Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్‌తో రెండు సంవత్సరాల నుండి అసంఘటిత రంగంపై ఆధారపడ్డ మహిళా శ్రామికులు తీవ్ర ఇబ్బందులు ఇదుర్కొంటున్నారు. సమాజంలో మహిళల పట్ల ఇప్పటికే ఉన్న అసమానతలను మహమ్మారి మరింత తీవ్రతరం చేసింది. దాంతో శ్రామిక మహిళలు జీవనోపాధిని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నప్పటికీ మహిళలు వివక్షకు గురౌతూనే ఉన్నారు. కరోనా వైరస్ మహిళా శ్రామికుల జీవితాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో తెలుసుకుందాం...
2020 మార్చిలో రాత్రిపూట దేశవ్యాప్తంగా ఒక్కసారిగా లాక్డౌన్ విధించడంతో దేశమంతటా వేలాది మంది వలసకార్మికులు తమ ఇళ్లకు కాలినడకన బయలుదేరారు. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహిళలే ఆ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దాని తోడు పని భారం, హింస కూడా తీవ్రంగా పెరిగిందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
ఉద్యోగ భద్రతపై భయం
మహమ్మారి ప్రభావం ఆర్థిక, సామాజిక రంగాలపై ఎలా ఉందో పరిశీలిస్తే... చాలా వరకు కరోనావైరస్ కాలంలో ఉద్యోగ భద్రత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు చాలా కష్టంగా ఉంది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లారుమెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం 2021 మార్చి, ఏప్రిల్ మధ్యకాలంలో గ్రామాలకు చెందిన అసంఘటిత రంగంలోని మహిళలు 80 శాతం మంది ఉపాధిని కోల్పోయారు. ఏప్రిల్ 28, 2021న కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం 45 ఏండ్లు దాటిన వారి పేర్లు నమోదు చేయడం ప్రారంభించినప్పుడు రోజువారీ కూలీగా పని చేసే జనాభాలో అధిక శాతం మంది దీనివల్ల ఒక రోజు ఆదాయాన్ని కోల్పోతారని భయపడ్డారు.
ప్రధాన ఆందోళనలు
''దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఇప్పటికే వైద్య ఖర్చులతో పోరాడుతున్నప్పుడు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కరోనా చికిత్స కోసం అదనంగా ఖర్చులను ఈ శ్రామికులు భరించవలసి వచ్చింది. ఒకపక్క లాక్‌డౌన్‌తో ఆదాయాన్ని కోల్పోయి వైద్య ఖర్చులను భరించలేక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు'' అని ఎస్ఇడబ్ల్యూఏ (స్వయం ఉపాధి మహిళల సంఘం) భారత్‌లో పరిశోధకులు ఐమన్ చెప్పారు. ఈ ఎన్జిఓ అనధికారిక ఆర్థిక వ్యవస్థలో 1.5 మిలియన్ల మహిళా కార్మికులకు సహకరిస్తుంది. ప్రస్తుత సంక్షోభ కాలంలో ఆదాయం, జీవనోపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం వారి ప్రధాన ఆందోళనలు అని ఈ మహిళా కార్మికులతో తన నిరంతర సంభాషణల ద్వారా తాను గమనించానని ఐమన్ చెప్పారు.
పరిస్థితి మరింత దారుణం
అల్మోరా జిల్లాలోని డోల్ గన్వ్ (గ్రామం)లో బసంతి అనే ఒంటరి మహిళ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలను చూసుకుంటూ జీవించేది. కరోనా వల్ల పాఠశాల మూసివేయడంతో ఉపాధ్యాయులు ఇంటి నుండి ఆన్లైన్లో తరగతులు తీసుకోవడం ప్రారంభించారు. దాంతో బసంతికి అకస్మాత్తుగా ఉద్యోగం, ఆదాయం లేకుండా పోయాయి. తన ముగ్గురు పిల్లలను పోషించడం కష్టంగా మారింది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఆమె ఇల్లు ధ్వంసం కావడంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. ''మేము ఆమె కోసం నిధులు సేకరించి రేషన్లు అందించాము. అలాగే వివిధ పథకాలు వాటి ప్రయోజనాలను పొందేలా ఆమెకు సహాయం చేస్తున్నాము'' అని సుమారు 21,000 మంది వ్యవసాయ కార్మికులు, 650 మంది గృహ కార్మికులతో పనిచేస్తున్న ఎస్ఇడబ్ల్యూఏలో అట్టడుగు స్థాయి కార్మికురాలైన బీనా అంటుంది.
విరామం తీసుకుంటే...
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని సూరి గన్వ్కు చెందిన నీమా ఒక ఆగేవాన్ (కమ్యూనిటీ నాయకురాలు). కోవిడ్-19 రెండవ వేవ్ సమయంలో తన భర్త గ్రామానికి తిరిగి రావడంతో ఆమె ఆర్థిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. అప్పటి నుంచి తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంటి నుంచే చౌమీన్ వంటి ఫాస్ట్ ఫుడ్‌ను సిద్ధం చేశానని ఆమె చెబుతోంది. క్రమబద్ధీకరించబడని శ్రామికశక్తికి విరామం తీసుకోవడం జీవనోపాధికి ప్రమాదం కలిగిస్తుందని ఐమాన్ జతచేస్తున్నారు. ఎస్ఇడబ్ల్యూఏ భారత్ నిర్వహించిన పరిశోధన ప్రకారం 2020లో మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో, దాదాపు 400 మిలియన్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికంలో పడిపోయారు. ఈ శ్రామిక శక్తిలో 94 శాతం మహిళలు ఉన్నారు.
ఎందుకు వెనుకబడి ఉన్నారు?
అసంఘటిత శ్రామికశక్తి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా చెప్పబడుతుంది. కానీ ప్రభుత్వం ఈ రంగాన్ని చిన్నచనూపు చూస్తుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులు, పశువులపై ఆధారపడ్డవారు, చేనేత కార్మికులు, చేతివృత్తులవారు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, పట్టణ ప్రాంతాలలో వస్త్ర, తోలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ పరిశ్రమలు ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా కరోనాకు ప్రభావితమయ్యాయని ఐమన్ చెప్పారు.
పెరిగిన భారం
సెప్టెంబరు 2020లో విడుదలైన ఒక యుఎన్ మహిళా నివేదిక పేద, అట్టడుగున ఉన్న స్త్రీలు కోవిడ్-19 వ్యాప్తితో మరణాలు, జీవనోపాధి కోల్పోవడంతో పాటు హింసను మరింత ఎక్కువగా ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు మహిళలు. అయినప్పటికీ వారు పురుషులతో సమానంగా లేరు. ఆరోగ్య రంగంలో లింగ వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉంది. కోవిడ్-19 ప్రతి ఒక్కరూ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక, సామాజిక పతన భారాన్ని మహిళలు మరింత ఎక్కువగా భరిస్తున్నారు.
బతికించిన ఉపాధి హామీ చట్టం
ఇంట్లో వుండే పిల్లలను చూసుకోవడం, ఆన్లైన్ తరగతుల అవసరాలను తీర్చడం, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం, ఇంటి పనులు, జీవనోపాధి ఎంపికలు చేయడం ఈ విధంగా మహమ్మారి కాలంలో మహిళలు ఎంతో పని భారాన్ని మోయాల్సి వచ్చింది. సంభవ్ ఫౌండేషన్‌లో చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్, లేబర్ నెట్ సర్వీసెస్ చైర్పర్సన్ గాయత్రి వాసుదేవన్ మాట్లాడుతూ ''గ్రామీణ భారతదేశంలో ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ద్వారా పొలాల్లో మహిళా కూలీలు పని చేసే చాలా గ్రామాల్లో మగ వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో వారి స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అప్పుడు మహిళలే ఆ కటుంబాలను పోషించారు. మరోవైపు చాలా మంది మహిళలు తమ పిల్లలను తీసుకొని తమ భర్తలు పనిచేసే నగరాలకు వలస వెళ్తున్నారని బీనా చెప్పారు.
నిర్థిష్టమైన మార్పు అవసరం
'గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహిళలకు ఆదాయ వనరులు లేకపోవడంతో వలసలు పెరిగాయి. ఇంతకు ముందు కనీసం తిండికి, కొంత అమ్ముకోవడానికి సరిపడా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది జీవనాధారమైన వ్యవసాయం చేస్తున్నారు. వారి ఉత్పత్తి మాత్రం మార్కెట్‌కు చేరడం లేదు. ఈ మహమ్మారి కారణంగా దేశమంతటా అసంఘటిత కార్మికులకు విరాళాలు ఇవ్వడం కోసం సంస్థలు నిధులు సేకరించడాన్ని అది కేవలక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని ఐమన్ అభిప్రాయపడ్డారు.
స్థిరమైన వ్యవస్థ కావాలి
''ఇలా నిధులు వసూలు చేసి ఇవ్వడం కంటే ఓ స్థిరమైన వ్యవస్థ కోసం ఒక న్యాయవాది ఉండాలని నేను భావిస్తున్నాను. ఒక సమయంలో చాలా నిధులను సేకరించవచ్చు, మరొక సమయంలో అంత ఉండకపోవచ్చు. కాబట్టి మరింత స్థిరమైన, శాశ్వతమైన విధాన స్థాయి మార్పు ఈ శ్రామిక మహిళలకు ఒక విధమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో మరింత సహాయకారిగా ఉంటుంది'' అని ఐమన్ సూచించారు.
- సలీమ