Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైన్స్ అంటే చాలు ''బాబోరు మాకు వద్దు... చాలా కష్టమైన సబ్జెక్ట్..'' అంటూ భయపడే విద్యార్థులు ఎందరో ఉంటారు. అలాంటి వారికి ఎంతో సులభమైన పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు టీచర్ రీతూ గేరా... అధునాతన టెక్నాలజీని ఉపయోగించి సబ్జెక్ట్ పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని పోగొడుతున్నారు. ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్లైన్ తరగతుల్లోనూ ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. నిత్యం విద్యార్థులతో మమేకమై వారిలోని ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సబ్జెక్ట్‌తో జోడించి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
టీచర్ రీతూ గేరా... ఓ ఆర్మీ అధికారి కుమార్తె. దాంతో ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీలు. సామాన్లు ప్యాక్ చేసుకోవడం, తరలి వెళ్ళడం, పాత స్నేహితులను విడిచిపెట్టడం, కొత్త స్కూల్లో మిడ్‌సెషన్‌లో చేరడం, కొత్త పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం, వెళ్ళిన ప్రతి చోటా తనని తాను బయటి వ్యక్తిలా భావించడం... ఇలాంటి కొన్ని సవాళ్లు ఆమె జీవితంలో సాధారణమయ్యాయి. రీతూ తన 10వ తరగతి పరీక్షలను హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలోని యోల్ అనే చిన్న కంటోన్మెంట్ నగరంలో పూర్తి చేసింది. ఆ సమయంలో పై చదువు అక్కడ అందుబాటులో లేదు. దాంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి జైపూర్‌లోని తన తాతయ్య ఇంటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు.
జీవిత పాఠాలు నేర్పాయి
నిర్థిష్టమైన ఆలోచనలు కలిగి, బలమైన క్రమశిక్షణ రీతూ జీవితంలో అనేక సవాళ్లను అధిగమించడంలో సహాయపడింది. అది కొత్త పాఠశాలలో ప్రారంభించినా, కొత్త పాఠ్యపుస్తకాల ముఖాన్ని చూస్తూ పాఠశాలలో అప్పటికే ఉన్న స్నేహితుల పరిచయం చేసుకోవడం ఇలాంటివి ఆమెకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించాయి. ''తరచూ బదిలీలు నన్ను వివిధ సంస్కృతులు, జాతులకు చెందిన వ్యక్తులను కలిసే అవకాశాన్ని కల్పించాయి. భిన్నత్వంలో ఏకత్వం అందాన్ని పొందడంలో ఈ ప్రయాణం నాకు సహాయపడింది. భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ దేశం నలుమూలల ఉన్న విద్యార్థులతో నేను సంబంధాలు పెట్టుకోగలిగాను. ఇదే తర్వాత కాలంలో ఆన్లైన్ బోధనలో నాకు సహాయం చేస్తోంది'' అని టీచర్‌గా పనిచేస్తున్న రీతూ చెప్పారు.
జీవితంలో ఒక భాగంగా...
ఆమె పెరిగిన ఆర్మీ వాతావరణం, వారి యూనిఫాం, సిబ్బంది క్రమశిక్షణ నుండి ఆమె ఎంతో ప్రేరణ పొందింది. ''నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్న విపరీతమైన పరిస్థితుల్లో తన ఫీల్డ్ డ్యూటీని చేయడం, మా అమ్మ ఒంటరిగా ఇంటిని నిర్వహించడం చూస్తూ పెరిగిన నాకు ఇంతకంటే మరో ప్రేరణ అవసరం లేదు. క్రమంగా నేను అన్నింటినీ ఒక కష్టంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా పరిగణించడం ప్రారంభించాను'' అని రీతూ అంటున్నారు.
ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది
ఉన్నత విద్య కోసం వీటన్నింటినీ విడిచిపెట్టిన తర్వాత ఆమెకు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి బదిలీ కావడం అనే సమస్య లేకుండా పోయింది. దాంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నది. అన్నింటికీ దూరంగా ఉంటూ గ్రాడ్యుయేషన్ అనే పెద్ద అడ్డంకిని దాటడంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్ర మెరిట్ జాబితాలో ఎనిమిదో ర్యాంక్ సాధించడంతో ఆమె ప్రయత్నాలు ఫలించాయి. ఇదే రీతూకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలనే తన కలను నెరవేర్చుకుంది. పీజీ చేస్తున్న సమయంలోనే ఉపాధ్యాయురాలిగా మారాలనే స్ఫూర్తి ఆమెకు కలిగింది.
