Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసే మహిళలు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు... అని కొంతమంది భావిస్తుంటారు. ఈ ఆలోచన సరైనది కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏ ఉద్యోగైనా 8, 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మరీ పనిభారం ఎక్కువైతే మరో గంట అదనంగా సమయం కేటాయించాలి. ఇది తప్పించి మిగతా సమయమంతా ఇంటి పనులకు, పిల్లలతో గడపడానికే మొగ్గు చూపుతారు ఎక్కువ శాతం మంది తల్లులు. ఈ రోజుల్లో పలు కారణాల రీత్యా చాలామందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం దక్కడంతో మరింత సమయం పిల్లలకు కేటాయించగలుగుతున్నామని చాలామంది తల్లులు చెబుతున్నారు. ఇలా వృత్తిని మినహాయిస్తే మిగిలిన సమయంలో పిల్లలకు కేటాయించడానికే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పుడు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారనడం ఎంత వరకు సమంజసం? అని అడుగుతున్నారు తల్లులు.
ఉద్యోగం చేసే మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువ. ఏ విషయంలోనైనా ఇతరులపై ఆధారపడకుండా స్వీయ నిర్ణయాలు తీసుకోవడంలో వారు ముందుంటారు. ఆర్థికంగా కూడా దృఢంగా ఉంటారు. ఇలాంటి ఇంట్లో భార్యాభర్తల మధ్య సమానత్వం కూడా ఉంటుంది. ఇవన్నీ పెరిగే పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. స్త్రీలను గౌరవించడం, స్వతంత్రంగా జీవించడం.. వంటి ఎన్నో మంచి విషయాలు అలవర్చుకోగలుగుతారు. అలాంటప్పుడు వారిలో వ్యక్తిత్వ సమస్యలు రావడానికి అవకాశమే లేదంటున్నారు నిపుణులు.
పని ఒత్తిడిని తట్టుకోవడం, కొత్త పనులు స్వీకరించడం, సమయపాలన, లక్ష్యాలను చేరుకోవడం.. వీటన్నింటినీ సానుకూలంగా ఎదుర్కొన్నప్పుడే సంస్థకు చక్కటి ఉత్పాదకతను అందించచ్చు.. కెరీర్లోనూ ఎదగచ్చు. పైగా ఆఫీస్‌లో ఎంత పనిచేసినా.. ఇంటికొచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు వర్కింగ్ మదర్స్.
నిజానికి మహిళలు మల్టీ టాస్కింగ్ చేయడంలో దిట్ట. ఇందుకు వారు చేసే ఇంటి పనులే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే లక్షణాన్ని ఆఫీస్‌లోనూ ప్రదర్శిస్తుంటారు ఉద్యోగినులు. తద్వారా వివిధ రకాల పనులు నిర్వర్తిస్తూ తమ ప్రతిభాపాటవాల్ని చాటుకుంటారు. ఏ కాస్త ఒత్తిడి ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతుంటారు. అంతేకానీ.. అక్కడితో ఆగిపోరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇలాంటి మల్టీ టాస్కింగ్ అటు వారి వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు వృత్తిపరంగానూ ప్లస్ అవుతుంది. తద్వారా వారు అమ్మతనాన్నీ, జీవితాన్నీ సంతృప్తికరంగా గడుపుతారని నిపుణులు చెబుతుంటారు.
ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు ప్రతి తల్లికి సమానంగానే ఉంటాయి. ఎదురయ్యే ఇబ్బందుల గురించీ వారికి అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చూపు చూసే అవకాశం ఎక్కడుంటుంది అనేది నిపుణుల భావన.
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా.. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆఫీస్ పనులు.. ఇలా ప్రతి క్షణం తమ గురించి, తమ కుటుంబం గురించే ఆలోచిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కొంతమంది వారిపై స్వార్థం అనే ముద్ర వేస్తుంటారు. కానీ ఈ ఆలోచన సరికాదంటున్నారు నిపుణులు. వాళ్లు తమ గురించి, తమ కుటుంబం బాగోగుల గురించి తీరిక లేకుండా గడుపుతున్నారన్న వాస్తవాన్ని గ్రహించమంటున్నారు.