Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పితృస్వామ్యం, వివక్ష, లైంగిక, గృహ హింస రాజ్యమేలుతున్న రాష్ట్రం అది. కానీ ఈ మూస పద్ధతులను బద్ధలు కొట్టుకొని 30 మంది అమ్మాయిలు జట్టుగా నిలిచారు. జుట్టు కత్తిరించుకుని, షార్ట్‌లు ధరించి స్వేచ్ఛగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. తమ కలలకు రెక్కలు కట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా విహరించేందుకు సిద్ధమవుతున్నారు. తాము మాత్రమే కాదు తమ లాంటి అమ్మాయిలను కూడా వివక్షా ప్రపంచం నుండి బయటకు తీసుకొచ్చేందుకు తమ ఆసలైన ఆటను ఇప్పుడే మొదలుపెట్టారు.
హర్యానా... పితృస్వామ్యం భావజాలం, లింగ వివక్ష, మహిళలపై లైంగిక హింస దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఇటీవలి నివేదికల ప్రకారం హర్యానాలో అబ్బాయిలకు పెండ్లి చేసేందుకు అమ్మాయిలు దొరక్క దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలను మెయిల్ ఆర్డర్ వధువులను కొనుగోలు చేసుకుంటున్నట్టు సమాచారం. అలాగే పానిపట్ జిల్లాలో మహిళను ఒకటిన్నర సంవత్సరాలు టాయిలెట్లో బంధించి హింసించిన కేసు గురించి కూడా మనకు తెలుసు. ఇక లింగ నిష్పత్తిని పరిశీలిస్తే గత ఐదేండ్లలో జనన సమయంలో లింగ నిష్పత్తి (ఎస్ఆర్బి)లో గణనీయమైన మెరుగుదల కనిపించినప్పటికీ ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల నిష్పత్తి 923 నుండి 914కి తగ్గడంతో మళ్ళీ లింగ నిష్పత్తిలో వెనకబడింది.
మూస పద్ధతులను ఛేదిస్తూ...
లింగ అసమానతలు, పితృస్వామ్య మనస్తత్వాలు, వివక్షల మధ్య ఝజ్జర్ జిల్లాలోని మాచ్‌రౌలీ అనే గ్రామానికి చెందిన యువతుల బృందం ఈ మూస పద్ధతులను ఛేదిస్తోంది. 30 మంది ఫుట్‌బాల్ క్రీడాకారిణులు కలిసి ఓ జుట్టును ఏర్పరుచుకున్నారు. మొదటి సారి తమ అందమైన జీవితం(ఉన్నత విద్య, కెరీర్ దేశం కోసం ఆడటం) గురించి కలలు కనే వీలు కల్పించారు.
బ్రేక్‌త్రూ ఇండియా ద్వారా
2014లో లాభాపేక్ష లేని సంస్థ బ్రేక్‌త్రూ ఇండియా తన 'తారోన్ కి టోలీ' (టికెటి) ప్రోగ్రామ్ కోసం మాచ్‌రౌలీ గ్రామాన్ని దత్తత తీసుకుంది. గ్రామంలోని పాఠశాలల్లో కౌమారదశలోని విద్యార్థులకు లింగ సమానత్వ గురించి పాఠ్యాంశాన్ని బోధించే ప్రోగ్రామ్. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి 45 నిమిషాల పాటు ఈ తరగతి ఉంటుంది. ఇందులో విద్యార్థులు వారి జీవితాల్లో, వారి చుట్టూ ఉన్న లింగ వివక్ష, హింసను గుర్తించి దాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమ ఆన్-గ్రౌండ్ అధికారులు కూడా బాలికల విద్య ప్రాముఖ్యతను, వారి కలలకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడతారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకు
'తారోన్ కి టోలీ' ప్రోగ్రాంలో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ జట్టు ఇటీవల పునరుద్ధరించబడింది. ఫుట్‌బాల్ ఆడటం ద్వారా వారు తమను తాము పట్టుకోవడం, వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటం, అన్నింటికంటే ముఖ్యంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం నేర్చుకుంటున్నారు. అది ఉన్నత విద్యతో పాటు ఫుట్‌బాల్‌ను వృత్తిగా ఎంపిక చేసుకోవడంలో కూడా సహకరిస్తుంది.
