Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. జ్ఞానం పొందడానికి ఈ రోజుల్లో కనీస అవసరంగా భావించే విద్యను అభ్యసించడానికి వయసుతో నిమిత్తం లేదు. అందుకే దశాబ్దాలుగా తననే అంటిపెట్టుకున్న ఇల్లు, వంట తదితర పనులను వదిలేసి పలకా బలపం పట్టింది. తన వయసులాగే చదువులోనూ నూటికి నూరు శాతం విద్యను సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది. ఆమె ఎవరో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారా? ఇవిగోండి. మీ కోసమే కుట్టియమ్మా వివరాలు.
కుట్టియమ్మా అని పేరు చదవగానే మీకు అర్థమై ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాదని. మీ ఊహ నిజమేనండోరు. ఆమె కేరళకు చెందిన తిరవంచూరులోని ఒక మారుమూల గ్రామానికి పండుటాకు. వయసు 104 ఏండ్లు. కాటికి కాళ్లు చాపిన అవ్వ కష్టా, రామా అనుకోకుండా చదువేమిటి అని ఆశ్చర్యపోకండి. మనిషి పుట్టుకకు లక్ష్యమంటూ లేకపోతే అదేం పుట్టుక జీవితాన్ని రసరమ్యంగా చేసుకుని సంతప్తిగా గడపకపోతే అదేం జీవితం? కుట్టియమ్మకూ అంతే. ఏదైనా నేర్చుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ. కానీ ఆమె పుట్టింది ఒక శతాబ్దం వెనుక. అప్పటి పరిస్థితులు ఏమిటనేది మనం తేలికగానే అంచనా వేసుకోవచ్చు.
మనుధర్మం రాజ్యమేలుతున్న రోజులు
స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో అక్షరాస్యతాశాతం చాలా తక్కువ. అందునా బానిసల పరిగణలో ఉండే స్త్రీలు చదువుకోవడమంటే ఎంతో పెద్ద విషయం. మనుధర్మం కోరలు చాపుకుని ఉన్న రోజులు అవి. ఉన్నత వర్గాలకు చెందిన మహిళలే చదువుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చే రోజులు. అటువంటి సమయంలో తక్కువ కులానికి చెందిన కుటుంబంలో పుట్టిన కుట్టియమ్మకు చదువుపట్ల ఆసక్తి ఉన్నా ఇంటి లోపలి పరిస్థితులు, బయట సమాజంలోని పరిస్థితులు ఏవీ సహకరించక ఇంటికే పరిమితమైంది.
ఆకలి రోజుల నుంచి...
కుట్టియమ్మ బాల్యం, యవ్వన కాలాలేమీ సాఫీగా గడవలేదు. ఆమె తల్లిదండ్రులు భూమి లేని వ్యవసాయ కూలీలు. వెనుకబడిన కులం, గ్రామీణ నేపథ్యం, నిరుపేదలు. 11 మంది తోబుట్టువుల మధ్య పెరిగింది కుట్టియమ్మ. ఇంటిల్లిపాది కూలీకి వెళ్తేనే గడిచే కుటుంబం. వీరందరికీ వంట చేసి పెడుతూ, వారి దుస్తులు ఉతుకుతూ, ఆవులు, కోళ్ల పోషణ చూసుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచడం ఆమె బాధ్యతలు అయ్యాయి. 16 సంవత్సరాల వయస్సులో, ఆమె ఒక చిన్న దుకాణంలో మూలికా మందులను విక్రయించే టి.కె. కొంటిని వివాహం చేసుకుంది. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వంట, ఇంటిపనిలో మునిగిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. తాను సంతప్తిగానే ఉన్నప్పటికీ 104 ఏండ్ల సుదీర్ఘ జీవితం గడిచినా అక్షరం ముక్క రాదనే బాధ ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండేలా చేసిందని చెప్తుంది కుట్టియమ్మా.
అక్షరాభ్యాసం మొదలైందిలా
కొద్దిగా చూపు మందగించినా, వినికిడి శక్తి కొంత మేరకు కోల్పోయినా సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఉన్న కుట్టియమ్మ మనవలు, మనవరాళ్లు పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూంటే ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. ఎలాగైనా తానూ చదువుకుంటే బాగుండునని ఎంతగానో తపనపడుతుండేది. మనవలను, మనవరాళ్లను బతిమిలాడినా వారికీ నేర్పించడం చేతకాలేదు. ఏడాది కిందట కుట్టియమ్మాకు చదువుపట్ల ఉన్న ఆసక్తిని గమనించింది ఆమె పొరుగింట్లో ఉండే రెహనా జాన్. 34 ఏండ్ల రెహానా జాన్ అక్షరాస్యతా శిక్షకురాలు. ఎలాగైనా కుట్టియమ్మా చదువు నేర్పించాలని నిశ్చ యించు కుంది. నేర్చుకునేందుకు వయసుతో నిమిత్తంలేదంటూ ప్రోత్సహించింది. రెహానా జాన్ నిజాయితీతో కుట్టియమ్మాను ఒప్పించింది. గతంలో 85 ఏండ్ల విద్యార్థి తనకు శిష్యుడిగా ఉన్నాడని చెప్పడంతో కుట్టియమ్మా బిడియం తగ్గింది. రెహానా జాన్ అందించిన పుస్తకాలను చేతబట్టింది.
