Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒమిక్రాన్ రాకతో థర్డ్‌వేవ్ మొదలయిపోయిందనే ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియంట్‌తో చాలా నష్టం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సెకండ్‌వేవ్ సమయంలో రోజుకు నాలుగైదు లక్షల కేసులు రికార్డయ్యాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం థర్డ్‌వేవ్ ఫిబ్రవరిలో విశ్వరూపం చూపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే మరికొంత మంది శాస్త్రవేత్తలు థర్డ్‌వేవ్‌లో ఎక్కువ తీవ్రత ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో చాలామంది వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నారు. మరికొంత మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుని ఉన్నారు. అమెరికా దేశంలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వటం మొదలయింది. మనకూ బూస్టర్ డోస్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అమెరికాలో పిల్లలకూ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలయింది. డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మనల్ని కాపాడేది మాస్క్ తగిలించుకోవటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరచుకోవటం మాత్రమే క్షేమంగా ఉండండి. సృజనాత్మకంగా ఉండండి.
కిస్మిస్లతో...
ప్రతి ఇంట్లో పండగల సమయంలో వాడుకునే డ్రైఫ్రూట్స్ రెండే రెండు జీడిపప్పు, కిస్మిస్. ఈ రెండు ఉంటే పాయసం తయా రైనట్టే. పండుగలకు పాయసం లేకుండా కిస్మిస్లు కదా! పండగంటే పాయసం ఉండాల్సిందే కదా! ఈ కిస్మిస్లు ఎలా తయారవుతాయో తెలుసు కదా! ద్రాక్షపండ్లను ఎండబెడితే కిస్మిస్ తయారవుతుంది. ప్రతిరోజూ కిస్మిస్ తినటం వలన యూరిన్‌లో రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో న్యూట్రియంట్స్ మూలంగా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఐరన్, బి కాంప్లెక్స్, కాపర్లు కిస్మిస్లో ఉన్నందు వలన రక్తహీనత లేకుండా చూస్తుంది. ఇంకా ఎండు ద్రాక్షలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం మూలంగా మలబద్ధకం గల వారికి బాగా పని చేస్తుంది. తక్కువ బరువుగల వాళ్ళు ఈ కిస్మిస్లను తినటం వలన అధిక శక్తి కలిగి బలంగా తయారు చేస్తుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ద్రాక్షలోని 80 శాతం పండ్లను వైన్ తయారీలోనే ఉపయోగిస్తారు. ఏడు శాతం ద్రాక్షను కిస్మిస్ తయారీలో వాడతారు. ఇక మిగిలినవి మాత్రమే ప్రత్యక్షంగా పండ్ల రూపంలో తినడానికి ఉపయోగిస్తారు. ఈ రోజు కిస్మిస్లతో నత్తను తయారు చేశాను. నత్తను అతిమెల్లగా నడిచే జీవిగా చెప్పుకుంటాం. ఆ కార్యాలయంలో పనులు నత్త నడకన సాగుతున్నామంటారు.
చింతగింజలతో...
వంటింట్లో ఉండే చింతపండులో ఉండే చింతగింజల్ని సేకరించి బొమ్మలు చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు నత్త బొమ్మను చేశాను. చింత చెట్టు శాస్త్రీయనామం ''టామరిండన్ ఇండికా'' అంటారు. ఎర్రచింత, సీమచింత, కారువేగి అని రకరకాల చెట్లున్నాయి. కాయను చింతకాయ అనీ, పెంకు తీసిన గుజ్జును చింతపండు అనీ, పెంకుతో ఉన్న చింతపండును చింతగుల్ల అనీ అంటారు. 'కొలుబుర్ నాగా' అనే ఒకరకమైన విష సర్పాన్ని చింతనాగు అని పిలుస్తారు. చింతపువ్వు లాంటి గుర్తులు ఈ సర్పం శరీరం మీద ఉండటం వలన దీనికాపేరు వచ్చింది. చింతకాయలు, చింతపండు వంటలలో, పచ్చళ్ళలో ఎక్కువగా వాడతారు. చాలామంది అన్నంలో కూరలతో తిన్న తర్వాత చారు పోసుకొని తింటారు. అవీ కాకుండా జ్వరంతో ఉన్నవాళ్ళకు, పత్యంగా భోజనం పెట్టే వాళ్ళకు చారుతో అన్నం తినిపిస్తారు. నేను బిఎస్.సి చదివేటప్పుడు నత్తలతో డిసెక్షన్లు చేశాము. ఇది ఒక గవ్వలోపల ఉంటుంది. సముద్రదం ఒడ్డున మనం గవ్వలు ఏరుకుంటాము. కానీ ఆ గవ్వలు నత్తల శరీరాలు అని తెలియదు మనకు. గవ్వలతో ఎన్నో అందమైన వస్తువులు, అలంకరణ ఐటెమ్స్ చేస్తారు. ఇవన్నీ సముద్రాలలో నివసించే జీవులు.
పిస్తాపొట్టుతో...
పిస్తా పొట్టుతో కూడా మనం ఎన్నో బొమ్మలు చేసుకుంటున్నాం. ఈ శీర్షిక ద్వారా చాలా జంతువుల్ని పరిచయం చేసుకుంటున్నాం. వాటి లక్షణాల్ని, వాటి ఆహారపు అలవాట్లను, జంతువుల సామాజిక బాధ్యతనూ తెలుసుకుంటున్నాము. సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా, భాషా పరంగా అవి మనుష్యులతో మమేకమై ఉండే సందర్భాలను కూడా తెలుసుకుంటున్నాం. ఈ నత్తలు 'మొలస్కా' వర్గానికి, గాస్ట్రోపోడా విభాగానికి చెందిన సముద్ర జీవులు. వీటిలో నేలలో ఉండే నత్తలు, కొన్ని మంచినీటి నత్తలు, కొన్ని సముద్ర నత్తలు ఉంటాయి. నత్తల్ని కొంతమంది ఆహార పదార్థంగా తీసుకుంటారు. కొన్ని రకాల వ్యాధులకు మందులుగా వాడతారు. సంస్కృతిపరంగా నత్తలు ఒక చిహ్నంగా వాడబడతాయి. అత్యంత నిదానంగా నడిచే పనులకు నత్తల్ని వాటి నడకకు ఉదాహరణగా ఉపయోగిస్తారు. నెత్తిమీద రెండు కొమ్ముల్లాంటివి ఉంటాయి. ఒళ్ళేమో మత్తని మాంసం ముద్దలా ఉంటుంది. ఈ మెత్తని శరీరంకు దెబ్బలు తగలకుండా పైన గవ్వ అనబడే కర్పరం ఉంటుంది.
వెంటిలేటర్ వేస్ట్ మెటీరియల్‌తో...
ఆసుపత్రులలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని 'వెంటిలేటర్లు' అనే మిషన్ల మీద ఉంచుతారు. ఇప్పుడింకా ఆధునిక పరిజ్ఞానంతో 'ఎక్మో' పరికరాలు కూడా వచ్చాయి. అలాంటి వెంటిలేటర్ల మీద ఉండేవారికి ముక్కుకు, గొంతుకు ఎన్నో పైపులు అమర్చబడి ఉంటాయి. అలాంటి పైపులకు అక్కడక్కడా వాల్వ్‌ల లాంటివి ఉంటాయి. అవి తెల్లటి ప్లాస్టిక్ పదార్థాలు చిన్న మూతల్లా ఉంటాయి. నేను వీటితో ఎన్నో బొమ్మలు తయారు చేశాను. ఈరోజు నత్తను చేశాను. ఈ నత్తల్లో ఊపిరితిత్తులు, మొప్పలు, రెండూ ఉంటాయి. మంచి నీటి నత్తల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. కొన్ని సముద్ర నత్తల్లో కూడా ఊపిరితిత్తులుంటాయి.
పట్టుకుచ్చుల పూలతో...
మా ఇంట్లో ఉన్న సగం కుండీల్లో అంటే దాదాపు 100 కుండీల్లో పట్టుకుచ్చుల చెట్లు మొలిచాయి. ఆరేడు అడుగుల దాకా పెరిఇ గుత్తలు గుత్తులుగా పూస్తున్నాయి. కొన్ని చెట్లకు గుత్తులుగా కాకుండా గునక పువ్వుల్లా ఉన్నాయి. వాటిని కోసి నేను బొమ్మలు చేస్తున్నాను. మా కుండీల్లో ఉన్న పువ్వులన్నీ మా ఇంట్లో జంతువులుగా మారి పోతున్నాయి. నత్తలు ఎక్కువగా రాత్రిపూట తింటాయి. ఇవి ఎక్కువగా కుళ్ళిపోయిన పదార్థాలనే తింటుంటాయి. పురుగులు, జలగలు, ఫంగస్, కుళ్ళిపోయిన ఆకులు, వంటి వాటిని తింటాయి. అందువలన ఇది వ్యవసాయ మిత్రులుగా పనికి వస్తాయి. ఆధునిక వ్యవసాయంలో కుండీలలో సైతం నత్తలు, వానపాములు ఉండేలా చూసుకుంటున్నారు. ఇవి తమకున్న కొమ్ముల్లాంటి వాటితో నేలను తవ్వుతూ కుళ్ళగిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా ఫ్రెంచి వంటకాల్లో వాడతారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్