Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేహా ముజావ్దియా... డోర్ టు డోర్ ట్యూషన్ల నుండి ఎడ్టెక్ స్టార్టప్‌ని నిర్మించింది ఈ పల్లెటూరి అమ్మాయి. అన్ని రకాల అసమానలతో పోరాడుతూ తన గ్రామం నుండి ఉన్నత విద్యను పూర్తి చేసిన మొదటి అమ్మాయిగా అవతరించిన ఆమె విజయగాథ నేటి మానవిలో...
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లా మెల్ఖెడా గ్రామానికి చెందిన నేహా ముజావ్దియా... విద్యను పూర్తి చేసిన మొదటి అమ్మాయి. అయితే ఆమె ఆశయం ఉన్నత విద్యను అభ్యసించడానికే పరిమితం కాలేదు. ''చిన్న పల్లెటూరి అమ్మాయి'' సామాజిక భయం నుండి బయటపడి ఏదో ఒక రోజు తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఆశయాలను కొనసాగించడం అనేది కలలు కనే ఒక ఫాంటసీ లాంటిది. తమ కలలను ఎప్పటికీ సాకారం చేసుకోలేరు. ఇలాంటి అసమానతలు ఉన్నప్పటికీ నేహా ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా విజయవంతమైన ఎడ్టెక్ స్టార్టప్‌ను నిర్మించగలిగింది. ఈ రోజు ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.
2018లో ప్రారంభించబడిన ఈ స్టార్టప్ ప్రాథమిక, మాధ్యమిక కళాశాల స్థాయి నుండి వివిధ పోటీ ప్రవేశ పరీక్షల తయారీ వరకు అన్ని వయసుల విద్యార్థులకు తరగతులను అందిస్తుంది. ఆమె నిర్వహిస్తున్న ఆ ఇనిస్టిట్యూట్ ప్రస్తుతం దాదాపు 1,000 మంది ఉపాధ్యాయులను కలిగి ఉంది. అలాగే తన రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ, ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో ఆన్లైన్ పరిధిని విస్తరించింది.
వివాహ వ్యవస్థను బద్దలుకొట్టి...
పాఠశాల, స్థానిక కళాశాలతో పాటు గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటిలో జరిగే వివాహా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని నేహా నిశ్చయించుకుంది. వనరుల కొరత, నిరక్షరాస్యత కారణంగా, విద్యార్ధులు, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను మాత్రమే కాదు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నా అనుమతించరు. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్శిటీ నుండి బిఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత నేహా ఎంబిఏ చేసేందుకు ఇండోర్‌కు వెళ్లాలనుకుంది. దానికోసం పెండ్లి అనే చక్రాన్ని విచ్ఛిన్నం చేసింది.
విమర్శలను ఎదుర్కొన్నారు
''నేను ఇండోర్‌కు వెళ్లడానికి నా తల్లిదండ్రులు అంగీకరించలేరు. మా గ్రామంలో ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యం లేదు. పరిస్థితులు మారుతున్నాయి... కానీ చదువుకునే సమయంలో నేను చాలా కష్టపడ్డాను'' అని నేహా చెప్పింది. అయినా ఆమె తన పట్టు వదలలేదు. ఇండోర్‌లో ఉన్నత విద్య కోసం తన తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించింది. కూతురికి పెండ్లి చేయకుండా ఒంటరిగా, అదీ చదువు కోసం దూర ప్రాంతానికి పంపడంతో ఆమె తల్లిదండ్రులు సమాజం నుండి చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య 2009లో నేహా ఇండోర్‌కు వెళ్లి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఒక ప్రైవేట్ సంస్థలో ఏసిఏ కోర్సు కోసం నమోదు చేసుకుంది. ''అడ్మిషన్ కోసం రోజుల తరబడి తిరిగాను. నా పూర్వ డిగ్రీ కారణంగా నేను చాలా సంస్థలలో అర్హత పొందలేదు. ఎంపికలు పరిమితం చేయబడ్డాయి. నా ఏసిఏ తర్వాత ఎంబిఎ ప్రవేశాన్ని పొంది తదుపరి చదువుల కోసం ఇండోర్‌లోని క్రిస్టియన్ ఎమినెంట్ కాలేజీలో చేరాను'' అని ఆమె చెప్పింది.
