Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటి వరకు కరోనా వైరస్, కరోనా డెల్టా వేరియంట్ వచ్చి రెండుసార్లు భయపెట్టాయి. థర్డ్‌వేవ్‌లో 'కరోనా ఒమిక్రాన్' భయపెట్టడానికి తయారవుతున్నది. ప్రస్తుతం 'ఒమిక్రాన్' వైరస్ పదమూడు దేశాలపై పడగ విప్పింది. ఆయా దేశాల్లో ఇంకా వాక్సిన్ తీసుకోనివారు వెంటనే వేయించుకుంటున్నారట. ఇజ్రాయిల్, మొరాకో దేశాలు విమాన రాకపోకల్ని నిషేధించాయి. 'ఒమిక్రాన్' చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీనిని కనుగొన్న నాలుగు రోజుల్లోనే పదమూడు దేశాలకు వ్యాపించింది. అంతర్జాతీయ రాకపోకలను తగ్గించడమో, నిషేధించడమో చేస్తే మన దేశానికి రాకుండా ఆపవచ్చు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, హాంకాంగ్, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్, బోట్స్వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, ఇజ్రాయిల్ మొదలైన దేశాల్లో కొత్త కరోనా ఒమిక్రాన్ విధులు నిర్వహిస్తోంది. 'ఒమిక్రాన్ స్పైక్ ప్రోటిన్'లో దాదాపు 30 రకాల మ్యుటేషన్లు ఉన్నాయని గుర్తించారు. కొత్త కరోనా ఒమిక్రాన్ దక్షిణ ఆఫ్రికాను మాతృదేశంగా ఎంచుకున్నది. డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మనం జాగ్రత్తలు తీసుకుంటే అది ఏమీ చేయలేదు. కాబట్టి ఇంట్లో క్షేమంగా ఉందాం... పడేసే వస్తువులతో బొమ్మలు చేద్దాం..!
ఇంజక్షన్ల మూతలతో...
ఎప్పుడు సంపద కలిగిన, నప్పుడే బంధువులు వత్తురది యెట్లన్నన్, దెప్పలుగ జెరువునిండిన, గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ, అని సుమతీ శతక కారుడు డబ్బులు వచ్చినపుడు బంధువులు వస్తారని చెప్పాడు. దానికి ఉదాహరణగా నీళ్ళతో నిండిన చెరువులో అప్పటి వరకూ లేని కప్పలు చేరినట్లుగా చెప్పాడు. తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన కథలు, పద్యాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. ఇంజక్షన్ల సీసాలలో కూడా చిన్నగా ఉండే ఇంజక్షన్ల సీసాల మూతలతో ఈ కప్పను చేశాను. కప్పలు చెరువులు, మడుగల దగ్గర గెంతుతూ కనిపిస్తాయి. నేను ఎర్రని మూతలతో కప్పను చేశాను. దాని లోపల శరీరమంతా బులుగు రంగు ముగ్గుతో నింపాను. మొత్తానికి వింత రంగుల్లో కప్పను తయారు చేశాను. విరోచనాలకు ఇచ్చే మైకానిక్ ఇంజక్షన్లకు ఇలాంటి చిన్న చిన్న మూతలు వస్తాయి. అలాంటి ప్రత్యేకమైన మూతల్ని తీసుకొని కప్పని చేశాను. కప్పల అరుపు బెకబెక మంటూ ఉంటాయి. ఇవి నడవటం కాదు గెంతుతూ ఉంటాయి. వీటికి ముందు వైపున్న కాళ్ళు పొట్టిగా ఉంటాయి. వెనకవైపున్న చరమాంగాలు పొడవుగా ఉంటాయి. ఇలా ముందు కాళ్ళు పొట్టిగా, వెనక కాళ్ళు పొడుగ్గా ఉండటం వల్ల గెంతుతూ నడిచినట్టు అనిపిస్తుంది.
పిస్తా పప్పులతో...
ప్రతిసారీ పిస్తా పప్పు వలుచుకుని తిన్న తర్వాత మిగిలిన పొట్టుతో బొమ్మలు చేసేదాన్ని. ఈసారి తినకముందే చేద్దామని పప్పుతో సహా బొమ్మను చేశాను. గెంతే కప్పను తయారు చేశాను. కప్ప మొహం, శరీరం పిస్తా పప్పులతో చేసి బార్డర్‌గా పిస్తా పొట్టును పెట్టాను. శరీరానికి కొన్ని చింతగింజల్ని కూడా చేర్చాను. కప్పను నవ్వుతున్నట్టుగా చిత్రీకరించాను. కప్ప నవ్వుతున్నది గానీ దానిని చూసి వణికిన సందర్భాలున్నాయి. కాలేజీలో చేరి ఇంటర్లో బైపీసీ తీసుకున్నపుడు మొదటగా డిసెక్షన్ చేయించేది కప్పనే. ఇంటర్లో బొద్దింక, కప్ప రెండింటితోనే దాదాపుగా సరిపోతుంది. ఒకసారి కప్ప నాలుగు కాళ్ళకు మేకులు కొట్టి డిసెక్షన్ మొదలుపెట్టాను. నేను కత్తెరతో కట్ చేయగానే కప్ప ఎగిరింది. కప్పతో పాటు నేను కూడా ఎగిరాను. కప్ప ఎక్కడో పడిపోయింది. దానికి మత్తు పోయి అలా ఎగిరింది. దాన్ని వదిలి వేరే దానితో డిసెక్షన్ చేశాను. రెండో స్పెసిమన్ అడిగితే మేడమ్ కోప్పడేది. ఈ కప్ప బొమ్మను రికార్డుల్లో ఎన్ని సార్లు వేశామో! నేను కప్ప అంతరంగ భాగాలను చిత్రించినపుడు లోపల ఉన్న గుడ్లను బాగా వేశానని డిగ్రీ వాళ్ళను పిలిపించి చూపింది మా మేడమ్. నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణవ్యవస్థ ఎన్నో బొమ్మలు వేసి డిసెక్షన్లు చేశాం. అలాంటి కప్పను నేనీ రోజు మరల మీ ముందుకు తెచ్చాను.
