Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒడిశా గ్రామంలో ఈ 20 ఏండ్ల యువతి... ప్రజలకు సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ... బాల్య వివాహాలు జరగకుండా చూస్తోంది. అక్కడ నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వారు ఏర్పాటు చేసిన మహిళా బృందానికి అధ్యక్షురాలిగా ఆమె తన సేవలు అందిస్తోంది. ఆమే మంజు పాత్ర... సమావేశాలు, వర్క్‌షాప్‌ల ద్వారా బాల్య వివాహాలు, లింగ అసమానతల వల్ల కలిగే పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరుస్తున్న ఆమె గురించి...
ఈ ఏడాది ఫిబ్రవరిలో మంజు తన గ్రామంలో 16 ఏండ్ల అబ్బాయి 20 ఏండ్ల అమ్మాయిని పెండ్లి చేసుకోకుండా అడ్డుకుంది. ఈ వివాహాన్ని ఆపాలని ఆమె సిడిపిఓలు, పోలీసులతో పాటు ఎంతో మందిని కలిసింది. బాలుడి తల్లిదండ్రులు ఆమెను అనేక రకాలుగా అవమానించారు, బెదిరించారు. అంతేకాదు ఒక గ్రూప్ ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ మంజు ఏమాత్రం భయపడలేదు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. తనను ఎవరో 'సెక్స్ వర్కర్' అని పిలవడంతో చాలా బాధపడ్డానని ఆమె చెబుతుంది. కానీ ఆ బాధ కొద్ది సేపు మాత్రమే. అవమానాలు, బాధలు, బెదిరింపులను లెక్క చేయకుండా తన పోరాటాన్ని ముందుకే తీసుకుపోతుంది.
ఇంటి నుండే ప్రేరణ
మంజు స్వస్థలం ఒడిశాలోని కలహండి జిల్లా, బోర్భట్ గ్రామం. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడినది. విపరీతమైన కరువుతో ఆకలి మరణాల్లో మొదటి స్థానంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ''ఇథియోపియా ఆఫ్ ఇండియా'' అని పిలిచేవారు. మరోవైపు ఇది గొప్ప వ్యవసాయ వారసత్వాన్ని కూడా కలిగి ఉంది. ఈ ప్రాంతంలో విపరీతమైన అస మానతలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ నివసించే ప్రజలు తర తరా లుగా వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్నారు. కొన్ని సంవత్సరాల కిందట వరకు బాల్య వివాహాలు విస్తృతంగా జరిగేవి. అమ్మాయిలను పాఠశాలకు వెళ్లనిచ్చేవారు కాదు. ఇల్లుదాటి బయటకు అడుగుపెట్టేవారు కాదు. ఇక గృహ హింస సర్వసాధారణం. ఈ నేపథ్యంలో పుట్టి పెరిగిన మంజు ఓ సామాజిక కార్యకర్తగా తన ప్రయాణం తన సొంత ఇంటి నుండే ప్రారంభమయింది. బాల్య వివాహాల నుండి బయటపడిన ఆమె తల్లి శివరార్తి పాత్ర నుండి ప్రేరణ పొందింది.
మహిళలపై హింస...
బోర్భాట్లో బాలికలు 10వ తరగతికి మించి చదువుకునేందుకు అనుమతి లేదు. మంజుకు 15 సంవత్సరాలు వచ్చిన నాటి నుండి ఆమెకు వివాహం చేయాలని కుటుంబం చేసిన ప్రయత్నాలను ఆమె అడ్డుకోవలసి వచ్చింది. వారు ఆమెను తదుపరి చదువుకు కూడా నిరాకరించారు. అయినప్పటికీ 2017లో తన 12వ తరగతి పూర్తి చేసింది. తర్వాత ఆక్స్‌ఫామ్ ఇండియా అనే సంస్థ తన గ్రామంలో మహిళలపై హింస, చైల్డ్, ఎర్లీ మరియు ఫోర్స్డ్ మ్యారేజ్‌పై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మంజు విన్నది. ఆ సమావేశాలకు హాజరుకావడం ప్రారంభించింది. ఈ పురాతన, లోతుగా పాతుకుపోయిన సామాజిక పద్ధతులు పురుషులు, స్త్రీలకు ఎలా హానికరమో గ్రహించింది. మార్పుకు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని గ్రహించింది.
మార్పును తెస్తున్నాయి
''నేను గోండు కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని. నా స్నేహితులతోపాటు 2017కి ముందు అనేక బాల్య వివాహాలు జరిగాయి. ఈ అవగాహన కార్యక్రమాలు ప్రస్తుతం మార్పును తీసుకువస్తున్నాయి. నిత్య సమావేశాలు బాలికలు, మహిళలు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలు, మహిళలపై హింస వల్ల కలిగే దుష్ప్రవర్తన గురించి అవగాహన కల్పిస్తాయి. ప్రజలు తమ హక్కుల గురించి కూడా తెలుసుకుంటున్నారు. మాట్లాడటం నేర్చుకుంటున్నారు'' అని మంజు చెప్పింది.
