Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతిల్దా కుల్లూ... ఈమె పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి కాదు... సెలెబ్రిటీ అంతకన్నా కాదు... ఓ ఆశా వర్కర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరుంధతి భట్టాచార్య, బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రా కూడా ఉన్నారు. సాధారణ ఆశావర్కర్‌గా చేస్తున్న మతిల్దా ఇప్పుడు దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒకరిగా ఎంపికయ్యారు. ఆమె గురించి మరిన్ని విషేశాలు మానవి పాఠకుల కోసం...
ఒడిశా రాష్ట్రానికి చెందిన మతిల్దా కుల్లూ... తన ప్రాంతంలో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కరోనా సమయంలో వైరస్ గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంతో ఆమెకు ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది.
ఇంటింటికి తిరిగి
45 ఏండ్ల మతిల్దా గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని గర్‌గండ్‌బహల్ గ్రామానికి చెందినవారు. ఆమె అక్కడ 15 ఏండ్లుగా ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి రోగులకు మందులు ఇవ్వడం, గర్భిణీలకు సహాయపడటం, పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించడం, గ్రామంలో పరిశుభ్రతను ప్రోత్సహించడంతో పాటు అనేక అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో దాదాపు వేయిమందికి పైగా జనాభా ఉండగా, ఆమె ఒక్కరే వారందరి బాగోగులు చూస్తారు. ఆశావర్కర్‌గా ఆమె నెలకు కేవలం రూ. 4500 జీతం అందుకుంటున్నారు.
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా...
మతిల్దా 15 ఏండ్ల కిందట ఆశావర్కర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. అప్పటి వరకు ఆ గ్రామం వారు ఆసుపత్రి ముఖం కూడా చూడలేదు. ఎవరైనా అనారోగ్యం పాలైతే, నయం చేయించడం కోసం చేతబడిని ఆశ్రయించేవారు. దీన్ని ఆపడానికి, గ్రామస్థులకు అవగాహన కల్పించడానికి మతిల్దాకు కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి. అనారోగ్యానికి గురైన గ్రామస్థులు ప్రస్తుతం చికిత్స కోసం మతిల్దా వద్దకు వస్తున్నారు. ఉదయం 5 గంటలకే తన దినచర్య ప్రారంభమవుతుందని మతిల్దా చెప్పారు. ఇంటిపనులు ముగించుకొని సైకిల్‌పై గ్రామంలోని ప్రతీ ఇల్లూ తిరుగుతూ గ్రామస్థులను కలుస్తానని అన్నారు.
వివక్షను ఎదుర్కోవల్సి వచ్చింది
''నాకు నా పని అంటే ఇష్టం. కానీ జీతం చాలా తక్కువ. గ్రామస్థుల బాగోగులు చూసుకోవడానికి చాలా శ్రమిస్తాం. కానీ ఇప్పటికీ సమయానికి జీతం తీసుకోవడం కష్టమే'' అని ఆమె చెప్పారు. ఆదివాసీ మహిళ అయినందున అంటరానితనం, చిన్నచూపు వంటి సవాళ్లను మతిల్దా ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలినాళ్ల నుంచి కూడా తన పని అంత సులభంగా లేదని, అయినప్పటికీ తన ప్రయత్నాల్లో ఎలాంటి లోటు రానివ్వలేదని ఆమె చెప్పారు.
కరోనాతో సవాళ్లు
కరోనా కారణంగా మతిల్దా పనిభారం విపరీతంగా పెరి గింది. ''కరోనా వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితవ ుయ్యారు. ఆ సమయంలో ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం ప్రతీ ఇంటికి వెళ్లాలని మాకు చెప్పారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మొదట్లో కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ప్రజలు సిగ్గుపడేవారు. వారిని ఒప్పించడం మాకు తలకు మించిన పనైంది'' అని ఆమె చెప్పారు. కానీ, తాను గ్రామంలోని ప్రజలందరికీ టీకాలు వేశానని ఆమె చెబుతున్నారు. ''వ్యక్తిగతంగా కూడా ఇది ఆమెకు చాలా సంతోషకరమైన విషయం. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్‌గా మతిల్దా చాలా కష్టపడ్డారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకునే క్రమంలో కరోనా బారినపడ్డారు. ఆమెకు కూడా వైరస్ సోకింది. కరోనా నుంచి కోలుకోగానే ఆమె మళ్లీ తన పనిలో నిమగమయ్యారు'' అని సుందర్‌గఢ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సరోజ్ కుమార్ మిశ్రా చెప్పారు.
ఫోర్బ్స్‌లో చోటు...
మతిల్దా చేస్తోన్న కషి, ఫోర్బ్స్ మ్యాగజైన్ దష్టిలో పడి. మతిల్దా చేస్తోన్న పని గురించి ఫోర్బ్స్ ఇండియా జర్నలిస్టులకు జాతీయ ఆశావర్కర్ల సమాఖ్య కార్యదర్శి వి. విజయలక్ష్మి సమాచారమిచ్చారు. 'ఇతర ఆశావర్కర్లకు మతిల్దా ఒక ఉదాహరణ. పేద గిరిజన మహిళ అయినప్పటికీ తన ప్రాంతంలో చాలా గొప్పగా పనిచేశారు. ఎన్నో సేవలు అందించారు. పని పట్ల ఆమెకున్న అంకితభావం నన్ను చాలా ఆకట్టుకుంది'' అని ఆమె చెప్పారు.
ఫోర్బ్స్ జాబితాలో ఆమెకు చోటు దక్కిన నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను అభినందిస్తూ 'అంకితభావంతో పనిచేసిన వేలాది మంది కోవిడ్ వారియర్లకు మతిల్దా ప్రతినిధి. వీరంతా ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి ముందుండి పనిచేశారు' అని ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికీ నామమాత్రపు వేతనాలే...
'కఠినమైన సమయాల్లో మతిల్దా చేసిన సేవలకు ఒడిశా మొత్తం రుణపడి ఉంది. అందరికీ ఆమె స్ఫూర్తిదాయకం' అని ఒడిశా ఆరోగ్య మంత్రి నవ్‌కిశోర్ దాస్ పేర్కొన్నారు. 2005లో భారత ప్రభుత్వం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆశావర్కర్లను నియమించారు. ఇలాంటి ఆశావర్కర్లు దేశంలో పదిలక్షలకు పైగా ఉన్నారు. కరోనా విజంభణ సమయంలో వీరంతా వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ వీరంతా ఇప్పటికీ నామమాత్రపు వేతనానికే పనిచేయాల్సి ఉంటుంది. తమ శ్రమకు తగ్గ ఫలితం కోసం వీరంతా దశాబ్దాలుగా పోరుడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీరి శ్రమను, సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.