పేపర్ కోసం ఎదురుచూపు
అలా మొదలైన ఆమె అక్షరాభ్యాస ప్రయాణం ఇప్పుడు దినపత్రిక చదివే స్థాయికి చేరింది. ఎప్పుడూ ఇల్లూ, పిల్లలే ప్రపంచంగా నూరేండ్లు గడిపిన అవ్వ ఇప్పుడు ప్రపంచంలోని ఏ మూల ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎదురు చూస్తుంటుంది. ప్రతి రోజూ ఉదయం పేపర్ వేసే కుర్రాడి కోసం ఆమె కండ్లు వాకిలినే చూస్తుంటాయి. పూర్తిగా రెండు గంటల సమయాన్ని మలయాళం మనోరమ పత్రిక చదివేందుకే కేటాయిస్తున్నదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఆసక్తి ఎక్కువ
''ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం నాకు ఎక్కువ. వాటి గురించి తెలుసుకునేందుకు సదా ఆసక్తిగా ఉంటాను'' అని చెప్తోంది కుట్టియమ్మ. ''చాలా సందర్భాలలో నేను వార్తాపత్రికలు చదవలేకపోతున్నందుకు పశ్చాత్తాపపడ్డాను. నాకోసం వార్తాపత్రికలు చదవమని ఇంట్లో ఉన్న యువ తరాలను వేడుకున్నాను. ఇప్పుడు నా పేరు, చిరునామాను రాయాలనుకుంటున్నాను'' అని నవ్వుతూ చెప్పిందీ అవ్వ.
నూరు శాతం అక్షరాస్యత
ఆమె గత నెలలో కేరళ రాష్ట్ర ప్రాథమిక అక్షరాస్యతా పరీక్షలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. కేరళ రాష్ట్ర ప్రాథమిక అక్షరాస్యతా పరీక్షలో పాల్గొన్న అతి పెద్ద వయస్కురాలు కుట్టియమ్మే. ఆమె అక్షరాస్యతలో 89శాతం, గణితంలో 100శాతం మార్కులు సాధించి యువతరానికి సవాలు విసిరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేరళ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్శంగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షించింది. ''జ్ఞానానికి వయస్సు అడ్డంకి కాదు. అత్యంత గౌరవంగా, ప్రేమతో, నేను కుట్టియమ్మనూ ఇతర కొత్త అభ్యాసకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని ట్వీట్లో పేర్కొన్నారు.
అల్లరి విద్యార్థిని
నేర్చుకునే విషయంలో ఎంతో నిబద్దతగా ఉండే కుట్టియమ్మా అల్లరి విద్యార్థిని అని నవ్వుతూ చెప్తారు రెహానా జాన్. ''ఆమె ఇప్పుడు నా తల్లి. మా స్నేహం అరుదైనదని, ఈ బంధాన్ని జీవితకాలం పదిలపరుచుకోవాలనుకుంటున్నట్టు చెప్తారామె. ''నేను ఆమె ఇంటికి చేరేలోపు ఆమె ఎప్పుడూ తన పాఠ్యపుస్తకం, నోట్బుక్లు, పెన్నులను సిద్ధంగా ఉంచుకుంటుంది. అదనంగా, ఆమె నాకు ఇవ్వడానికి ఇంట్లో వండిన రుచికరమైన పదార్ధాలను ఉంచుతుంది. సాధారణంగా తొమ్మిదేండ్ల వయసులో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే నాల్గవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంపై ఇప్పుడు కుట్టియమ్మ దష్టి ఉంది. ఈసారి ఇందులో మలయాళం, ఇంగ్లిష్, పర్యావరణం, గణితం పేపర్లు ఉంటాయి. ''ఇంగ్లీష్ పరాయిదైనా కచ్చితంగా ఆ భాష నేర్చుకుని ఉత్తీర్ణతను సాధించాలని కుట్టియమ్మా పట్టుదలగా ఉంది'' ఆని ఆనందంగా చెప్పారు రెహానా జాన్.
- రెహానా జాన్
- నస్రీన్ ఖాన్