Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సదియా షేక్... డియోరాలో నిరుపేద పిల్లల కోసం కమ్యూనిటీ లైబ్రరీని నిర్మించింది. అది వారిలో తీసుకొచ్చిన మార్పు ఆమెను మరింత ఉత్సాహపరిచింది. అదే చొరవతో ఇప్పుడు భారతదేశంలోని గ్రామాల్లోని పిల్లలను శక్తివంతం చేయాలనుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు..? ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తోందో మనమూ తెలుసుకుందాం...
ముంబైకి చెందిన 19 ఏండ్ల అమ్మాయి సదియా షేక్. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించే ముందు బీహార్‌లోని డియోరాలోని తన స్వగ్రామాన్ని తన కుటుంబంతో కలిసి సందర్శించాలని నిర్ణయించుకుంది. బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జాలే బ్లాక్‌లోని దేవరాను ఒక చిన్న గ్రామం. ఇందులో మొత్తం 3,446 మంది జనాభా, 631 ఇళ్లు ఉన్నాయి. గ్రామ అక్షరాస్యత రేటు 40.9 శాతం ఉండగా మహిళా అక్షరాస్యత రేటు కేవలం 18.6 శాతంగా ఉంది.
ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేక
సదియా గ్రామానికి తిరిగి వెళ్లినప్పుడు ఆర్థికంగా కాస్త బలంగా ఉన్న కుటుంబాలు నగరాలకు వలస వెళ్లడం, మరికొందరు వెనుకబడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. తనకు నాలుగేండ్లు ఉన్నప్పుడు మంచి అవకాశాల కోసం తన కుటుంబం ముంబైకి వెళ్లిందని ఆమె గుర్తు చేసుకుంది. ''వెనకబడిన కుటుంబాలు వారి పిల్లలకు ప్రాథమిక సౌకర్యాల కల్పించడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూశాను. చాలా కుటుంబాలు తరచుగా తమ పిల్లల చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఎందుకంటే వారు పిల్లలను బడికి పంపేందుకు పుస్తకాలు, యూనిఫాంలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు'' అని సదియా అంటుంది.
సామాజిక అంశాలపై...
బాంద్రాలోని రిజ్వీ కాలేజీలో సోషియాలజీ, ఇంగ్లీషులో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి సదియా. ఈమె మంచి వక్త కూడా. విద్యాహక్కు, మహిళా సాధికారత, నిరుద్యోగం వంటి అంశాలపై ఆమె తరచుగా ఇంటర్ కాలేజ్ ఈవెంట్లలో ప్రసంగిస్తుంది. డియోరాకు చేసిన ప్రయాణంతో బలంగా కోరుకున్న సామాజిక అంశాలపై ఆమె దృష్టి పడింది.
విద్య లేకపోవడం వల్ల...
డియోరాలోని విద్యార్థులు తరచూ తమ చదువులకు స్వస్తి చెప్పి పొలాల్లో పని చేయవలసి వస్తోందని ఆమె గమనించింది. ''ఇది గ్రామాల్లో తరతరాలుగా కొనసాగడాన్ని నేను చూశాను. చదువు లేకపోవడం వల్ల గ్రామీణ జనాభా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంది'' అని సదియా అంటుంది. గ్రామంలో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని, దీని వల్ల చాలా మంది బడి మానేస్తున్నారని ఆమె అర్థం చేసుకుంది. ''కొన్ని కుటుంబాలు ఆడపిల్లలకు చదువు చెప్పడానికి ఇష్టపడవు. ఇతర పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో పొలాల్లో పని చేయవలసి వస్తుంది'' అని ఆమె జతచేస్తుంది.
కుటుంబం ఒప్పుకోలేదు
కొన్ని నెలల పరిశోధన తర్వాత సదియా తన కుటుంబ పెద్దలను కూర్చోబెట్టి లైబ్రరీని ప్రారంభించాలనే ఆలోచనను వారి ముందు ప్రతిపాదించింది. అయితే కుటుంబంలోని చాలామంది ఈ ఆలోచనను ఒప్పుకోలేదు. ఎందుకంటే సదియా తన సమయాన్ని ఇలాంటి పనలకు కేటాయించడం కంటే మరింత తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో పైకి రావొచ్చని వారు భావించారు. ఏదేమైనప్పటికీ సామాజిక మార్పు తీసుకురావాలంటే సమాజంలోని ఉన్నతమైన, విద్యావంతులైన సభ్యులు ముందుకు వచ్చి అట్టడుగు వర్గాలతో కలిసి నిలబడాలని యువ యోధురాలు గట్టిగా భావించింది.
లైబ్రరీని నిర్మించడం
సదియా గ్రామంలోని యువకులను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. వారిని మార్చగలను అనే నమ్మకం ఆమెకు ఉంది. అనేక చర్చల తర్వాత ఆమె చివరకు తన కుటుంబాన్ని ఒప్పించింది. బంధువుల గెస్ట్‌హౌస్‌ను తన పని కోసం అడిగింది. రూ. 5,000 ఖర్చుపెట్టి దాన్ని కొన్ని మార్పులు చేసింది. గత రెండేండ్ల నుండి పబ్లిక్-స్పీకింగ్ అవార్డును గెలుచుకోవడం ద్వారా వచ్చిన డబ్బును ఇలా ఉపయోగించింది. అలాగే ఆమె మేనమామ అక్బర్ సిద్ధిఖ్, కజిన్ నవాజ్ రెహమాన్ ఆమెకు సహాయం చేశారు.
