Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న వాళ్ళు వస్తూ వస్తూ ఒమిక్రాన్ వైరస్‌నూ మోసుకొస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వలె ప్రయాణాలు నిలిపివేస్తే ప్రపంచమంతా బాధపడే పని తప్పుతుంది. విశ్వమంతా విహారం చేస్తూ గడగడలాడిస్తూ తిరుగుతున్న ఒమిక్రాన్ వైరస్ మా జిల్లా సిరిసిల్లకూ వచ్చింది. దుబారు నుంచి వచ్చిన వారితో సహ ప్రయాణీకురకాలిగా దర్జాగా వచ్చేసింది. సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు, పిపిఈ కిట్లు లేక వైద్య సిబ్బంది ఎన్నో అవస్థలు పడ్డారు. ఒమిక్రాన్ వస్తుంది వస్తుంది అని భయపడేలోపలే రానే వచ్చేసింది. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ సంరంభాలు, వివాహ సంబరాలు, దేవాలయాల ఊరేగింపులు వంటి జన జాతర్లలో ఎక్కువగా తిరగకపోవడం మంచిది. ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరగడంతో వైరస్‌కు ప్రయాణ సాధనంగా మారుతున్నారు. ప్రాణాధార మందులు, ఐసోలేషన్ కిట్లు, ఆసుపత్రి బెడ్లు ఎక్కువగా ఉంటే మంచిది. ముప్పు ఏ వైపు నుంచి దూసుకొచ్చినా ప్రమాద తీవ్రత తగ్గేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పరీక్షల కోసం ఆర్టీపిసిఆర్, రాపిడ్ యాంటిజన్ కిట్లు ఎక్కువ మోతాదులో రెడీగా ఉంచుకోవాలి. ప్రజలయితే బయట తక్కువగా తిరగాలి. మన ప్రాణాన్నీ, పక్కవారి ప్రాణాల్నీ రిస్క్‌లో పెట్టకుండా చూడాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉందాం. కళాత్మకంగా గడుపుదాం...
గన్నేరు పూలతో...
ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, బిళ్ళగన్నేరు, తెల్ల గన్నేరు, పింక్ గన్నేరు అంటూ గన్నేరులలో చాలా రకాలున్నాయి. ఈ పూల చెట్లను శాస్త్రీయంగా 'నీరియం యాండల్' అంటారు. ఈ పూలు అపోసైనేసి కుటుంబానికి చెందినవి. ఈ చెట్లకు విష ప్రభావం ఎక్కువ. ఈ చెట్లలో ఉండే ఒలి యాండ్రిన్, ఒలి యాండ్రిజన్ వంటి రసాయనాల కారణంగా విషపూరితం అవుతాయి. మనం సాధారణంగా సినిమాలు చూసేటపుడు ఆత్మ హత్యలు చేసుకునే సన్నివేశాల్లో గన్నేరు పప్పు నూరుతూ కనిపిస్తాయి. ఈ ఇట్లు ఎక్కువగా పొడి ప్రదేశాల్లో పెరుగుతాయి. శ్రీలంకలో ఎక్కువగా గార్డెన్స్‌లో పెంచుతున్నారు. అక్కడ వీటిని 'కానేరు' అంటారు. గన్నేరు చెట్టు రెండు నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరిగే పొదలాంటిది. ఐదు రెక్కలతో గుత్తి వలె పూలు పూస్తుంది. సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. మా ఇంట్లో పొదల్లా పెరిగిన గన్నేరు పూలతో పీత బొమ్మను చేశాను. పీతలు సముద్ర తీరాల్లో కనిపిస్తాయి. ఇవి ఆర్ధ్రోపోడా వర్గానికి క్రస్టేషియా ఉప వర్గానికి చెందిన జీవులు.
చింత గింజలతో...
చింతగింజలు, రబ్బరు బ్యాండ్లతో కలిపి ఒక పీతను తయారు చేశాను. నోట్లకు, జడలకు వేసే చిన్న చిన్న రబ్బరు బ్యాండ్లతో కూడా నేను ఎన్నో బొమ్మలు చేశాను. చిన్న రబ్బరు బ్యాండ్లలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగు లుంటాయి. వీటితో చేసే బొమ్మలు చాలా బాగుంటాయి. ఈసారి కేవలం రబ్బరు బ్యాండ్లనే కాకుండా వాటితో పాటు చింత గింజల్ని కూడా వాడాను. పీతకు పది కాళ్ళు ఉంటాయి. వీటికి కుంచించుకు పోయిన పొట్ట ఉంటుంది. చిన్నతోక కూడా ఉంటుంది. పీతలు సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా సముద్రజలాల్లోనే నివసిస్తాయి. కాకపోతే కొన్ని పీతలు నేల మీద కూడా నివసిస్తాయి. ఈ పీతలు నేల మీద ఎక్కడ లోపలికి వెళతాయో అక్కడే పైకి రావు. మరల అవి భూమి లోపల ప్రయాణించి నేల మీదికి మరెక్కడి నుంచో బయటకు వస్తాయి. అంటే ఒక స్థలం నుంచి లోపలికి ప్రవేశించి మరొక స్థలం నుంచి వేరెక్కడ నుంచో బయటకు వస్తాయి. క్యాన్సర్ జబ్బు కూడా శరీరంలో ఒక అంగీనికి వచ్చినప్పటికీ ఎక్కడెక్కడో ప్రయాణించి ఏ అవయవాన్నో తినేస్తూ ఉంటుంది. ఈ కారణంగా క్యాన్సర్ జబ్బుకు చిహ్నంగా పీత బొమ్మను వాడుతుంటారు.
