Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో దళితులు దశాబ్దాలుగా వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు. చట్టపరంగా వీరికి రక్షణ కల్పించినప్పటికీ సంఘంలో మాత్రం పక్షపాతం, హింస ఎదుర్కొంటూనే ఉన్నారు. అలా లైంగిక దాడులకు గురైన బాధితులకు... ముఖ్యంగా దళిత మహిళలకు న్యాయం చేయాలనే తపనతో నిత్యం కషి చేస్తున్నారు 52 ఏండ్ల మంజుల ప్రదీప్. ఈ లక్ష్యంతోనే ఎందరో మహిళలకు శిక్షణ ఇస్తున్న ఆమె స్ఫూర్తి దాయక జీవిత పరిచయం...
భారతదేశ మహిళా జనాభాలో 16 శాతం దళిత మహిళలు ఉన్నారు. సాధారణంగా దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, అంటరానితనంతో వీరు అదనంగా లైంగిక హింసను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇటీవల దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే దళితులను శిక్షించాలన్నా, అవమానించాలన్నా లైంగిక కోరికలు, దాడి అనేది అగ్రవర్ణాల చేతిలో అయుధంగా తయారైంది. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా గత ముప్పై యేడ్లుంగా దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మంజుల ఈ ఏడాది 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్' సంస్థను కొందరు వ్యక్తలతో కలిసి స్థాపించారు.
హుందాగా జీవించగలగాలి...
''దళిత సమాజం నుంచే మహిళా నాయకులు రావాలి. అలాంటి వారిని తయారుచేయాలన్నదే నా చిరకాల స్వప్నం. కోవిడ్ మహమ్మారి సమయంలో లైంగిక హింస కేసులను పరిశీలిస్తున్నప్పుడే, దీని కోసం ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించాల్సిన అవసరం ఉందని గ్రహించాను. లైంగిక హింసకు గురైన మహిళలు గౌరవంగా, హుందాగా జీవనం కొనసాగించడానికి సహాయపడే నాయకులు అవసరం. మా సంస్థ ద్వారా అలాంటి వారిని తయారుచేయాలన్నదే మా సంకల్పం'' అన్నారామె.
అవకాశాలు సుదూర స్వప్నాలు...
మంజులా వద్ద శిక్షణ పొందుతున్న వారిలో భావనా నర్కర్ ఒకరు. ఈమె గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణంలో నివసిస్తారు. అక్కడి పేద దళిత మహిళలకు చదువు, ఉద్యోగ అవకాశాలు సుదూర స్వప్నాలు. భారతదేశంలో దాదాపు దళిత మహిళందరి పరిస్థితీ ఇదే. ''లైంగిక హింసకు గురైనప్పుడు స్త్రీలు తీవ్ర ఆవేదనకు లోనవుతారు. కోపం, బాధ.. తమకు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ జరిగిన అన్యాయానికి గొంతెత్తి చెప్పేందుకు జంకుతారు. తమకు జరిగిన అన్యాయాన్ని సొంత కుటుంబానికి కూడా చెప్పుకోలేరు. ఎందుకంటే, మన హక్కులేంటో మనకు తెలీవు. చట్టాల్లో ఏముందో తెలీదు'' అని భావన అంటారు 2020 జనవరిలో మంజులా ప్రదీప్ ఒక దళిత మహిళల సమావేశంలో ప్రసం గిస్తున్నప్పుడు ఆ మాటలను భావన విన్నారు. దాంతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, న్యాయం అందుబాటులో ఉంటుందన్న నమ్మకం కలిగిందని ఆమె చెప్పారు.
పటిష్టమైన పరిష్కార మార్గాలు...