మార్పు కోసం క్రీడ
తన చెల్లెలు సీమ ద్వారా 'తారోన్ కి టోలీ' ప్రోగ్రాం గురించి సుష్మకు తెలిసింది. యోగాపై మక్కువ ఉన్న సుష్మ జిల్లా స్థాయిలో పోటీల్లో విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్‌లో భాగమైన సీమా, హీనా ఇద్దరూ కూడా దాని గురించి ఆమెకు చెప్పారు. వారు ఆమెను కూడా చేరమని సూచించారు. ''నేను మొదట్లో సంకోచించాను. కానీ నేను అమ్మాయిల ఆటను చూసిన తర్వాత నేను కూడా చేరాలని నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రులను ఒప్పించడం నాకు చాలా కష్టమైన పని. కానీ వారు అంగీకరించిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. రెండు రోజుల పాటు నేను జట్టు ఆటను చూశాను. మూడవ రోజు నేనూ కచ్చితంగా ఆడాలని మనసులో నిర్థారించాను. ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించిన తర్వాత నేను అబ్బాయిలా కనిపించాను. దాంతో గ్రామం చుట్టూ నడవగలిగాను. నిర్భయంగా ప్రజా రవాణాలో కూడా ప్రయాణించగలిగాను'' అని సుష్మ నవ్వుతూ చెప్పింది. సుష్మ తన సోదరి సీమా ద్వారా లింగ వివక్ష, ఇతర సంబంధిత సామాజిక సమస్యల అన్నింటిపై అవగాహన పెంచుకుంది. అలాగే ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఇది ఆమెలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపాయి.
జీవితాన్ని విభిన్నంగా చూసేలా...
హీనా... 10వ తరగతి విద్యార్థిని. 6వ తరగతిలో ఉండగానే ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించింది. ఆమె 'తారోన్ కి టోలీ' నిర్వహించే అన్ని తరగతులకు హాజరయ్యింది. ఇది తన జీవితాన్ని విభిన్నంగా చూసేలా చేసింది. ఫుట్‌బాల్ ఆడటానికి, ప్యాంటు, చొక్కా ధరించడానికి, జుట్టును చిన్నగా కత్తిరించడానికి అనుమతించమని ఆమె తల్లిదండ్రులను ఒప్పించడం దగ్గర నుండి చాలా విషయాల్లో హీనా పురోగతి సాధించింది.
గ్రామ వాతావరణం సురక్షితం కాదని
''ఇంతకుముందు ఉదయం రన్నింగ్‌కి వెళ్ళాలంటే నా తమ్ముడిని వెంట తీసుకెళ్లమని మా కుటుంబం పట్టుబట్టింది. అతను అబ్బాయి కాబట్టి అతను నాకు రక్షకుడు. నేను ఒంటరిగా పరుగెత్తాలనుకుంటున్నాను అని మా అమ్మకు చెప్పినప్పుడు ఒంటరిగా నడుస్తున్న అమ్మాయికి గ్రామంలోని వాతావరణం సురక్షితం కాదని ఆమెయ నన్ను నిరాకరించింది. ఈ విషయం నేను మా అత్తకు ఫిర్యాదు చేసాను. చివరికి ఆమె తన కూతురు మాన్సీని కూడా నాతో పాటు రన్నింగ్‌కి పంపడానికి ఒప్పించింది. ఇది నేను సాధించిన మొదటి విజయం అని హీనా చెప్పింది.
పెండ్లి ఎవరు చేసుకుంటారని...
''జుట్టును చిన్నగా కత్తిరించినప్పుడు గ్రామస్థులు నన్ను అవహేళన చేశారు. నేను అబ్బాయిలా కనిపిస్తున్నాను, నన్ను ఎవరూ పెండ్లి చేసుకోరని అనేవారు. అలాగే ఎండలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల నా చర్మం నల్లగా మారుతుందని అంటుంటే ఈ అభిప్రాయం నా తల్లిదండ్రులపై బాగా ప్రభావం చూపింది'' ఆమె జతచేస్తుంది. హీనా ఇంటికి బంగారు పతకాన్ని తెచ్చినప్పుడు తల్లిదండ్రులు తన గురించి చాలా గర్వంగా భావించారని, గ్రామస్తులు అభినందన సందేశాలతో చుట్టుముట్టారని చెప్పింది. ఆమె ఇప్పుడు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావాలని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందాలనుకుంటోంది.
ఏకైక లక్ష్యం...
