.
లాభాల విషయంలో భయం లేదు
నేను కంపెనీతో పని చేసిన తర్వాత మరింత సంపా దించడం ప్రారంభించాను. ఇది అంతకుముందు అసాధ్యం. గతంలోనైతే ముందుగా అంగీకరించిన ధరలకే స్థిరంగా ఉండిపోయే వాళ్ళం. దాని వల్ల మాకు లాభాలు వచ్చేవి కావు. ఇప్పుడు ధర గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాలతో పాటు, మహిళా రైతులకు ప్రత్యేకంగా వ్యవసాయ శిక్షణ ఎలా నిర్వహించ బడుతుందో ఈ సాధారణ శిక్షణా కేంద్రాలు మా కమ్యూనిటీకి ఎలా ప్రయోజనం చేకూరుస్తున్నాయో చూసేందుకు నేను సంతోషిస్తున్నాను.
- మాలతి, హరిశ్చంద్రపూర్
మగ రైతులకు సమానంగా...
పెప్సికో ఇండియా ఆలుగడ్డను పండించడంలో వివిధ అంశాలపై మాకు శిక్షణనిస్తుంది. సరైన పురుగుమందులు, ఎరువులపై మాకు సలహా ఇస్తుంది. ఈ కారణంగా మా దిగుబడి కూడా మెరుగుపడింది. నేను ఇప్పుడు స్వతంత్రంగా ఫీల్డ్‌లో పని చేస్తున్నాను. పెప్సికో ఇండియాకు ఆలుగడ్డను సరఫరా చేస్తున్నాను. ఇప్పుడు నా గ్రూపు సభ్యులు, నేనూ కలిసి మగ రైతుల మాదిరిగానే మా యూనిట్ నుండి నాణ్యత, పరిమాణంలో సమానమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయగలం. నా భర్తకు అతని వ్యాపారంలో సహకరించడంతో పాటు నా తోటి సభ్యులకు అవసరమైనప్పుడు వ్యవసాయంలో వివిధ దశలలో మద్దతు ఇవ్వగలను.
- షమీమా, మొలరుపూర్
- సలీమ