బాధితులకు చట్టాలపై అవగాహన కల్పించడం మంజులకు గట్టి సంకల్పం. అదే ఆమె తీవ్ర ఆంకాంక్ష. దీనికోసం వ్యవస్థాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు పటిష్టమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. గ్రామీణ మహిళలకు ప్రాథమిక స్థాయిలో చట్టాల గురించి అవగాహన కల్పించడం, న్యాయ పరిజ్ఞానాన్ని అందించడం అవసరమని ఆమె అంటారు. ''వారిని నేను ప్రాథమిక స్థాయి లాయర్లు (బేర్‌ఫుట్ లాయర్లు) అంటాను. లైంగిక దాడులకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు, సమాజం వేసే నిందలతో పోరాడే ధైర్యాన్ని నింపడంలో వారి సహాయం కీలకం. నేర ప్రవత్తికి సంబంధించిన న్యాయ వ్యవస్థ మొత్తం దళిత మహిళలకు వ్యతిరేకంగా పక్షపాతం వహిస్తోంది. కోర్టుల్లో బాధితులను అవమానాలపాలు చేసేలా ప్రశ్నిస్తుంటారు. ఉదాహరణకు, 'ఉన్నత వర్గాల పురుషులు ఆమెపై ఎందుకు లైంగిక దాడి చేస్తారు? ఆమె అంటరాని మహిళ కదా. ఆమే స్వయంగా వారిని ఆహ్వానించి ఉంటుంది'.. ఇలాంటి మాటలు మాట్లాడతారు'' అని మంజుల వివరించారు.
తట్టుకొని నిలబడేలా...
తనకు అందిన శిక్షణతో వ్యవస్థను ఎదుర్కోవడానికి, బెదిరింపులు, ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడడానికి తగిన సామర్థ్యం చేకూరిందని, ఇది తనకు ఎంతో బలాన్ని చేకూర్చిందని, సాధికారత దక్కినట్టు అనిపిస్తోందని భావన అన్నారు. ప్రస్తుతం ఆమె ఒక స్థానిక దళిత హక్కుల సంస్థలో చేరారు. ఆ ప్రాంతంలో లైంగిక హింస బాధితులకు సహాయం చేసేందుకు అనునిత్యం ముందుంటారు. 2014, 2019 మధ్య దళిత మహిళలపై లైంగిక దాడి కేసులు 50శాతం పెరిగినట్టు ప్రభుత్వ డేటా చెబుతోంది. అయితే, దళిత మహిళలపై జరిగే లైంగిక దాడులు చాలావరకు వెలుగులోకి రావని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం, అగ్రవర్ణాలకు చెందిన పురుషులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు విముఖత చూపడం దీనికి ప్రధాన కారణాలు. అందుకే మంజుల ఆ దిశలో శిక్షణ ఇస్తుంటారు. బాధితులకు ధైర్యాన్ని అందించడం, వివరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేయడం ఆమె ఇచ్చే శిక్షణలో భాగాలు.
ఆమె కూడా ఓ బాధితురాలే...
చిన్నతంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ సమయంలో ధైర్యం చెప్పేవారు లేక ఎంతో ఒంటరితనం అనుభవించానని.. ఆ బాధలోంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని మంజుల చెప్పారు. మంజులకు నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు ఇరుగుపొరుగున వుండే నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక హింసకు పాల్పడ్డారు. ''ఆ రోజు నేను పసుపు రంగు ఫ్రాక్ ధరించినట్టు నాకు గుర్తుంది. వారి ముఖాలు, వారు ఏం చేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ దాడి నన్ను మార్చింది, అవమాన పీడితురాలిగా, భయస్తురాలిగా మార్చింది. కొత్త వారిని చూస్తే భయపడేదాన్ని. ఎవరైనా ఇంటికి వస్తే కనిపించకుండా దాక్కునేదాన్ని'' అంటూ ఆమె ఆ రోజుల గురించి గుర్తు చేసుకున్నారు.
కులాన్ని దాచిపెట్టి...
