Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంజు బాబీ జార్జ్... వెటరన్ స్ప్రింటర్ ప్రపంచ అథ్లెటిక్స్ 2021లో మన దేశం తరపున ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. ఈ అవార్డులను ప్రతి ఏడాదీ అందజేస్తారు. ప్రస్తుతం కరోనా కారణంగా వర్చువల్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన మొదటి, ఏకైక భారతీయ క్రీడాకారిణి ఈమె. 2003లో పారిస్‌లో జరిగిన అథ్లెటిక్స్‌లో లాంగ్ జంప్‌లో కాంస్యం గెలుచుకుంది.
కేరళ రాష్ట్రం కొట్టయాన్లోని చీరంచిర గ్రామానికి చెందిన నలభై నాలుగేండ్ల మాజీ అంతర్జాతీయ లాంగ్ జంప్ స్టార్ ఇప్పటికీ క్రీడలో చురుకుగా పాల్గొంటుంది. ఆమె తండ్రి కె.టి మార్కోస్ ప్రోత్సాహంతో అథ్లెట్స్లోకి ప్రవేశించారు. పాఠశాల స్థాయిలోనే మంచి ప్రతిభ కనబరచిన అంజూను కోచ్ ఎంతో ప్రోత్సహించారు. 1991-92లో జరిగిన స్కూల్ అథ్లెటిక్ మీట్లో 100 మీటర్ల హర్డిల్స్, రిలేలో గెలిచింది. అలాగే లాంగ్ జంప్, హైజంప్‌లో రెండవ స్థానంలో నిలిచింది. దాంతో మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. పాఠశాల స్థాయిలో జరిగిన జాతీయ పోటీలలో 100 మీటర్ల హర్డిల్స్, రిలేలో మూడవ స్థానం గెలుచుకుంది. అప్పటి నుండి ఆమె ప్రయాణం సాగుతూనే ఉంది.
ప్రపంచ ఛాంపియన్‌గా
1996 లో జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్, అలాగే నేపాల్‌లో జరిగిన సౌట్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ అందుకుంది. 2001లో జాతీయ స్థాయలో జరిగిన పోటీల్లో లాంగ్‌జంప్‌లో రికార్డు సృష్టించింది. 2003లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది అర్జున అవార్డు అందుకుంది. 2004లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ కూడా అందుకుంది. 2021లో బిబిసి వారి లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డును అందుకుంది.
బలమైన న్యాయవాది
2016లో యువతుల కోసం శిక్షణా అకా డమీని స్థాపించింది. ఇది ఇప్పటికే ప్రపంచ యు20 పతక విజేతను తయారు చేసింది. ఆమె ప్రస్తుతం ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అలాగే అథ్లెటిక్స్‌లో లింగ సమానత్వం కోసం మాట్లాడుతున్న బలమైన న్యాయవాది. ఆమె భవిష్యత్తులో క్రీడల్లో నాయకత్వ పాత్రల కోసం యువతులకు మంచి కోచింగ్‌తో పాటు మార్గదర్శకత్వం చేస్తుంది. భారతదేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధికి ఆమె చేసిన కృషికిగాను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆమెను గుర్తించింది ఈ అవార్డును ఆమెకు అందజేస్తుంది. అంజు కృషిని గుర్తించి సత్కరించినందుకు ప్రపంచ అథ్లెటిక్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భారత అథ్లెటిక్స్ సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది. ఇది భారత అథ్లెటిక్స్‌కు గర్వకారణం అని వారు అంటున్నారు. ''ప్రపంచ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2021 విజేతలందరికీ అభినందనలు'' అని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
జంటగా కృషి
అంతర్జాతీయ వేదికపై తనకు గుర్తింపు లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అంజూ ''ప్రపంచ అథ్లెటిక్స్ నుండి వచ్చిన అవార్డు నేను అస్సలు ఊహించనిది. గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను'' అని సంతోషంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అంజు, తన భర్త బాబీ ద్వారా తన కలలను కొనసాగించ గలిగిందనీ, భర్త ప్రోత్సహించడంతో వారు ఇప్పుడు భవిష్యత్తులో అథ్లెట్లను జంటగా కలిసి పెంచుతున్నామని పేర్కొంది.
భవిష్యత్ క్రీడాకారుల కోసం
ఇంతకుముందు నేను దేశం కోసం పతకాలు, ట్రోఫీలు సాధించాను. ఇప్పుడు దేశానికి తిరిగి ఇచ్చే మార్గంలో పతకాలు సాధించడానికి భవిష్యత్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం నా ప్రధాన కర్తవ్యంగా అనుకుంటున్నాను. ఈ సంప్రదాయం రాబోయే సంవత్సరాల్లో కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను'' అని ఆమె చెప్పింది. అంజు, ఆమె భర్త ప్రస్తుతం బెంగళూరులోని అంజు బాబీ స్పోర్ట్స్ అకాడమీలో 13 మంది యువతులకు శిక్షణ ఇస్తున్నారు.
స్వల్ప వ్యవధిలోనే
ఈ సంవత్సరం 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నా పేరును పరిశీలిస్తున్నట్టు తెలుసుకున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఒక క్రీడాకారిణిగా చాలా కష్టమైన ప్రయాణం నాది. కానీ నేను అర్హమైన స్థాయికి చేరుకోగలనని ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇప్పుడు ఇది నా వంతు. నేను ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. నా అకాడమీ 'అంజు బాబీ స్పోర్ట్స్ ఫౌండేషన్' 13 మంది మహిళా అథ్లెట్లను, చిన్న పిల్లలను పోషిస్తోంది. మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో వారందరూ ప్రపంచ స్థాయిలో ప్రయాణిస్తారు. నా మద్దతుదారులందరికీ, నా తోటి అథ్లెట్లు, కోచ్‌లు, నా కుటుంబం, సమాఖ్య, నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను పరిగణనలోకి తీసుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు.
- అంజు బాబీ జార్జ్
- సలీమ