పెడిగ్రీతో...
ఇళ్ళలో పెంచుకునే కుక్కలకు మనం ఇంట్లో పెట్టే ఆహారంతో పాటుగా న్యూట్రిషియస్ ఫుడ్ అవసరం. అందుకని ఈ పెడిగ్రీ కొనుక్కుంటారు. పెడిగ్రీ మీట్ అండ్ మిల్క్, పెడిగ్రీ చికెన్ అండ్ లివర్ చంక్స్, పెడిగ్రీ టేస్టీ మినీస్, పెడిగ్రీ లాంబ్ ఫ్లేవర్, పెడిగ్రీ వెజిటబుల్స్ అంటూ రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి. వీటిలో కొన్ని డ్రై, వెట్ అని కూడా దొరుకుతాయి. డ్రై రకాలలో ఉండే ఆహారం ఎముకల ఆకారంలో, చిన్న బిళ్ళల ఆకారంలో, త్రికోణాకారంలో, ఉండల ఆకారంలో ఉంటాయి. ఈరోజు నేను ఎముకల ఆకారంలో ఉన్న ఆహారంతో ఈ పీత బొమ్మను తయారు చేశాను. పీతలు కొన్ని మంచినీటి సరస్సులలోనూ జీవిస్తాయి. ప్రధానంగా సముద్ర జీవులు. ఈ పీతల పైన ఉండే ఎక్సోస్కెలిటన్ మందంగా, గట్టిగా ఉంటుంది. పీతలలో 6,793 జాతలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడి ఉన్నాయి. వీటికి ఒక జత 'కీలే' అనే నిర్మాణాలుంటాయి. ఇవి మొదటి సారిగా జురాసిక్యుగంలో కనుక్కోబడ్డాయి.
చిక్కుడు గింజలతో...
మా ఇంట్లో ఉన్న చెట్లకు కాసిన పూలు, పండ్లు, ఆకులు, తీగలు, విత్తనాలు వంటి వాటితో నేను బొమ్మలు చేస్తున్నాను. ఏ ఆకూ, తీగా వృధా పోవటం లేదు. ఉదయాన్నే మొక్కల మధ్య తిరుగుతున్నపుడు ఈరోజు నా పువ్వులతో చెయ్యవా అని తలాడిస్తూ అడుగు తుంటాయి. రోజురోజుకూ అందంగా అల్లుకుంటూ తీగలు చాస్తూ లేలేత చివురులు వేస్తూ పైకి ఎగబాకు తున్నాయి. ఎండిపోయిన చిక్కుళ్ళ నుంచి గింజలు బయటికి తీసి దాచుకున్నాను. చిక్కుడు గింజలతో పీత తయారయింది. పొట్టమీద తెల్లని చారతో కాఫీ రంగులో ఉండే చిక్కుడు గింజలు కిడ్నీ ఆకారంలో ఉంటాయి. ఈ చిక్కుళ్ళు లెగూమినోసి కుటుంబానికి చెందినవి. చిక్కుడు గింజల పీత అని మన ఇంట్లో కొత్త రకాన్ని సృష్టిద్దాం. కానీ ప్రపంచంలో పోర్టునస్ పెలాజికస్, కాలినెక్టిస్ శాపిడస్ డంజీనెస్ క్రాబ్, కాన్సర్ పాగురూస్, సిల్లా సెర్నేటా వంటి జాతులు వ్యాపించి ఉన్నాయి. కొన్ని రకాల పీతల్ని ఆహార పదార్థాలుగా వాడుతుంటారు.
వెంటిలేటర్ వేస్టుతో...
ఆసుపత్రులలో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక వేల రకాల బొమ్మలు చేశాను. ఈ రోజు వెంటిలేటర్ వేస్టుతో పీతను తయారు చేస్తున్నాను. ఈ పీతలు నొప్పిని గ్రహించలేవట. మనుష్యులు కూడా ఇలా ఉంటే బాగుండేదేమో. రోజూ తలనొప్పిని, ఒళ్ళు నొప్పులని బిళ్ళలు మింగే పని తప్పేది. సముద్రయాత్రలకు సంబంధించిన కథల్లో పీతల ప్రసక్తి తప్పకుండా ఉంటుంది. పెరూ వంటి కొన్ని దేశాలలో సముద్రాన్ని దేవతగా భావిస్తారు. అటువంటి చోట ప్రజలు తమ చిత్రాలలో పీతలను బంధించారు. రుడ్యార్డ్ క్లిప్పింగ్ రాసిన కథల్లో పీతల ప్రస్తాదన ఉన్నది. పీతల నడక విచిత్రంగా పక్కలకు నడుస్తూ పోతుంది. కొన్ని పీతలు ఈదగలవు. పీతల ఆల్గేలను, చిన్న పురుగులను, ఫంగి బాక్టీరియాలను కూడా తింటుంది. ఇవి మొక్కల్ని, జంతువుల్నీ కూడా తింటాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్