ఆమె తనపై జరిగిన దాడిని రహస్యంగా ఉంచారు. తల్లిదండ్రులతో చెప్పడం ప్రమాదకరమని ఆమె భావించారు. ఆమె తల్లికి 14 ఏండ్ల వయసులోనే 17 ఏండ్ల వ్యక్తితో పెండ్లి చేశారు. తండ్రి కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఆయనకు ఒక కొడుకు కావాలి. ''మా నాన్న అమ్మను నిత్యం ఈసడించుకునేవారు ఆయన నున్న ఎరికీ పనికిరాని దానిగా, ఎవరి ప్రేమను పొందని వ్యక్తిగా భావించేవారు'' అని ఆమె వెల్లడించారు. మంజుల తండ్రి ఇప్పుడు జీవించి లేరు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టారు. కానీ ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లారు. అక్కడ తన పేరు చివర కులం పేరును వదులుకోవడం ద్వారా తన దళిత గుర్తింపును దాచారు. తన భార్యా, కూతుళ్ల పేర్లకు చివరలో తన పేరు ప్రదీప్ అని తగిలించారు. అయితే, తన కులం ఏదన్న రహస్యం ఎక్కువ కాలం దాగలేదని మంజుల చెప్పారు. వదోదర వంటి పెద్ద నగరాలలో కూడా వివిధ రూపాలలో తనపై వివక్ష కొనసాగిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
నేను దళితురాలినని...
''నాకు తొమ్మిదేండ్ల వయసులో మా టీచర్ విద్యార్థులను వారి పరిశుభ్రత ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు. క్లాసులో శుభ్రంగా ఉండే పిల్లలలో ఒకదాన్నైనా, దళితులు శుభ్రంగా ఉండరన్న కారణంగా నాకు ఆఖరి ర్యాంక్ ఇచ్చారు. నేను తీవ్ర అవమానానికి గురయ్యాను'' అని చెప్పారామె. స్కూల్ చదువుల తర్వాత ఆమె సోషల్ వర్క్, న్యాయశాస్త్రాలు చదువుకోవాలనుకున్నారు. గ్రామీణ ప్రాంతాలను సందర్శించడం వల్ల దళితుల తరపున పోరాడాలన్న స్పహ ఆమెలో కలిగింది. 1992లో ఆమె సహౌద్యోగి ఒకరు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి చేతిలో హత్యకు గురైనప్పుడు ఆమె దళిత హక్కుల కోసం పోరాడే 'నవసర్జన్' అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. ఆ సంస్థలో చేరిన తొలి మహిళ ఆమె. ఒక దశాబ్దం తరువాత ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికలలో విజయం సాధించారు.
వారికంటూ సొంత గుర్తింపు...
''ఒక దళిత మహిళ ఆ స్థాయికి ఎదగడం చాలా అరుదు. సంస్థను నడిపించడానికి నేను నలుగురు పురుషులను ఓడించి ఎన్నికల్లో గెలిచాను'' అని ఆమె గర్వంగా చెప్పారు. ఆమె ఇప్పుడు దేశంలో అత్యంత కీలకమైన సమస్యగా మారిన లైంగిక దాడులకు గురైన బాధితులపై దష్టి పెట్టారు. 50 మందికి పైగా దళిత బాధితులు చేసిన న్యాయ పోరాటంలో వారికి ఆమె సహాయపడ్డారు. ఈ కేసుల్లో అనేకమందికి శిక్షలు పడ్డాయి. అవసరమైన సమాచారం, శిక్షణ ఇస్తే దళిత మహిళలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా నాయకులుగా మారతారని తన కషి ద్వారా ఆమెకు అర్ధమైంది. ''వారికి ఇంకో మంజుల అవసరం రాకూడదు. భవిష్యత్‌లో వారు నా నీడన కాకుండా ఈ మహిళలు సొంత గుర్తింపును పెంచుకోవాలని, అభివద్ధి పథంలో నడవాలని కోరుకుంటున్నాను'' అన్నారామె.