సమానత్వం వైపు
యువతిగా విద్యాభ్యాస హక్కును పొందడం నుండి ఒక మహిళగా తన ఏజెన్సీని వదులుకోకపోవడం వరకు మంజు చాలా ముందుకు వచ్చింది. నేడు ఒడిశాలోని ఎన్ఎడబ్ల్యూఓ (నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్) ఏర్పాటు చేసిన మహిళా బృందానికి అధ్యక్షురాలిగా, బాల్య వివాహాలు, లింగ అసమానతల వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి సమావేశాలు, వర్క్‌షాప్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. తన గ్రామంలో బాల్య వివాహాలు ఆపడమే కాకుండా సమావేశాలలో ఋతు, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్య ప్రాముఖ్యత గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ప్రారంభంలో ప్రజలు ఒకరోజు కూలీని కోల్పోతామని అవగాహన తరగతులకు వచ్చేవారు కాదు. అయితే గ్రామంలోని నాయకులు వారిని ఒప్పించిన తర్వాత తరగులు నిర్వహించిన ప్రతిసారి కనీసం 20 మంది వచ్చారు.
మొదటి అమ్మాయిని నేనే
మంజుకి తన ప్రయాణం అంత సులభం కాదు. ఇప్పటికీ ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే ఆమె ప్రయాణంలో ప్రతికూలతల కంటే తన స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు చాలా ఎక్కువ అని చెప్పింది. ''మా ఊరిలో ఆడపిల్లలకు డ్యాన్స్ కూడా చేయకూడదు. 2017లో దసరా సందర్భంగా పబ్లిక్‌గా డ్యాన్స్ చేసిన మొదటి అమ్మాయిని నేనే. అప్పుడు నా తల్లిదండ్రులకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. నా ప్రవర్తన వల్ల నాకు ఎప్పటికైనా పెండ్లి అవుతుందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు'' ఆమె చెప్పింది. ఈ ప్రాంతంలో వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా మంజు చేస్తున్న పోరాటంలో ఆక్స్‌ఫామ్ ఇండియా బలమైన మద్దతుగా నిలిచింది. వారు రాయడానికి, మాట్లాడటానికి, మరింత అధ్యయనం చేయడానికి ప్రోత్సహించబడ్డారు.
ఛాంపియన్‌గా ఉద్భవించింది
ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రోగ్రాం ఆఫీసర్-జెండర్ జస్టిస్ రుక్మిణి పాండా ఇలా ఏమంటారంటే.. ''మంజు పాత్ర యూత్ కలెక్టివ్‌లో సభ్యురాలు. ఆమె ఇప్పుడు ఛాంపియన్‌గా ఉద్భవించింది. అనేక మార్పును రూపొందించింది. మేము యుక్తవయసులో ఉన్న యువకులు, మహిళలకు మానవ హక్కులు, లింగ వివక్ష పద్ధతుల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తాము. లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి సానుకూల లింగ నిబంధనలను ప్రోత్సహిస్తాము. ఈ కార్యక్రమం ఒక కఠినమైన, నిరంతర ప్రక్రియ. అంతేకాకుండా మంజు పాత్రతో పాటు ఇతర యువకులు వివిధ చర్చలు, ప్రచారాలలో పాల్గొంటారు. ఇవి మహిళల హక్కులు, సమస్యలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడతాయి. చాలా హిందీ సినిమాలు స్త్రీలను ఆక్షేపిస్తూ పితృస్వామ్య భావనను బలపరుస్తున్నాయి. అందుకే మేము స్త్రీవాద దృక్కోణం నుండి సినిమాలను విశ్లేషించడానికి యువకులు, యుక్తవయసులోని సభ్యులకు అవగాహన కల్పిస్తాము. మంజు ఈ శిక్షణా సెషన్లలో భాగంగా ఉంది'' అంటున్నారు.
జీవిత భాగస్వామిని నేనే ఎంచుకుంటాను
మార్పుకు మొదటి మెట్టు విద్య అని, పాఠశాల స్థాయిలోనే అవగాహన ప్రారంభం కావాలని మంజు అభిప్రాయం. ఆమె ఇటీవలే తన బిబిఏ పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరి స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకుంటోంది. ''నేను నా భాగస్వామిని ఎన్నుకుంటానని నా తల్లిదండ్రులతో చెప్పాను'' అని ఆమె నవ్వుతూ చెప్పింది. యువతులు కష్టపడి చదువుకోవాలని, సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బాల్య వివాహాలు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో సహాయపడాలని ఆమె సలహా ఇస్తుంది. ఇది తన జీవితకాలం నిబద్ధతతో మంజు ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది.
- సలీమ
అమ్మ జీవితమే ప్రేరేపించింది
14 సంవత్సరాల వయసులో నా తల్లి మా నాన్న నిచల్ పత్రాను వివాహం చేసుకుంది. అతను ఆ సమయంలో కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఉన్నాడు. ఏజెన్సీ, విద్య, పునరుత్పత్తి, ఆరోగ్యం గురించి ఎటువంటి జ్ఞానం లేకుండా ఆమె 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు మాత్రమే జీవించారు. ఆమె నొప్పి, నిస్సహాయత, భావోద్వేగం, శారీరక సవాళ్లు చూసిన తర్వాత నా సొంత జీవిత కథనాన్ని మార్చడానికి నన్ను ప్రేరేపించాయి. ఆమె చెప్పింది.
- మంజు పాత్ర