వడియాలతో...
వడియాలతో ఇంతకు ముందు చాలా రకాల బొమ్మలు చేసుకున్నాం. ఈరోజు వడియాలతో కప్పను చేశాను. చిన్నతనంలో చైనా వాళ్ళు కప్పల్ని పాముల్ని తింటారని చేప్పేవాళ్ళు. నేను మొదటిసారి చైనా వెళ్ళినపుడు నాకు ఈ విషయం తప్ప చైనా గురించి ఏమీ తెలియదు. మింగ్ రాజుల పరిపాలన మంగోలుల దండయాత్ర, చిత్రలిపి లాంటి భాష, మావో లాంటి నాయకుల గురించి ఏమో తెలియదు. కప్పలు నీళ్ళలోనూ, నేల మీదా బతకగలిగే ఆభయచరాలు. కప్పను మండూకం, శాలూకము అని కూడా అంటారు. కప్ప 'చిరుకప్పగా' ఉన్న దశలో తోక ఉంటుంది. చిరుకప్ప ప్రౌఢ జీవిగా మారేటపప్పటికి తోక పోతుంది. అందుకే దీనిని గ్రీకు భాషలో 'అనూర' అంటారు. అంటే గ్రీకు భాషలో 'తోక లేకుండా' అని అర్థమట. ఇవి నీటి కుంటలలో గుడ్లు పెడతాయి. గుడ్లు చిరుకప్పలుగా మారి ఆ తర్వాత అభివృద్ధి చెందిన కప్పలుగా మారతాయి. చిరుకప్పను 'టాడ్‌పోల్' అంటారు. కార్టేటా వర్గానికి, యాంఫీబియా విభాగానికి చెందిన జీవులు కప్పలు.
పెడిగ్రీతో...
'పెడిగ్రీ అనేది కుక్కల ఆహారం. ఈ ఆహారం వాటికి అనువుగా తయారు చేయబడుతుంది. చాలా వరకు ఎముకల ఆకారంలో ఉంటాయి. అవి నిండు కాఫీ రంగులోనూ, గోధుమ రంగులోనూ దొరుకుతున్నాయి. చిన్న చిన్న బాల్స్ ఆకారంలోనూ, చిన్న త్రికోణాకృతుల్లోనూ, చిన్న ముద్దులుగానూ, కొద్దిగా పొడవుగానూ రకరకాల ఆకారాల్లో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు నేను కప్పను చేసింది గోధుమ రంగులో ఉండే ముద్దల్లాంటి ఆకారం గల పెడిగ్రీ. ఈ కప్ప కూడా గెంతుతూ వచ్చింది. మిడిగుడ్లేసుకొని నవ్వుతూ వచ్చింది. ప్రౌఢ జీవులైన కప్పలు సర్వభక్షకాలుగా అన్నింటినీ తింటాయి. ఇవి ఆర్థ్రోపొడా, అనెలిడా, మొలస్కా వర్గపు జీవుల్ని తిని బతుకుతాయి. ఈ కప్పలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ కప్పలలో ప్రస్తుతం 5000 జాతులు ఉన్నాయి. అన్ని జంతువుల్లాగే ఈ కప్పల జాతులు కూడా అంతరించి పోతున్నాయి. ఇది ఉష్ణ మండాలలోనూ, సమశీతోష్ణ మండలాల్లోనూ జీవిస్తాయి.
చింతగింజలతో...
నేను వంటింట్లో దొరికే చింత గింజలతో కప్పను చేశాను. కప్ప ఆకారం తయారు చేశాక మధ్య భాగమంతా రంగుగా కనపడాలని బ్రౌన్ రైస్‌తో నింపాను. గోధుమ రంగు చర్మంతో నిగనిగలాడుతూ బెకబెకమంటూ వచ్చింది. కప్పల్లో గోధురు కప్పలు, విషపు కప్పలు, చెట్ల మీద కప్పలు, మామూలు కప్పలు అని ఎన్నో రకాలుంటాయి. అన్నింటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే వీటిలో ఎగిరే కప్పలు కూడా ఉంటాయి. వాటి శాస్త్రీయ నామం రాకోఫోరస్. నేను దీని గురించి వ్యాసం రాసినపుడు చాలా మంది ఆశ్చర్యంగా అడిగారు. అలాగే 'ఎలైటిస్' అనే మంత్రసాని కప్ప కూడా ఉంటుంది. కప్పలకు తల, మొండెం మాత్రమే ఉంటాయి. మెడ ఉండదు. కాళ్ళ వేళ్ళ మధ్య వల లాంటి నిర్మాణం ఉంటుంది. దీని వలననే ఇవి నీటిలో ఈదగలుగుతాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్