Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది. ఈ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగకు సిద్ధమవుతున్న వేళ క్రిస్మస్ ట్రీలు, అందమైన అలంకరణలు, నోరూరించే కేకులు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లో లభించే కేకులను తెచ్చుకోవడం అంత మంచిది కాదు. అందుకే ఈ క్రిస్మస్ పండక్కి మనమే ఇంట్లో కేక్ తయారు చేసుకుని.. హెల్దీ రెసిపీలతో పండుగను సంతోషంగా జరుపుకుందాం. ఇంట్లోనే చక్కని కేకులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం...
ఎగ్‌లెస్ కేక్..
కావాల్సిన పదార్థాలు: మైదాపిండి - ఒక కప్పు, పాల పౌడర్ - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, చక్కెర - ఒక కప్పు, వెనిలా ఎస్పెన్స్ - కొద్దిగా, నెయ్యి - మూడు టీ స్పూన్లు, బేకింగ్ సోడా - టీ స్పూన్, బేకింగ్ పౌడర్ - టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ - వాల్ నట్స్, జీడిపప్పు, బాదం పప్పు.
తయారు చేసే విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత మైదా, పాలపౌడర్, చక్కెర, నెయ్యి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నింటిని కలిపి.. పాలతో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్ ముక్కలన్నింటినీ అందులో పోసి కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆపైన బటర్ పేపర్ వేసిన బేకింగ్ ట్రే తీసుకుని కొద్దిగా నూనె రాసి.. అందులో ఈ మిశ్రమం పోసుకోవాలి. అంతకంటే ముందు ఓవెన్‌ని ప్రీహీట్ చేయాలి. 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీహీట్ చేసిన తర్వాత 45 నిమిషాల తర్వాత బయటకు తీసి.. మరో 10 నిమిషాల పాటు చల్లార్చితే మీరు కోరుకున్న కేక్ రెడీ అయిపోతుంది. ప
చాక్లెట్ కేక్...
కావాల్సిన పదార్థాలు: గుడ్లు - ఆరు, మైదాపిండి - పావు కిలో, చక్కెర - అరకిలో, కోకో పౌడర్ - 100 గ్రాములు, డార్క్ చాక్లెట్ - అరకిలో, వెనిలా ఎస్సెన్స్ - టేబుల్ స్పూన్, వెన్న - చిన్న క్యూబ్, చాక్లెట్ - 200 గ్రాములు.
తయారు చేసే విధానం: ముందుగా డార్క్ చాక్లెట్, వెన్న కలిపి దాన్ని ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మైదా, కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరో పాత్రలో గుడ్డుతో చక్కెరను బాగా కలపాలి. ఆ తర్వాత చాక్లెట్ మిశ్రమంతో పాటు.. చాక్లెట్ తురుమును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ప్రీహీట్ చేసిన ఓవెన్లో 30 నిమిషాల పాటు దాన్ని బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు చల్లార్చాలి. అంతే మీరు కోరుకున్న చాక్లెట్ మడ్ కేకు సిద్ధమైనట్టే.
ప్లమ్ కేక్
కావల్సిన పదార్థాలు: మైదా- కప్పు, వాల్నట్: రెండు టేబుల్ స్పూన్లు (తరిగినవి), బేకింగ్ పౌడర్: అర టీ స్పూను, ఎండుద్రాక్ష- మూడు టేబుల్ స్పూన్లు, బ్రౌన్ పంచదార: కప్పు, వెనిలా ఎసెన్స్: 3-4 చుక్కలు, గుడ్లు - మూడు, వెన్న - అర కప్పు (మెత్తగా), లెమన్ జస్ట్ - టీ స్పూను, చెర్రీస్: రెండు టేబుల్ స్పూన్లు (సగం) గార్నిషింగ్ కోసం.
తయారు చేయు విధానం: ఓవెన్‌ను 160డిగ్రీ సెల్సియస్‌లో ఉంచాలి. తర్వాత మైదా, బేకింగ్ పైడర్ను ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో వాల్ నట్స్, ఎండుద్రాక్ష వేసి బాగా మిక్స్ చేయాలి. మరో బౌల్లో, బట్టర్, బ్రౌన్ షుగర్ వేసి, బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా క్రీమ్‌లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ , గుడ్డు, లెమన్ జెస్ట్ వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా, బేకింగ్ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కేక్ టిన్‌కు బట్టర్ అప్లై చేసి తర్వాత అందులో పైన రెడీ చేసుకొన్న కేక్ మిశ్రమాన్ని పోయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని 15-20నిముషాలు బేక్ చేసిన తర్వాత చల్లారనివ్వాలి. అంతే క్రిస్మస్ ప్లమ్ కేక్ తినడానికి రెడీ. దీన్ని స్లైస్‌గా కట్ చేసి సగం చెర్రీలను గార్నిష్ చేయాలి. మీకు అవసరం అయితే చెర్రీలను కూడా యాడ్ చేయవచ్చు. ప
మిల్క్ బక్లవ కేక్
కావల్సిన పదార్థాలు: ఫిలో షీట్స్ - పది, మిల్క్ కేక్ (మిఠాయి) - ఏడు లేదా ఎనిమిది, తరిగిన పిస్తాపప్పు - అర కప్పు, నెయ్యి - ముప్పావు కప్పు, పంచదార - రెండు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, రోజ్ వాటర్ - ఐదారు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా బేకింగ్ ట్రేను తీసుకోండి. ఫిలో షీట్స్‌ను తెరవండి. బేకింగ్ ట్రే పైన ఫిలో షీట్స్‌ను పరవండి. బేకింగ్ ట్రే పైన పరిచిన ఫిలో షీట్స్‌పై నెయ్యిని అద్దండి. ఒక బౌల్ తీసుకుని మిల్క్ కేక్‌ని పొడిలా చేయండి. ఇప్పుడు పిస్తాపప్పు పొడిని కూడా అదే బౌల్లో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని తీసుకుని బేకింగ్ ట్రే పైన అమర్చబడిన ఫిలో షీట్ పైన పరవండి. మళ్ళీ ఫిలో షీట్‌పై నేతిని అద్దండి. తర్వాత పొడిగా చేసుకున్న మిల్క్ కేక్‌ని అలాగే పిస్తాపప్పు పొడిని ఒక లేయర్‌లా పరవండి. మరొక ఫిలో షీట్‌తో వీటిని కవర్ చేయండి. ఇలాగే 10 షీట్స్ల మిశ్రమం వచ్చే వరకు చేయండి. 10 వ షీట్ వద్దకు రాగానే పేస్ట్రీని సమానంగా ప్రెస్ చేయండి. ఫిలో షీట్ పైన నెయ్యిని అద్దండి. ఈ ట్రేను గంటపాటు రెఫ్రిజిరేటర్లో ఉంచండి. తర్వాత రిఫ్రిజిరేటర్ లోంచి ట్రేను తీసి సాధారణ టెంపరేచర్‌కు వచ్చే వరకు ఒక పక్కన ఉంచండి. గంట తర్వాత ట్రేలోని మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఈ బేకింగ్ ట్రేను ఓవెన్లో పెట్టి 20 నిమిషాలపాటు 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో బేక్ చేయండి. ఈలోగా ప్యాన్‌ను హై ఫ్లేమ్‌లో ఉంచండి. ప్యాన్‌లో పంచదారను వేయండి. అందులో నీళ్లను పోయండి. తీగ పాకం వచ్చేవరకు పంచదారని పాకం పట్టండి. ఇప్పుడు ఓవెన్ లోంచి ట్రేని బయటకు తీయండి. బేక్ చేసిన ఈ మిశ్రమాన్ని బక్లావా అంటారు. ఈ బక్లావాపై మనం తయారుచేసుకున్న పంచదార పాకాన్ని పోయండి. తర్వాత ట్రేలో బ్యాక్లావా కేక్‌లను విడదీయండి. రూమ్ టెంపరేచర్లో ఈ బక్లావా కేక్‌ను సర్వ్ చేయండి.