Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో పచ్చి బఠాణీలు మనకు విరివిగా దొరుకుతుంటాయి. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. వీటితో వివిధ రకాల ఆహార పదార్ధాలు కూడా చేసుకుని తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు బఠాణీ ఎంతో బలవర్ధకమైన ఆహారం. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్. అలాంటి బఠాణీలతో చేసే కొన్ని వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
బఠాణీల రగడా
కావలిసిన పదార్ధాలు: బఠాణీలు - ఒక కప్పు, ఆలూ - ఒకటి (కొంచం పెద్దది), నూనె, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - చెంచా, జీరా పొడి - చెంచా, ఉల్లిగడ్డ తరుగు - ఒక అరకప్పు, టమాటో తరుగు - అరకప్పు, పెరుగు ఒక అరకప్పు, కొత్తిమీర, కరివేపాకు, పోపుదినుసులు.
తయారు చేయు విధానం: ముందుగా బఠాణీలు ఉడికించుకోవాలి. కొన్ని బఠాణీలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి అది వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసి వేయాలి. అవి వేగాక కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ తరుగు గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆలూని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచం నీళ్లు పోసి మూటపెట్టి ఉడకనివ్వాలి. ఆలూ కొంచం మెత్తపడ్డాక టమాటో ముక్కలు, మిగిలిన బఠాణీలు వేసి ఒక సారి బాగా కలియ బెట్టి మూత పెట్టాలి. ఇవన్నీ బాగా మెత్తగా అయ్యాక కొన్ని ఆలూ ముక్కల్ని గరిటతో మెత్తగా చేసుకోవాలి. అందులో మెత్తగా చేసుకున్న బఠాణీల మిశ్రమాన్ని వేసి బాగా కలియబెట్టాలి. మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. అ తర్వాత పెరుగు, ఉప్పు, పసుపు, జీరా పొడి, ధనియాల పొడి వేసి బాగా గరిటతో రెండు నిమిషాలు కలియబెట్టి మూత పెట్టి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి దించేముందు కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. ఇది పిల్లలు,పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్.
పూరి
కావలసిన పదార్ధాలు: గోధుమ పిండి - మూడు కప్పులు, ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న బఠాణీల మిశ్రమం - ఒక కప్పు, ఉప్పు, నూనె తగినంత.
తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలోకి గోధుమపిండి, ఉప్పు, నాలుగు చెంచాలు నూనె, మెత్తగా చేసి పెట్టుకున్న బఠాణీల మిశ్రమం వేసి కొంచం కొంచం నీళ్లు పోసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో పూరీలు మునిగే లాగా నూనె పోసి అది బాగా వేడి ఎక్కేలోపు పూరీలు చేసి పెట్టుకుని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి తీసేయాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. వీటిలోకి టమాటో కెచప్ కానీ, ఉల్లి చట్నీ కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
బఠాణీల హల్వా
కావాల్సిన పదార్థాలు: మెత్తగా ఉడికించి పెట్టుకున్న బఠానీల మిశ్రమం - ఒక కప్పు, పంచదార - కప్పు, నెయ్యి - అరకప్పు, జీడిపప్పు, కిస్మిస్ - పదేసి చొప్పున, ఏలకుల పొడి - అర స్పూను.
తయారు చేయు విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెలో రెండు చెంచాల నెయ్యి పోసి అది వేడెక్కాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మిగిలిన నెయ్యిపోసి అది వేడెక్కక అందులో బఠాణీల మిశ్రమం వేసి సన్నని సెగమిద పచ్చి వాసన పోయేదాక వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార వేయాలి. ఏలకుల పొడి కూడా వేసి బాగా కలియ బెట్టాలి. పంచదార మొత్తం కరిగి పోయేదాక కలుపుతూనే ఉండాలి. కరిగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడీ పప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఇది వేడి వేడిగా తింటే బావుంటుంది.
బఠాణీల గ్రేవీ
కావల్సిన పదార్థాలు: ఉడికించిన బఠాణీలు - కప్పు, ఉల్లిగడ్డ ముద్ద - అర కప్పు, టొమాటో గ్రేవీ - కప్పు, గరం మసాలా - అర స్పూను, కొత్తిమీర, బిర్యానీ ఆకు, నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పోపుదినుసులు.
తయారు చేయువిధానం: మందపాటి బాండీలో నూనె పోసి వేడయిన తర్వాత అందులో కరివేపాకు, పోపు దినుసులు వేయాలి. అవి కొంచం వేగాక బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ ముద్ద పసుపు, గరం మసాలా వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత టొమోటో ఫ్యూరి వేయాలి. ఒక ఉడుకు రానిచ్చి ముందే ఉడికించి పెట్టుకున్న బఠాణీలు అందులో వేయాలి. కొంచం గ్రేవీ కోసం నీళ్లు పోయాలి. ఇవన్నీ బాగా ఉడుకుతుండగా ధనియాలు పొడి, కారం, కొత్తిమీర వేసి బాగా కలియబెట్టాలి. ఇది పూరిలోకి, చపాతీలోకి మాత్రమే బాగుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి