Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వాప్తంగా డెబ్భైకి పైగా దేశాలలో ఒమిక్రాన్ సంచరిస్తోంది. ప్రస్తుతం యుకెను టార్గెట్ చేసుకుని 3,137 మందిలో చేరి వారిని ఇబ్బందుల పాల్జేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై బ్రిటన్ పోరు సాగిస్తున్నది. ఒమిక్రాన్ తొలి మరణం కూడా బ్రిటన్‌లోనే సంభవించింది. ఇప్పటి వరకూ రెండు డోసుల టీకాలను తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ భయపడక దాడి చేస్తూనే ఉంది. ఒమిక్రాన్‌ను నిలవరించాలంటే బూస్టర్ డోస్ అవసరమని భావించిన వైద్య నిపుణులు దాన్ని అందుబాటులోకి తెచ్చారు. అమెరికా బ్రిటన్లలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్లను ప్రజలకు వేస్తున్నారు. ముఖ్యంగా వయోజనులు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెపుతున్నారు. అమెరికాలో కూడా 2,471 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించినట్టుగా రికార్డయింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు స్పీడు ఎక్కువ. ప్రపంచ రన్నింగ్ ఛాంపియన్షిప్ తీసుకోవాలని పరుగులు పెడుతున్నది. బ్రిటన్‌లో రెండు మూడు రోజులకే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నది. దీన్నిబట్టి ఎంత వేగంగా సంచరిస్తున్నదో అర్థం అవుతున్నది. భారత్‌లో కూడా 41 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మాస్క్ ధరించండి. ఒమిక్రాన్‌ను తరిమికొట్టండి.
ఆసుపత్రి వ్యర్థాలతో...
ఆసుపత్రిలో వాడే అనేక రకాల మందులు ప్లాస్టిక్ మూతలతో సీల్ చేయబడి ఉంటాయి. అలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పారబోసినపుడు అవి కుళ్ళిపోయి నేలలో కలిసిపోవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ఎంతో చౌకగా దొరుకుతుండడంతో మన జీవితాల్లోకి నవ్వుతూ చేరింది. కానీ అదే నేడు ప్రజల పాలిట శాపంగా మారి మానవ జీవితాలను నాశనం చేస్తున్నది. కార్బన్‌డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడు వంటివి వాతావరణంలో ఉండవలసిన స్థాయిని మించినపుడు కాలుష్యం జరిగింది అంటాము. కాలుష్యాలు ఎనిమిది రకాలు. వీటిలో భూకాల్యుం ప్రధానమైనది. మనమీ రోజు ఈ వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాలతో ఆవులను తయారు చేస్తున్నాం. వెంటిలేటర్ మిషన్లలో వాడే పి.ఎమ్ లైన్లలో ఉండే వాల్వుల్లాంటి తెల్లని ప్లాస్టిక్ గుండీల వంటి వాటితో తెల్లని ఆవును సృష్టించాను. ఇంజక్షన్ సీసాల మీద ఉండే రంగుల ప్లాస్టిక్ మూతలు, చింతగింజలు ఆవు కాళ్ళకు ఉపయోగించాను. మనకు రోజూ పాలు, పెరుగును క్షీరజంతువు. అవి కేవలం గడ్డిని తిని మనకు బలవర్థకమైన పాలు ఇస్తాయి.
చెట్ల విత్తనాలతో...
మానవ నివాసాల కొరకు అడవులను కొట్టేస్తున్నాము. అడవులు తగ్గిపోవడం వల్ల వరదలు, తుఫానులు మొదలయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే చెట్లు పెంచటం తప్పనిసరి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితగా రోడ్ల పక్కన చెట్లు నాటటం మొదలయింది. రావి, వేప, కానుగ లాంటి వృక్షాలు రోడ్డున పోయే బాటసారులకు నీడనిచ్చేవి ఒకప్పుడు. ప్రస్తుతం ఏవో పేరు తెలియని చెట్లను చాలా నాటుతున్నారు. నేనొక రోజు వాకింగ్‌కు వెళ్ళినపుడు రోడ్డు పక్కనున్న చెట్టుకు గుత్తులుగా గింజలు వేలాడటం చూసి కోసుకొచ్చుకున్నాను. ఆ గింజలు ఎలా ఉన్నయంటే రేగిపళ్ళలోపలి విత్తనాల వలె అనిపించాయి. గుండ్రంగా, ఉపరితలం గొగ్గులుగా ఉన్నది. ఈ గింజల్ని ఉపయోగించి ఆవును తయారు చేశాను. ఇది గోధుమరంగు ఆవు అన్నమాట. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇక్కడ ఆవులు, ఎద్దులు ప్రతి ఇంట్లో ఉండి తీరతాయి. ఆవు సాధు జంతువు. ఎవర్నీ ఏమీ అనదు. మనమంతా చిన్నప్పుడు ఆవు-పులి కథ చదువుకున్నాం కదా! అడవిలో మేత కోసం వెళ్ళిన ఆవును పులి తింటాననడం, ఆవేమో ఇంటి దగ్గరున్న తన బిడ్డకు పాలు తాగించి వస్తానని చెప్పడం, చెప్పిన మాట ప్రకారం ఆవు తిరిగి పులి వద్దకు వెళ్ళడం, ఆవు నిజాయితీని గుర్తించిన పులి చివరకు వదిలేయడం... ఇదీ కథ. నిజాయితీ గల ఆవును మన దొడ్లో కట్టేసుకుందాం!
