Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి కాలంలో మనకు ఎన్నో రకాల కూరలు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అందులో కాలి ఫ్లవర్ ఒకటి. ఇది సాధారణంగా ఎండాకాలంలో దొరికినప్పటికి, చలికాలంలో లభించే కాలి ఫ్లవర్ మాత్రం చాలా తాజాగా నవనవలాడుతూ ఉంటుంది. దీనితో ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. కొన్ని వెరైటీ వంటకాల గురించి ఈరోజు తెలుసుకుందాం...
చపాతీ
కావలసిన పదార్ధాలు: గోధుమ పిండి - రెండు కప్పులు, సన్నగా తరిగిన కాలి ఫ్లవర్ - రెండు కప్పులు, ఉప్పు - సరిపడా, జీలకర్ర పొడి - చెంచా, నూనె - ఐదు చెంచాలు, నీళ్ళు - పిండి కలిపేందుకు.
తయారు చేయు విధానం: గోధుమ పిండిలో అన్ని పదార్ధాలు వేసి నీళ్లు కొంచం కొంచం పోస్తూ చపాతీ పిండి కలపాలి. అరగంట తర్వాత చపాతిల్లాగా వత్తి పెనం మీద వేసి కాల్చాలి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత కొంచం నూనె రెండు వైపులా వేసి తీసేయాలి. ఇందులోకి టమాటా కూర, పుదీనా పచ్చడి, జామ్ బావుంటాయి.
కాలి ఫ్లవర్ పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: చిన్న చిన్న ముక్కలుగా చేసిన కాలి ఫ్లవర్ - రెండు కప్పులు, నిమ్మకాయ రసం - ఒక కప్పు, ఉప్పు, పసుపు, మెంతిపిండి, కారం, నూనె, పోపుదినుసులు, ఇంగువ.
తయారు చేయు విధానం: కాలి ఫ్లవర్ ముక్కలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆర బెట్టాలి. ఒక గిన్నెలోకి ముక్కలను వేసి అందులో నిమ్మరసం, తగినంత ఉప్పు, కారం, ఒక చెంచా మెంతిపిండి, పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి రెండు రోజులపాటు ఉంచి మూడవ రోజు ఒక సారి కలియబెట్టాలి. తర్వాత ఒక బాండీలో నూనె వేసి అది వేడెక్కాక పోపుదినుసులు, ఇంగువ వేయాలి. పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి బావుంటుంది.
కాలి ఫ్లవర్ పప్పు కూర
కావలసిన పదార్ధాలు: కాలి ఫ్లవర్ ముక్కలు - రెండు కప్పులు, శనగపప్పు - ఆర కప్పు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, నూనె, పోపుదినుసులు.
తయారు చేయు విధానం: ముందుగా శనగపప్పుని ఒక గంట నాన పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో ఆరు చెంచాల నూనె పోయాలి. అది వేడైన తర్వాత పోపుదినుసులు, కరివేపాకు వేసి అవి కొంచం వేగగానే అందులో కాలి ఫ్లవర్, నానబెట్టిన శనగపప్పు వేసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ముక్కలు మెత్త పడ్డాక తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి దించేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే బావుంటుంది. శనగపప్పు ఇష్టపడని వారు కందిపప్పు వేసుకొని చేసుకోవచ్చు.
మిక్సీడ్ వెజ్ కర్రీ
కావాల్సిన పదార్ధాలు: కాలి ఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు, పచ్చి బఠాణీలు - అరకప్పు,-టమాటో - ఒకటి, ఆలూ - ఒకటి, - ఉల్లిగడ్డ ముక్కలు - ఒక కప్పు, ఉప్పు, పసుపు, కారం, నూనె - సరిపడా, ధనియాలు - రెండు చెంచాలు, జీరా - రెండు చెంచాలు, మిరియాలు - ఒక చెంచా, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఎండు మిర్చి - నాలుగు, కరివేపాకు, కొత్తిమీర.
తయారు చేయు విధానం: ముందుగా ఒక చిన్న కుక్కర్లో నూనె పోసి అది వేడి ఎక్కేలోపు ధనియాలు, జీరా, ఎండుమిర్చి, పసుపు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేడెక్కిన నూనెలో వేసి పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇవి గోధుమ రంగులోకి వచ్చాక కాలి ఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠాణీలు, ఆలుగడ్డ ముక్కలు, టమాటో ముక్కలు వేసి కొంచం నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజెల్ వచ్చాక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఆపేయాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి అందులో కొంచం కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. బాగా కలిపిన తర్వాత దించేముందు కొత్తిమీర వేయాలి. ఇది అన్నం, చపాతీ, పూరీ, పుల్కాల్లోకి చాలా బావుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి