Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. అటువంటి వాటిలో ప్రధాన సమస్య ఏమిటంటే... పురుషులను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా తయారు చేయబడిన వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) డిజైన్ వెనుక ఉన్న లింగ వివక్ష. దీని గురించి మాట్లాడటానికి ఉమెన్ ఇన్ గ్లోబల్ హెల్త్ ఈ సంవత్సరం ఆరోగ్య రంగంలో పీపీఈ కిట్ చుట్టూ ఉన్న లింగ వివక్ష సవాళ్లను డాక్యుమెంట్ చేయడానికి, ఈ సమస్యను బాగా అర్థం చేసుకోవడానికి ఒక పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇందులో 50కి పైగా దేశాల్లోని మహిళా వైద్య కార్యకర్తలలతో ఆన్లైన్ ద్వారా చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి.
మహిళల అవసరాలపై శ్రద్ధ ఏది
వైద్య రంగంలో పని చేస్తున్న మహిళల్లో 90 శాతం మంది నర్సులుగా ఉన్నారు. మహమ్మారి సమయంలో రోగులకు ఎక్కువ సేవలు అందించాల్సిన వారు వీరే. అందువల్ల మెడికల్ పీపీఈ మహిళలకు సరిపోకపోతే మెజారిటీ ఆరోగ్య సిబ్బందికి అది సరిపోదు. పీపీఈ తయారీ ప్రమాణాలు మహిళల అవసరాలపై చాలా తక్కువ శ్రద్ధ చూపుతాయని వారి పరిశోధనలు స్పష్టం చేశాయి.
ఋతుస్రావం సమయంలో అసౌకర్యం
మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నెహ్రూ మెమోరియల్ స్టేట్ డిస్పెన్సరీలో పనిచేస్తున్న వాలెరీ ద్ఖార్ అనే నర్సు ఆమె పిపిఇ కిట్లతో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ''కరోనావైరస్ సమయానికి ముందు మేము ఎప్పుడూ పిపిఇ కిట్లను ధరించలేదు. నా రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో పిపిఇ కిట్లను ధరించిన ఈ రెండు సంవత్సరాలు చాలా అసౌకర్యానికి గురయ్యాను. ఇది అటువంటి మెటీరియల్‌తో తయారు చేయబడటం ఒక విషయమైతే, దీని వల్ల మాకు చాలా ఉక్కపోతగా ఉండి చెమట పోసి చికాకును కలిగిస్తుంది. దీనికంటే ముఖ్యం విషయం ఏమిటంటే ఇది మహిళలు ధరించేందుకు అనువైనది కాదు'' అంటున్నారు.
చాలా బాధ కలిగిస్తాయి
ఇది చాలా సమస్యాత్మకమైనది ఎందుకంటే మనం పీపీఈ కిట్‌ను ఒకసారి ధరిస్తే తిరిగి దాన్ని మళ్ళీ ఉపయోగించలేము. రుతుస్రావ సమయంలో పీపీఈ కిట్లు చాలా బాధ కలిగిస్తాయని కూడా ఆమె అంటున్నారు. ''ఆ సమయంలో మేము నిలబడి పని చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. కానీ పీపీఈ కిట్ ధరించినప్పుడు దాన్ని మార్చలేము, మళ్లీ మళ్లీ వాష్‌రూమ్‌కి వెళ్లలేము. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యక్తుల ఆకారాలు, పరిమాణాలు, అవసరాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కిట్లను తయారు చేస్తే బాగుంటుందని, ఏదో ఒకవిధంగా దీన్ని రుతుక్రమానికి అనుకూలంగా మార్చగలిగితే చాలా మంచిది'' అని వాలెరీ చెప్పారు.
ఉద్యోగం మానేస్తున్నారు
''మహిళా ఆరోగ్య కార్యకర్తలు నిత్యం పురుషుల కోసం రూపొందించిన పీపీఈ కిట్లతో పోరాడుతున్నారు. కోవిడ్‌కు ముందు కొంతమంది పరిశోధకులు మాత్రమే దీనిని పరిశీలించారు. అయితే మహమ్మారి సమయంలో ఆరోగ్య కార్యకర్తలు చాలా కాలం పాటు పీపీఈ లను ధరించాల్సి వచ్చింది. ఈ ఇబ్బందిని భరింలేక వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు తమ వృత్తిని విడిచిపెట్టాలని భావిస్తున్నారు. ఇది మనం ఇకపై విస్మరించలేని సమస్యగా మారింది. ఈ సమస్య కోవిడ్-19 సమయంలో ఎక్కువగా ఉంది. చాలా మంది మహిళలు తమ యజమానులపై (తరచుగా మగ బాస్‌లు) పోరాటం చేస్తూ ఏమీ చేయాలేక మౌనంగా ఉండిపోయారు'' అని గ్లోబల్ హెల్త్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ రూపా దత్ అంటున్నారు.
సొంత డబ్బుతో కొనుక్కున్నారు
మహమ్మారి ప్రారంభ రోజుల్లో ప్రభుత్వం పీపీఈ కిట్లను వైద్య కార్యకర్తలకు అందించలేదు. అయితే ఆశావర్కర్లు నిత్యం కంటైన్మెంట్ జోన్లకు వెళ్ళడం, కరోనా సోకిన వ్యక్తులను నిత్యం కలవాల్సి రావడంతో వారే సొంతంగా పీపీఈ కిట్లను కొనుగోలు చేయవలసి వచ్చింది. ఈ పరిశోధన, సర్వే నిర్వహించడానికి ఆమెను ప్రేరేపించిన దాని గురించి మాట్లాడుతూ ''భారతదేశంలో 9,00,000 మంది బలమైన మహిళా వైద్య సమూహంలో ఆశాకార్యకర్తలు కరోనా సోకిన వారిని గుర్తించడంతో పాటు ఆ సమయంలో ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. కంటైన్మెంట్ జోన్లు, కరోనా సోకిన వ్యక్తుల వద్దకు వెళ్ళాల్సి రావడం వల్ల వారు వారి సొంత డబ్బును పెట్టి కిట్లను కొనుగోలు చేయవలసి వచ్చింది. ఒక పక్క వారికి సరైన వేతనాలు లేవు. దాంతో వారు ఖరీదైన పీపీఈ కిట్లను కొనుగోలు చేయలేక ప్రభుత్వాని అభ్యర్థించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరకు సమ్మెకు దిగారు. కొందరు ఆ నాలుగు నెలల కాలంలో ఒక్క కిట్ మాత్రమే తీసుకోగలిగామని చెప్పారు. మెరుగైన పీపీఈ, వేతనం కోసం ఆ కార్యకర్తలు చేసిన డిమాండ్లకు ప్రతిస్పందనగా ఆశావర్కర్లకు పీపీఈ కిట్లు అవసరం లేదన్నట్టు ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడారు. ఇదే తనను ఈ పరిశోధనకు, సర్వేకు ప్రేరేపించిందని చెప్పారు.
నివేదిక చెప్పిన విషయాలు
వాలెరీ కూడా ప్రతిబింబించిన నివేదికలోని ప్రధాన అంశాలలో ఒకటి పీపీఈ డిజైన్ మహిళల్లో వైవిధ్యం. అలాగే వారి విభిన్న శరీర, ఆకారాలు, వస్త్రాలు, మైనారిటీలకు చెందిన మహిళలు అట్టడుగున ఉన్నట్టు భావించింది. పీరియడ్స్, ప్రెగెన్సీ, మెనోపాజ్‌కు ఈ పీపీఈ కిట్ సరిపోదని కూడా ఈ నివేదిక కనుగొంది. ''కొన్ని పీపీఈ కవర్లను మహిళలు టాయిలెట్‌కు వెళ్ళేందుకు తొలగించలేరు. మహమ్మారిలో పీపీఈ సరఫరా తక్కువగా ఉన్నప్పుడు మహిళా ఆరోగ్య కార్యకర్తలు పెద్దల డైపర్లను ఉపయోగించారు. అంతేకాదు వారు సాధ్యమైనంత వరకు ద్రవ పదార్థాలు తీసుకోవడం తగ్గించేశారు. ఈ పీపీఈ కిట్ వల్ల మహిళలు అసౌకర్యానికి గురవుతూ గౌరవాన్ని కోల్పోయారు'' అని నివేదిక పేర్కొంది.
మాకు సరిపడే కిట్లు కావాలి
ఇది తమకు సరికాదని, తగదని పీపీఈ కిట్ మహిళల పనికి ఆటంకం కలిగించిందని, నొప్పి, బాధలను కలిగించిందనే సమస్యను కూడా లేవనెత్తింది. సుదీర్ఘ షిఫ్టులలో పని చేయాల్సి వచ్చినపుడు పీపీఈ ధరించడం వల్ల గాయాలు, దద్దుర్లు పుండ్లు ఏర్పడతాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలోని మహిళలు భద్రత, గౌరవం, సరైన వేతనం, సమాన నాయకత్వం, తమకు సరిపడే పీపీఈ కిట్లని కోరుకుంటున్నారని డాక్టర్ రూప అంటున్నారు. వీటిని ఏర్పాటు చేస్తే వారు తమ ఉద్యోగాలను చేయగలరని, ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సేవలు అందించగలరు.
నిర్ణయాల్లో మేమెక్కడా..?
''లింగ అసమానత వేళ్లూనుకున్న మన ఆరోగ్య వ్యవస్థల వల్ల మహిళలు తగినంత పని చేయలేకపోతున్నారు. 90 శాతం మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులలో మహిళలు ఉన్నారు. కానీ నిర్ణయం తీసుకునే పాత్రలలో 25 శాతం మాత్రమే ఉన్నారు. పీపీఈ రూపకల్పన, తయారీ, సేకరణ ప్రక్రియలలో మహిళలు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు'' ఈ సమస్యను అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని రూపా అంటున్నారు.