Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవార్డు గెలుచుకున్న వికలాంగ హక్కుల కార్యకర్త, అంతర్జాతీయ ప్రేరణాత్మక వక్త, ఫ్యాషన్ మోడల్, బాడీ పాజిటివిటీ అడ్వకేట్... డాక్టర్ మాళవిక అయ్యర్. ''మీరు మిమ్మల్ని అంగీకరించినప్పుడు, మీరు అజేయంగా ఉంటారు'' అంటూ నమ్మకంతో చెప్పింది. ఆ విశ్వాసం వెనుక తనను తాను కనుగొనడంలో సంవత్సరాల పోరాటం ఉంది. ఒక భయంకరమైన సంఘటన ఆమె శరీరాన్ని విచ్ఛిన్నం చేసింది. కేవలం 13 ఏండ్ల వయసులో తన రెండు చేతులను కోల్పోయింది. సంవత్సరం పాటు మంచానపడింది. అలాంటి ఆమె ఇప్పుడు శక్తికి చిహ్నం.. ఎందరికో ప్రేరణ. వైకల్యం ఉన్న వారి పట్ల సమాజ వైఖరిలో ముఖ్యంగా యువతల ఆలోచనల్లో మార్పు రావాలని గట్టిగా పోరాడుతున్న ఆమె గురించి...
మాళవిక అయ్యర్... 2002లో బికనీర్‌లోని ఆమె ఇంట్లో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది. ''ఇది నన్ను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసింది. నా కుటుంబాన్ని కూడా దెబ్బతీసింది. సాధారణ జీవితాన్ని గడిపే మా జీవితాలను ఈ ప్రమాదం అంతా తలకిందులు చేసింది. ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ నేను వైకల్యంతో ఉన్న వ్యక్తినని, నా తల్లిదండ్రులకు నేను భారం అనే విషయం గురించి మా కుటుంబంలో ఎప్పుడూ చర్చజరగలేదు. ఆ ప్రమాదంలో నేను 80 శాతం రక్తాన్ని కోల్పోయాను. రక్తం బాగా తగ్గిపోయిందని, నేను బతకడం చాలా కష్టమని వైద్యులు చెప్పారు. నన్ను ఎలాగైనా బతికించుకోవాలని అమ్మ తపన పడింది. చేతులు లేకపోయినా కనీసం బిడ్డ ప్రాణాలతో దక్కితే చాలు, తన అవసరాలన్నీ నేను చూసుకుంటా అని కన్నీళ్ళు పెట్టుకుంది'' అంటూ అప్పటి రోజులను మాళవిక గుర్తు చేసుకుంది.
వెంటాడే మాటలు..చూపులు
చుట్టుపక్కల వారు మాత్రం ఆమె వైకాల్యాన్ని చూసి సానుభూతి చూపించేవారు. ఆసుపత్రులకు వెళుతున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు 'బేచారి లడ్కీ', 'ఆమె ఎలా చదువుకుంటుంది', 'ఆమెను ఎవరు పెండ్లి చేసుకుంటారు?'' అనే మాటలు ఎక్కువగా వినిపించేవి. వీటన్నింటినీ తట్టుకుని మాళవిక తిరిగి పాఠశాలలో చేరి స్కూలింగ్ పూర్తి చేసుకుని కాలేజీలో చేరిన తర్వాత కూడా అలాంటి మాటలే ఆమెను వెంటాడాయి. వారి మాటలు, చూపులు ఆమెలో కొంత అభద్రతా భావాన్ని, ఎన్నో సందేహాలను తెచ్చిపెట్టాయి. కొన్నిసార్లు ఈ చూపులు, మాటలు భరించడం ఆమెకెంతో కష్టంగా ఉండేది. ఓ వికలాంగురాలిగా, అందులోనూ ఓ మహిళగా ఈ సమాజంలో ఎదగడం ఆమెకు ఓ రకమైన సవాలుగా మారింది.
డాక్టరల్ థీసిస్ కోసం...
