Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సరం దేశం గర్వపడేలా చేశారు మన మహిళా క్రీడాకారులు. వీరి కృషి, పట్టుదల చిందించిన చెమట ఫలించింది. ఈ ఏడాది మన దేశాన్ని ప్రపంచపఠంలో సగర్వంగా నిలిపారు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఇతర క్రీడా ఈవెంట్లలో ఈ సంవత్సరం మహిళలు చూపించిన పట్టుదల అంతాఇంతా కాదు. రెండవ ఒలింపిక్ పతకం అందుకున్న పి.వి. సింధు దగ్గర నుండి పారాలింపిక్స్ పతకాలతో స్వదేశానికి వచ్చిన పారాథ్లెట్ షూటర్ అవనీ లేఖా వరకు కష్టపడి ఆడి ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కొంతమంది మహిళా అథ్లెట్ల గురించి ఓ సారి మననం చేసుకుందాం.
విజయం సాధించాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. దీనికి ఆడామగా అనే తేడా వుండదు. కానీ ఇప్పుడు మనం కేవలం మహిళల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం. మగవారు కష్టపడిన విధంగానే ఆడవారు కష్టపడ్డారు విజయం సాధించారు. అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవల్సిన అంశం ఒకటి ఉంది. తరతరాలుగా మహిళలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇటువంటి రంగాలలో రాణించాలంటే మహిళలు సమాజంతో కూడా అదనపు యుద్ధం చేయాలి. ఆటల్లోనే కాదు సమాజంతోనూ వివక్షపై యుద్ధం చేసి వీరు గెలించారు. అందుకే ఈ రోజు చరిత్రలో నిలిచారు.
సాయిఖోమ్ మీరాబాయి చాను
మీరాబాయి చాను... టోక్యో ఒలింపిక్స్‌లో 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకొని అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. 26 ఏండ్ల ఆమె రెండుసార్లు కామన్వెల్త్ ఆటల్లో బంగారు పతక విజేత. 2017లో 22 సంవత్సరాలలో భారతదేశం తరఫున మొట్టమొదటి ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌గా స్వర్ణాన్ని అందుకున్నారు.
చాను సాధించిన ఈ విజయానికి మార్గం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలను అనుభవించి ఆటల్లోకి ప్రవేశించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో నిరాశతో పోరాడింది. మణిపూర్‌లోని నాంగ్‌పోక్ కక్చింగ్ గ్రామానికి చెందిన ఈ క్రీడాకారిణి టోక్యో ఒలింపిక్స్‌లో తన కల నిజమైందని చెప్పింది. కోటి రూపాయల రివార్డుతో పాటు ఈ ఏడాది జూలైలో ఆమెను రాష్ట్ర పోలీసు శాఖలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమించారు.
పివి సింధు
చైనాకు చెందిన తొమ్మిదో ప్రపంచ ర్యాంకర్ హీ బింగ్ జియావోపై వరుస గేమ్‌ల తేడాతో ఓడి కాంస్యం గెలుచుకున్న షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండోసారి భారత్ గర్వపడేలా చేశారు. 2019లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. రెండు ఒలింపిక్ పతకాలను సాధించిన భారతదేశంలోని ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ఇయర్, ుఉ×ూA స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా 2020లో ఎంపికైంది. ఇటీవల సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.
భావినా పటేల్
ఈ ఏడాది టోక్యోలో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో 4వ తరగతి మహిళల టేబుల్ టెన్నిస్‌లో రజతం సాధించిన పారాథ్లెట్ భావినా పటేల్ పారాలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో మహిళగా నిలిచింది.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో 1986లో జన్మించిన భావినా కేవలం 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. దాంతో ఆమె జీవితంలో ఎక్కువ భాగం వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఆ బాధ నుండి బయటపడేందుకు, ఫిట్నెస్ కోసం క్రీడల్లోకి వచ్చింది. అయితే జాతీయ స్థాయి క్లబ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకోవడంతో జీవితంలో ఆమెకు కొత్త ఆశలు చిగురించాయి. 2011, 2013లో బీజింగ్‌లో జరిగిన ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పిటిటి థారులాండ్ ఓపెన్‌లో రజతం గెలిచిన తర్వాత 4వతరగతి మహిళల సింగిల్స్‌లో ఆమె ప్రపంచ నంబర్ టూ ర్యాంకింగ్‌కు చేరుకుంది.