మౌలానా ఆజాద్ పేరుతో...
గెస్ట్‌హౌస్ గోడలకు రంగులు వేసి, వెదురుతో చేసిన పైకప్పును కాషాయ టార్పాలీకి అమర్చి మరమ్మతులు చేయించింది. లైట్లు, పుస్తకాల అరను అమర్చి, ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల చిత్రాలతో పాటు విభిన్న అంశాలకు చెందిన చార్టులను గోడలపై అతికించింది. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్ పేరుతో పెట్టబడిన దేవరాలోని లైబ్రరీ ఇప్పుడు వందలాది కొత్త పుస్తకాలతో పాటు సెకండ్‌హ్యాండ్ పాఠశాల పుస్తకాలతో నిండి ఉంది. ఇవి ఎక్కువగా విరాళాలు, నిధుల సేకరణ ద్వారా వచ్చాయి.
ఉచితంగా పొందొచ్చు
ఈ కమ్యూనిటీ లైబ్రరీ బీహార్ స్కూల్ బోర్డ్‌కు చెందిన 1-12 తరగతి నుండి ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ పుస్తకాలు, నోట్బుక్లు, కామిక్స్, స్టేషనరీ కిట్లను కూడా నిల్వ చేస్తుంది. పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామంలోని ఇతరులు ఈ పుస్తకాలను ఉచితంగా ఉపయోగించు కోవచ్చు. సదియా చిన్న పిల్లలకు రంగులు, కథల పుస్తకాలను కూడా అందిస్తుంది. అలాగూ హిందీ, ఉర్దూ వార్తాపత్రికలకు సభ్యత్వం కూడా తీసుకుంది. ఇంకా గ్రంధాలయ చరిత్ర, సాహిత్యం, గ్రామ పిల్లలు చదవగలిగే వివిధ పుస్తకాలను కూడా ఏర్పాటు చేస్తుంది. గ్రామంలోని పిల్లలు, యువకులలో చదివే అలవాటును పెంపొందించాలనే లక్ష్యంతో ఆమె ఇదంతా చేస్తుంది.
పోటీ పరీక్షల కోసం...
సదియా చెబుతున్న దాని ప్రకారం లైబ్రరీకి అన్ని వయసుల వారు కలిపి సుమారు 200 మంది రోజువారీ సందర్శకులు వస్తుంటారు. ''మేము డిగ్రీ పుస్తకాలను (బిఎ, బి.కాం, బి.ఎస్సీ) కూడా లైబ్రరీలో ఉంచుతాము. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం కూడా పుస్తకాలను అందుబాటులో ఉంచాము. వివిధ ప్రచురణల నుండి ఛారిటీ కోసం ఉచిత సభ్యత్వాలను పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాము'' అని సదియా చెప్పారు.
అవగాహన కల్పించేందుకు
అడ్మినిస్ట్రేటివ్ సహాయంతో అడ్మిషన్ ఫారమ్‌లు పూరించడంతో పాటు ఇతర విషయాల్లో కూడా సదియా విద్యార్థులకు సహాయం చేస్తుంది. మహిళలు, పిల్లలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అవగాహన వర్క్‌షాప్‌లు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఉపాధి అవకాశాల కోసం ప్రచారాలను కూడా నిర్వహిస్తుంది.
ఆధునీకరించేందుకు
సదియా ఇప్పుడు లైబ్రరీని కంప్యూటర్లు, ఇంటర్నెట్తో ఆధునీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా గ్రామ పిల్లలు కూడా ఈ సౌకర్యాలను పొందగలరు. ఆమె ఇటీవల ముంబైకి తిరిగి వచ్చినప్పటికీ తన కజిన్ సహకారంతో లైబ్రరీకి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. లైబ్రరీలో కూర్చోవడానికి ఒక మెంటర్, పిల్లలకు సహాయం చేయడానికి ఒక టీచర్ ఉన్నారు.
మారుమూల గ్రామాల్లోనూ...
సదియా ఇప్పుడు దేవరా పిల్లలకు స్కాలర్షిప్లను ఇచ్చేందుకు కృషి చేస్తున్నది. ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా లైబ్రరీలను ప్రారంభించేందుకు స్వచ్ఛంద సేవకుల బృందాన్ని సేకరించాలని భావిస్తోంది. తన ఈ ప్రయాణంలో గ్రామాలలో పిల్లల చదువుకు తోడ్పడేందుకు మరెన్నో మారుమూల కమ్యూనిటీ లైబ్రరీలను ప్రారంభించాలని సదియా ఆకాంక్షిస్తుంది. దీని కోసం ఆమె ఇంపాక్ట్‌గురు వంటి విభిన్న క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిధులను సేకరిస్తోంది.
- సలీమ