వివక్షకు గురైన మాళవికను వైకల్యాలున్న వ్యక్తుల పట్ల సమాజ వైఖరి, అడ్డంకులు డాక్టరల్ థీసిస్‌ను కొనసాగించేలా చేశాయి. వైకల్యాలున్న వారి పట్ల యువకుల వైఖరిని అర్థం చేసుకోవడమే ఆమె లక్ష్యం. దీనికోసం చెన్నైలోని సుమారు 1,000 మంది కళాశాల విద్యార్థులను ఇంటర్వ్యూ చేసింది. వివక్షతతో కూడిన ఆలోచనలు, నమ్మకాలు, చిన్న వయసులోనే ప్రారంభమవుతాయని, వ్యక్తులు తమకు భిన్నంగా ఇతరులను చూసినప్పుడు తేడాలను అంగీకరించడం కష్టమని తన పరిశోధనలో సేకరించింది.
సమగ్ర వైఖరి అవసరం
''వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల మరింత ఓపెన్ మైండ్ ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులతో ముందుగా పరిచయం కలిగి ఉన్నారా లేదా?, వారు అలాంటి అంశాల గురించి చదివారా? ఇలాంటి ప్రశ్నలు అడిగి పరిశోధనను వీలైనంత సమగ్రంగా చేయడానికి నేను ప్రయత్నించాను. వివాహం, సంబంధాల గురించి కూడా సమాచారాన్ని సేకరించాను. యువతకు ప్రత్యేకించి వారు మన భవిష్యత్ మార్పు రూపకర్తలు లేదా విధాన రూపకర్తలు. భిన్నంగా ఉండే వారి పట్ల యువత సమగ్ర వైఖరిని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను'' మాళవిక చెప్పింది.
సమాన అవకాశాల కోసం...
2017లో న్యూయార్క్ నగరంలో యునైటెడ్ నేషన్స్‌లో సంబంధిత అంశాలపై మాళవిక చేసిన ప్రసంగానికి ఆమె ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆమె వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇండియా ఎకనామిక్ సమ్మిట్ 2017లో అతి పిన్న వయస్కురాలిగా ఉండి కో-చైర్‌గా పనిచేసింది. ''నేను యువకులు, మహిళలు, వైకల్యాలున్న వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వైకల్యాలున్న వ్యక్తుల జీవితాలు మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియాలి. రాజకీయాలు, పాలన... ఇలా వారు ఎంచుకున్న ఏ రంగంలోనైనా సమానంగా పాల్గొనగల వ్యక్తులుగా తయారవ్వాలి'' అంటుంది.
అనుచిత వాఖ్యలతో...
మనం విషయాలను ఎలా గ్రహిస్తాము అనేది మనపై ఆధారపడి ఉంటుందని మాళవిక అభిప్రాయం. ''వైఖరి అనేది చాలా ముఖ్యమైన భావన. మేము యువ మనసును అర్థం చేసుకుని వారికి సమాజంలో వ్యక్తులు భిన్నంగా ఉండటం, ప్రతి ఒక్కరినీ అంగీకరించడం, అలాంటి వారిని మరింత కలుపుకొని ఉండటం గురించి విస్తృత దృక్పథాన్ని అందిస్తాము'' అంటుంది మాళవిక. రాష్ట్రపతి నుండి నారీ శక్తి పురస్కారం అందుకున్న తర్వాత ఢిల్లీ నుండి చెన్నైకి వెళుతున్నప్పుడు 2018లో జరిగిన ఒక సంఘటన గురించి ఆమె మాట్లాడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న డాక్టర్ మాళవిక తన గురించి గర్వంగా, సంతోషంగా మోసుకెళ్తున్న భారీ ఫ్రేమ్‌కి ఈ అవార్డు లభించింది. ''నేను ఎక్కబోతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారు అవార్డుపై రాసిన వాటిని సులభంగా చదవగలిగారు. నన్ను అభినందించాలి అని వచ్చిన వారు నన్ను అనుచితమైన, అసహ్యకరమైన ప్రశ్నలతో నన్ను రెచ్చగొట్టారు. అది మాత్రమే నాకు అర్థమైంది'' అన్నది.