అవని లేఖా
రెండు పారాలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి పారా అథ్లెట్‌గా అవని లేఖరా చరిత్ర సృష్టించారు. వరుసగా 10 మీటర్లు, 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో స్వర్ణం, కాంస్యం గెలుచుకున్నారు. తర్వాత 2021 పారాలింపిక్ అవార్డ్స్‌లో ''బెస్ట్ ఫిమేల్ డెబ్యూ''తో సత్కరించబడ్డారు.
పదేండ్ల వయసులో అవని తన కుటుంబంతో కలిసి జైపూర్ నుండి ధోల్పూర్కు ప్రయాణిస్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో వెన్నుపాము దెబ్బతింది. నడుము కింద పక్షవాతానికి గురైంది. వీల్‌చైర్‌లో ఉన్న ఆమె తన తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్ క్రీడకు పరిచయమయ్యారు. మాజీ షూటర్లు సుమా షిరూర్, అభినవ్ బింద్రాల ప్రేరణతో ముందుకు సాగారు. ఇప్పుడు ఐదేండ్ల లా డిగ్రీతో క్రీడలను గారడీ చేస్తున్న అవనీ ప్రభుత్వ బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారానికి అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.
లోవ్లినా బోర్గోహైన్
ఇరవై నాలుగేండ్ల లోవ్లినా బోర్గోహైన్ ర్యాంక్‌లతో వేగంగా ఎదిగిన క్రీడాకారిణి. తన కృషి, పట్టుదలతో బలీయమైన బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో ఆమె ప్రపంచ, ఆసియా ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. ఈ సంవత్సరం టోక్యో గేమ్స్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌లో వెలుగులు నింపింది. అర్జున అవార్డు గ్రహీత అయిన ఆమె 2021 దుబారు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వెల్టర్‌వెయిట్‌లో కాంస్యం కూడా గెలుచుకున్నారు.
అస్సాంలోని బరోముఖియా గ్రామానికి చెందిన లోవ్లినా పేదరికం, అంటరానితనంతో పోరాడి బాక్సింగ్‌ని తన కెరీర్‌గా కొనసాగిస్తూ ఈరోజు ఒలింపిక్ పతక విజేతగా అవతరించింది. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ లోవ్లినా, ఆమె సోదరీమణులు కిక్‌బాక్సింగ్‌లో ఒక రూపమైన ముయే థారును స్వీకరించారు. కానీ ఆమె మాత్రం బాక్సింగ్‌ను ఇష్టపడ్డారు.
ప్రియా మాలిక్
టోక్యో నుండి ఒలింపిక్ పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్ల గురించి అనేక వార్తల మధ్య ప్రియా మాలిక్ హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన 2021 ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ఈమె. 73 కేజీల విభాగంలో ప్రియా 5-0తో బెలారస్ ప్రత్యర్థి క్సేనియా పటాపోవిచ్పై విజయం సాధించింది.
భారత ఆర్మీ వెటరన్ జయభగవాన్ నిదానీ కుమార్తె ప్రియా మాలిక్. హర్యానాలోని జింద్‌లో పెరిగారు. పూణేలో జరిగిన ఖేలో ఇండియా అవార్డు, 2019లో ఢిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్‌తో సహా అనేక పతకాలను గెలుచుకున్నారు.
భారత మహిళల హాకీ జట్టు
2021లో భారతీయులు కచ్చితంగా చక్ పెట్టారు. ఒలింపిక్ సెమీఫైనల్‌కు ప్రవేశించిన భారత మహిళల హాకీ జట్టుకు మనందరం ధన్యవాదాలు చెప్పాల్సిందే. కెప్టెన్ రాణి రాంపాల్ నేతృత్వంలో వైస్ కెప్టెన్ సవితా పునియా, దీప్ గ్రేస్ ఎక్కా, సుశీల చాను పుఖ్రంబం, మోనికా, నిక్కీ ప్రధాన్, నవజోత్ కౌర్, వందనా కటారియా, అరంగేట్రం చేసిన గుర్జిత్ కౌర్, ఉదిత, నిషా, నేహా గోయల్, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, లాల్రెంసియామి, సలీమా టెటేలతో సహా 16 మంది సభ్యుల మన హాకీ జట్టు. ఈ జట్టు పతకం గెలుచుకోకపోయినా ఫైనల్స్‌కు చేరుకొని భారత్‌లో మహిళల హాకీకి ఓ మార్గం వేసింది.
- సలీమ