నగర జీవితం
మాస్టర్స్ చదువుతున్నప్పుడు నేహా నగరంలో ఉండే ఏ అవకాశాన్ని కోల్పోవాలనుకోలేదు. వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందాలని, అనుభవాన్ని పొందాలని తపించింది. అయితే ఆర్థిక సమస్యల వల్ల అది సాధ్యకాలేదు. దవవాని నుండి బయటపడటానికి, తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించడానికి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ''నేను వీలైనన్ని ఎక్కువ తరగతులు తీసుకునేదాన్ని. నా ఖర్చులు చూసుకోవడంతో పాటు వచ్చిన సంపాదనలో కొంత పొదుపు చేసాను. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి ఎంబిఎ తరగతులకు హాజరయ్యేదాన్ని. తర్వాత ఇంటింటికి వెళ్ళి ట్యూషన్ తీసుకుంటాను. ఇంటి పనితో పాటు చదువు కూడా చూసుకునేదాన్ని. కొన్ని సందర్భాల్లో రోజుకు 17 గంటలకు పైగా పనిచేసేదాన్ని'' అంటుంది నేహా.
తాత్కాలికంగా ప్రారంభించింది
ఏది ఏమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు తాత్కాలికంగా ప్రారంభించి ట్యూషన్ అతి తక్కువ కాలంలోనే నేహాకు వ్యాపార ప్రతిపాదనగా మారింది. తక్కువ నాణ్యత గల ట్యూషన్ల కోసం తల్లిదండ్రులు అధిక ఫీజులు కట్టడం ఆమె చూసింది. ఈ తరుణంలో నేహా వ్యాపార ఆలోచనపై తన మనసు నిలిపింది. అయితే ఆంట్రప్రెన్యూర్లోకి ప్రవేశించే ముందు నాలుగు సంవత్సరాలు రెగ్యులర్ ట్యూషన్లు తీసుకుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించే ముందు తనపై తనకు విశ్వాసంతో పాటు ఆర్థిక అవసరాలు, నాలెడ్జ్ బేస్ నిర్మించాలని కోరుకుంది. అయితే నేహా తన మాస్టర్స్ పూర్తి చేసే దశలో ఉన్నందున తిరిగి గ్రామానికి రావాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు.
ఆశ కోల్పోలేదు
''ఇండోర్‌లో ఉండటానికి నాకు మరో సంవత్సరం సమయం ఇవ్వాలని నా తల్లిదండ్రులను అభ్యర్థించాను. నా సొంత గుర్తింపును సృష్టించుకోవాలనుకున్నాను. దీన్ని సాధించాలంటే ఎదుగుదల లేని గ్రామంలో ఉండకూడదు. నేను భయపడ్డాను కానీ ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. నా కుటుంబాన్ని ఎలాగోలా ఒప్పించగలిగాను'' అని నేహా చెప్పారు. పరిమిత బడ్జెట్‌తో నేహా 2018లో కో-వర్క్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఒక సాధారణ వెబ్‌సైట్‌ను నిర్మించింది. ట్యూషన్ల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్‌ను (ుబ్శీతీజabఱఅ) రూపొందించడానికి ట్యూటర్లను నియమించడం, ఇంటర్వ్యూ చేయడం, శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది
హోమ్ ట్యూషన్ కోసం డిమాండ్
మొదట్లో 10-15 మంది ట్యూటర్లతో దీన్ని ప్రారంభించింది. తర్వాత ఆమె ప్రధాన బృందంలో భాగమైంది. వ్యక్తిగత గుర్తింపు, కృషి కారణంగా ఆమెకు ఇప్పటికే డిమాండ్ ఉంది. ''ప్రారంభంలో మేము ఇండోర్‌లో పాటు సమీపంలోని ప్రాంతాల నుండి సుమారు 150 మంది ట్యూటర్లు, 10-15 మంది విద్యార్థులను కలిగి ఉన్నాము. నర్సరీ స్థాయి నుండి కళాశాల వరకు తరగతులు అందించాము. ట్యూటర్ క్యాబిన్ నుండి హోమ్ ట్యూషన్ కోసం డిమాండ్ రావడం నన్ను ఆశ్చర్యపరిచింది'' అని నేహా చెబుతుంది.
చాలా పోరాటం జరిగింది
మహమ్మారి కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోకి మార్చేసింది. పరిమిత వనరులు, డిజిటల్ పరిజ్ఞానం గురించి అవగాహన ఉన్నప్పటికీ ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఇంకా నేర్చుకుని తన స్థావరాన్ని మార్చింది. ''చాలా పోరాటం జరిగింది. నేనే అన్నీ నేర్చుకున్నాను. 2018లో కేవలం 10 మంది ట్యూటర్లతో ప్రారంభించి 2019లో 800 మంది ఉపాధ్యాయులుగా ఎదిగి ఈరోజు 1,000 మందికి చేరుకున్నాం. అలాగే ఢిల్లీ, ఆగ్రా, ముంబై మొదలైన ప్రాంతాలకు ఆన్లైన్లో చేరడంతోపాటు ఇండోర్, భోపాల్‌లలో ఆఫ్‌లైన్ ఉనికిని విస్తరించాము'' అని ఆమె చెప్పారు.