చిక్కుడు విత్తనాలు, శంకు కాయలతో...
నేను మా చెట్లకు కాసిన విత్తనాలను ఎండబెట్టి దాచుకుంటాను. ఆ చిక్కుడు విత్తనాలతో ఎన్నో బొమ్మలు చేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో పూసిన పూలు, ఆకులు, కాయలు అన్నింటినీ బొమ్మల్లో ఉపయోగించుకుంటాను. నల్లని విత్తనం మధ్యలో నిలువుగా తెల్లని చారతో ఉంటాయి. చిక్కుడు విత్తనాలు కిడ్నీ ఆకారంలో ఉంటాయి. శంకు పూలు తీగకు విపరీతంగా కాయలు కాస్తయి. ఆ కాయల్లో నల్లని చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలను ఆవు మూతికి ఉపయోగించాను. ఆవు ఇచ్చే పాలు, పెరుగు, నెయ్యి కాకుండా ఆవు పేడతో పిడకలు చేస్తారు. అలాగే గోబర్ గ్యాస్ తయారౌతుంది. ఆవులు చనిపోయిన తర్వాత వాటి చర్మంతో చెప్పులు మొదలైన తోలు వస్తువులు తయారు చేస్తారు.
క్రోటన్ ఆకులతో...
ఆకుపచ్చ, నారింజ, ఎరుపు, పసుపు రంగులతో ఆకులు కళకళలాడుతూ కనిపించాయి. ఇటీవలె నేనొక పెండ్లికి వెళ్ళినపుడు అక్కడ రంగురంగుల ఆకులున్న క్రోటన్ చెట్లు కనిపించాయి. నేను పెండ్లి నుంచి వస్తూ ఆ ఆకులు కోసుకొని వచ్చాను. ఈరోజు ఈ క్రోటన్లతో ఆవును చేశాను. హరిత ఆవును ఎక్కడైనా చూశారా? వ్యవసాయంలో పాడి పంటలలో ప్రధాన పాత్ర వహించే ఆవులు, ఎద్దులు హరిత విప్లవం సృష్టిస్తాయని క్రోటన్ ఆకులతో హరిత ఆవును తయారు చేశాను. నేల తల్లి పచ్చని మొలకలతో బాలింతగా మారడానికి పశువులే కారణం. తెలుగులోగిళ్ళు పచ్చని పాడి పంటలతో, ధాన్యపు రాశులతో కళకళలాడటానికి గోమాతలే ప్రధానం. ప్రతి ఇల్లు పసుపు కుంకుమలతో పూజింపబడే గోమాతలు ఇళ్ళలో ఉండడమే సౌభాగ్యానికి చిహ్నం. ఇళ్ళలోని మహిళలు పాడి చేసుకొని ఆ డబ్బులతో స్వతంత్రంగా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండేవాళ్ళు.
పారిజాత పూలతో...
నారింజ రంగు పొట్టికాడ, తెల్లని తెలుపు రెక్కలతో ఉండే పారిజాత పువ్వులు సువాసనను కలిగి ఉంటాయి. ఈ పూలతో నేను కృష్ణుడు బొమ్మల్ని తయారు చేశాను గానీ తొలిసారిగా ఆవును తయారు చేశాను. సాధుజంతువైన ఆవును తెల్లని స్వచ్ఛమైన పూలతో తయారు చేయాలనుకున్నాను. ఆవులలో దేశవాళీ ఆవులు, సంకర జాతి ఆవులు, జెర్సీ ఆవులు... ఇలా రకరాలు ఉన్నాయి. ఆవుల్లో కూడా కొన్ని జాతులు అంతరించిపోగా ప్రస్తుతం 29 జాతులు ఉన్నాయి. కపిల, వయోని, ఒంగోలు, పుంగనూరు, గిల్జాతి, షాహియత్ వంటి దేశవాళి రకాలు ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగలోని చివరి రోజు కనుమను పశువుల ప్రాముఖ్యతను తెలియజేయటానికే కేటాయించారు. ఇవి 'బోవిడే' కుటుంబానికి చెందిన పాలిచ్చే జంతువులు. ''బాస్ ప్రిమిజీనియస్'' అని వీటి శాస్త్రీయనామం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్