సీమా... 2018లో ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించింది. తల్లిదండ్రుల అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడం ఈమెకు మంచి అవకాశం. అందుకే ఈమె గురించి పెద్దగా చెప్పుకునే అవకాశం లేదు. తన ఏకైక లక్ష్యం ఫుట్‌బాల్ ఆడటం, దేశానికి కీర్తిని తీసుకురావడం.
మమ్మల్ని వ్యతిరేకించారు
ఎనిమిదేండ్లుగా 'తారోన్ కి టోలీ' కార్యక్రమంలో పనిచేస్తున్న ఝజ్జర్‌లోని బ్రేక్‌త్రూ జిల్లా మేనేజర్ మీనా రాణి మాట్లాడుతూ ''మేము మాచ్‌రౌలీ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు, నిష్ఫలమైన బాలికల ఫుట్‌బాల్ జట్టును పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు కులతత్వ, పితృస్వామ్య మనస్తత్వాలు మమ్మల్ని వ్యతిరేకించాయి. అబ్బాయిలు మాత్రమే క్రీడలో పాల్గొనడానికి అనుమతించారు. చాలా మంది బాలికలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి గ్రామాన్ని విడిచిపెట్టడానికి అనుమతి లేదు'' అన్నారు.
సవాల్‌గా మారింది
మీనా రాణి అమ్మాయిలను, వారి ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులను కూడా కలుసుకుంది. ఇది మంచి ఆలోచన అని వారిని ఒప్పించింది. క్రీడలు ఆడటానికి నిర్దిష్ట యూనిఫాం అవసరమని, చిన్న జుట్టు ఆడటానికి అనువైనదని వారికి అర్థమయ్యేలా చేయడం, వారిని ఒప్పించడం ఆమెకు సవాల్‌గా మారింది. జట్టులో చేరిన అమ్మాయిల్లో మధ్య మధ్యలో డ్రాపవుట్లు ఉన్నప్పటికీ జట్టు నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు 30 మంది బాలికలతో ఆ జట్టు ఉంది. అందరూ గ్రామాన్ని విడిచిపెట్టి వివిధ టోర్నమెంట్లలో ఆడటానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు.
అమ్మాయిలను ప్రోత్సహిస్తూ...
వారి కోచ్ మనీషా, అలాగే టీమ్ లీడర్లు హీనా, సంజు కూడా తమ గ్రామంలోని ఇతర యువతులను ఆడటానికి ప్రోత్సహిస్తున్నారు. వారి కలలను ముందుకు తీసుకెళ్లడానికి, తమ అమ్మాయిలు బటయకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగేందుకు నిత్యం తల్లిదండ్రులను కలుస్తూనే ఉన్నారు. సుష్మ, సీమా, హీనాల మాదిరిగానే మచ్చరౌలీ గ్రామంలోని అనేక మంది ఇతర బాలికలు 'తారోన్ కి టోలీ' తరగతుల్లోని జ్ఞానాన్ని తమ హక్కుల కోసం, కలలు కనడానికి, ఆడుకోవడానికి, ఉజ్వల భవిష్యత్తు కోసం చర్చలు జరపడానికి ఉపయోగిస్తున్నారు.
చర్చ మొదలుపెట్టారు
''అమ్మాయిలు ఎందుకు ఫుట్‌బాల్ ఆడాలి?'', ''నువ్వు అబ్బాయిలా కనిపిస్తే నిన్ను ఎవరు పెండ్లి చేసుకుంటారు?'' వంటి పాతకాలపు ప్రకటనలను వారు పక్కకు నెట్టుస్తున్నారు. ''అమ్మాయిలు గ్రామం నుండి బయటకి అడుగు పెట్టకూడదు..., ''మనం ఎందుకు షార్ట్‌లు వేసుకుని ఫుట్‌బాల్ ఆడకూడదు?'', ''ఆడపిల్లలు పుట్టిన రోజులు ఎందుకు జరుపుకోరు?''... వంటి విషయాలపై నిత్యం చర్చ జరుపుతున్నారు. ఫోగట్ సోదరీమణులు, రీతు, సంగీత, బబిత వారికి దారి చూపడంతో ఈ అమ్మాయిలు పితృస్వామ్యాన్ని, మూస పద్ధతులను గ్రామం నుండి తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారి అసలు ఆట ఇప్పుడే ప్రారంభమైంది.
- సలీమ