భాషా ఇబ్బందులను...
ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారు ఆన్‌బోర్డ్‌లోకి వెళ్లడానికి ముందు విస్తృతంగా శిక్షణ పొందారు. ప్రతి విద్యార్థికి క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషణలను ఉపయోగించిన తర్వాత ఒక ట్యూటర్ని కేటాయిస్తారు. అయితే ఫీజులు మాడ్యూల్స్ కోర్సుల ప్రకారం రూపొందించబడ్డాయి. ప్లాట్‌ఫారమ్ విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తారు. వారి లోపాలపై దృష్టి పెడతారు. ప్రత్యక్ష తరగతులు, రికార్డింగ్ సెషన్లు, కెరీర్ కౌన్సెలింగ్, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక లాగిన్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.
ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ
యాడ్-ఆన్ సేవగా ఈ ప్లాట్‌ఫారమ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను, ఉచిత విద్యను అందిస్తుంది. నేహా ప్లాట్‌ఫారమ్‌ను వీలైనంత సమర్థవంతంగా చేయడానికి ప్రతిరోజూ కృషి చేస్తుంది. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపడానికి ప్రయత్నిస్తుంది. ''ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన నేను తల్లిదండ్రులు, విద్యార్థుల బాధలను అర్థం చేసుకున్నాను. విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం. పేదరికం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. నేను విద్యార్థులను వారి లక్ష్యాలను సాధించడానికి అన్ని విధాలుగా ప్రోత్సహించగలనని, సహాయం చేయగలనని ఆశిస్తున్నాను'' అని నేహా చెప్పారు.
సమస్యలను ఎదుర్కొన్నాను
హిందీ-మీడియం విద్యార్థులను సమాజం చిన్నచూపు చూస్తుంది. ఇది ఓ దీర్ఘకాలిక సమస్య అని నేహా అంటున్నారు. భాషా సంకెళ్లను తొలగించి నాణ్యమైన విద్యపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. ''ఇంగ్లీష్ భాష ఉన్నతమైనదిగా పరిగణించబడే సమాజంలో మనం జీవిస్తున్నాం. హిందీ మీడియం నేపథ్యం కారణంగా నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ నేను ఎప్పుడూ నా సామర్థ్యాలను అణగదొక్కలేదు. ఈ రోజు నేను గర్వించదగిన వ్యాపార మహిళను'' అని ఇటీవల తన తండ్రితో కలిసిన నేహా చెప్పారు.
నిధుల సేకరణ కోసం
పరిమిత సౌకర్యాలు ఉన్న ఒక చిన్న పట్టణం.. విజయవంతమైన ఎడ్టెక్ వెంచర్‌ను నిర్మించకుండా నేహాను ఆపలేదు. ఈ ప్లాట్‌ఫారమ్ కుబేరన్ హౌస్ ద్వారా టాప్ 60 స్టార్టప్‌లలో ఒకటిగా గుర్తించబడింది. ప్రస్తుతం నిధుల సేకరణ కోసం పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. 15 మంది సభ్యులతో కూడిన ఈ స్టార్టప్ 20-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 22 లక్షల ఆదాయాన్ని నమోదు చేసింది. సంవత్స రాంతానికి 2,50,000 మంది విద్యార్థుల నమోదును లక్ష్యంగా చేసుకుంది. అలాగే దాని ట్యూటర్ బేస్‌ను 5,000కి విస్తరించాలని యోచిస్తోంది.
అమ్మాయిలను ప్రోత్సహిస్తూ...
నేహా ఇప్పుడు తన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా మంది అమ్మాయిలకు రోల్ మోడల్. తన స్వగ్రామాన్ని సందర్శిస్తూ ఓ అమ్మాయి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కోసం తను చేసిన పోరాటంలో చుట్టుపక్కల ప్రజల అవహేళనలను గుర్తుచేసుకుంది. ''సామాజిక భయం నుండి బయటపడటానికి, జీవితంలో వారి సంబంధిత ఎంపికలను కొనసాగించడానికి విద్య, నైపుణ్యాలతో తమను తాము సన్నద్ధం చేసుకునేలా నేను అమ్మాయిలను ప్రోత్సహించాలనుకుంటున్నాను'' అని నేహా చెప్పారు.