మార్పు అవసరం
మాళవిక తన స్వయం కృషికి గుర్తింపు పొందకపోవడం అన్యాయమని భావించింది. ప్రజలు దానిని దాటి చూడలేరు. కేవలం వైకల్యం ఉన్న వ్యక్తిగానే ఆమెను గుర్తించారు. ఇటువంటి వివక్షాపూరిత వైఖరిలో మార్పును తీసుకురావాలని ఆమె కోరుకుంటుంది. ఈ రోజు డాక్టర్ మాళవిక ఇతర వ్యక్తుల మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి రోజూ ఉదయం తన భర్తకు కాఫీ చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దుస్తులు ధరించడం, మేకప్ వేసుకోవడం వరకు అన్నీ స్వయంగా చేస్తున్నారు. ఆమె సొంతంగా చేసుకోలేని ఒకే ఒకటి తన జుట్టును పోనీటైల్లో కట్టడం. ఒకప్పుడు వంట చేయడం ఓ సవాలుగా ఉండేది. ఆమె ఇప్పుడు రుచినిచ్చే వంటకాలను సులభంగా చేయగలదు.
కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి
స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి అనేక మందికి స్ఫూర్తినిస్తుంది. సమ్మిళిత సమాజాన్ని నిర్మించాలని వాదిస్తుంది. ప్రమాదం జరగకపోతే మీ జీవితం ఎలా ఉండేది అని ఆమెను అడిగితే ''నా గురించి కానీ, మా అమ్మ వ్యక్తిత్వాలను తెలుసుకుంటే నేను కచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని గడిపేదాన్ని. కానీ ప్రమాదం, నా వైకల్యం, నా అనుభవాలు నాకు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి. నన్ను వినయంగా మార్చాయి. సంతృప్తిగా ఉండేలా నేర్పించాయి.
ఇప్పుడూ నేను మోడల్‌నే
ప్రమాదానికి ముందు కథక్ నేర్చుకునేదాన్ని. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా చేతులతో వస్తువులను రూపొందించడమంటే ఇంకా ఇష్టం. గ్రౌండ్‌కు వెళ్ళి ఆటలు ఆడటమంటే ఇష్టం. ఈ ప్రమాదం నాకు సంషాన్ని ఇచ్చే ఈ పనులన్నింటినీ చేయగల సామర్థ్యాన్ని నా నుండి దూరం చేసింది. మా అత్త ఎప్పుడూ చెబుతుంది... నాది చిన్నప్పటి నుండి నలుగురితో కలిసిపోయే స్నేహపూర్వక మనస్థత్వమని. కాబట్టి ప్రమాదం జరగకపోతే నా వ్యక్తిత్వం కచ్చితంగా అలాగే ఉండేది. నేను బహుశా డిజైనింగ్, డెకరేటింగ్, డ్యాన్స్ లేదా మోడలింగ్‌లో కెరీర్‌ని కొనసాగించేదాన్ని. కానీ నేను ఇప్పటికీ మోడల్‌గా ఉన్నాను (నవ్వుతూ). కాబట్టి అది నా నుండి తీసివేయబడలేదు'' అని ఆమె సమాధానం ఇచ్చింది.
ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను
మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా మార్చాలనుకుంటున్నారా? అని అడిగితే ''నిజం చెప్పాలంటే నేను ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను. నా చేతులు వెనక్కి రావాలని లేదా ప్రమాదం జరిగిన రోజు ఎప్పుడూ జరగకూడదని నేను కోరుకోవడం లేదు. నేను ఆ రోజు నుండి విపరీతమైన సంఘటనలను అనుభవించాను. చాలా తక్కువ నష్టాలను చవిచూశాను. కానీ అవన్నీ నన్ను బలమైన వ్యక్తిగా మార్చాయి. నేను ఉండాలనుకునే వ్యక్తిత్వం ఇదే. నేను ఆస్వాదిం చాలనుకునే, ఆరాధించాలనుకునే అనుభవాలు ఇవే. నేను చేయాలనుకుంటున్న పని ఇదే. మనసులో ఎప్పుడూ నేను ఈ జీవితాన్ని ఎంచుకుంటాను.
- సలీమ