విద్యార్థులకు ఆసక్తి పెంచాలి
సరదా బోధనా విధానాన్ని ఎల్లప్పుడూ విశ్వసిస్తూ, విద్యార్థులు జీవశాస్త్రాన్ని అత్యంత సాధారణంగా బోధించే అవకాశం తనకు అందిన మంచి అవకాశంగా రీతూ భావించారు. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యార్థులతో బాగా సంబంధాన్ని కలిగి ఉంటారు. ''సాధారణంగా సైన్సు పాఠాలంటే విద్యార్థులు చాలా కష్టంగా భావిస్తారు. కానీ క్రమ వ్యవధిలో ఆసక్తికరమైన క్విజ్లు, యానిమేషన్లతో పాటు వినూత్న ఆడియోవిజువల్ టెక్నాలజీ విద్యార్థులను బోధన పట్ల ఆకర్ష, శ్రద్ధ ఉంచుతుంది. ఇది భావనలను బాగా అర్థం చేసుకోవడానికి, నిలుపుకోవడానికి కూడా దారి తీస్తుంది'' అని ఆమె పంచుకున్నారు. సబ్జెక్ట్ కంటెంట్ బలంతో పాటు, ఉపాధ్యాయుల బోధన, శ్రద్ధ, విద్యార్థులతో కనెక్ట్ అయ్యే పద్ధతి కూడా వారికి సబ్జెక్ట్ పట్ల ఆసక్తి పెంచుతుంది'' అంటున్నారు.
ఆఫ్‌లైన్ తరగతులకు సమానంగా ఆన్లైన్
లాక్డౌన్ల సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహణకు ఆమెకు ప్రభుత్వం నియమించింది. ''నేను ఆన్లైన్ బోధన ప్రారంభించక ముందు చాలా సందేహాలు ఉండేవి. అయితే ఆన్లైన్లో బోధించడం వల్ల ఉపాధ్యాయులు సాంప్రదాయ ఆఫ్‌లైన్ మోడ్‌గా విద్యార్థులతో సమానంగా బలమైన బంధాలను ఏర్పరచుకోగలరని తర్వాతి కాలంలో గ్రహించాను. ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేని ఇలాంటి సమయంలో బోధన పట్ల అభిరుచి ఉన్నవారికి ఈ ఆన్లైన్ తరగతుల వల్ల ప్రధాన అడ్డంకిని అధిగమించవచ్చు'' అంటున్నారు ఆమె.
మీకంటూ కొంత సమయం
తన విద్యార్థులకు తగిన సమయాన్ని కేటాయించడమే కాకుండా రీతూ తన పిల్లలతో అడుగడుగునా ఉంటూ వస్తోంది. పనినీ, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడం తల్లులకు కష్టమని ఆమె నమ్ముతుంది. దాని గురించి ఆమె ఏమంటారంటే ''ప్లాన్ చేయండి, ప్రాధాన్యం ఇవ్వండి, పనిని అప్పగించండి. మీ వ్యక్తిగత సమయం విషయంలో రాజీ పడకండి. మీకంటే కొంత సమయాన్ని కచ్చితంగా కేటాయించుకోండి. నేను నా అమ్మాయిలందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను... పెద్ద కలలు కనే ధైర్యం చేయండి, వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయండి'' అంటున్నారు.
ప్రతి రోజూ కొత్తదనం
నా కాలేజీ రోజుల నుండి ఒక ప్రొఫెసర్ సెలవులో ఉంటే నా స్నేహితులకు తరగతులు చెప్పే అవకాశాన్ని నేను పొందుతాను. కమ్యూనికేషన్ సౌలభ్యం, తోటి విద్యార్థులతో అనుబంధం నన్ను సహజంగా ఈ వృత్తికి నడిపించాయని నేను నమ్ముతున్నాను. టీచర్‌గా ఉండటంలోని ఉత్తమమైన విషయం ఏమిటంటే అది ప్రతిరోజూ కొత్తదనాన్ని నేర్చుకుంటూ విద్యార్థిని మీలో సజీవంగా ఉంచుతుంది. - రీతూ గేరా