Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరిలోనూ కచ్చితంగా ఎంతో కొంత ఆత్రుత కనబడుతూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా మనలో చాలా మంది డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అలాంటి పరిస్థితి మనకు కనబడకపోవచ్చు. ఈ సమయంలో బేకరీలలో దొరికే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ధరలు కూడా అమాంతరం పెరిగిపోతూ ఉంటాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా బయట తయారైన వాటిని ఇంటికి తెచ్చుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు. అందుకే రుచికరమైన, ఆరోగ్యకరమైన కేకులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం...
రాగి కేక్
కావలసిన పదార్ధాలు: రాగి పిండి - ముప్పావు కప్పు, గోధుమ పిండి - ముప్పావు కప్పు, కొబ్బరి పాలు - ముప్పావు కప్పు, కొబ్బరి పాలు - ముప్పావు కప్పు, ఉప్పు - చిటికెడు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బెల్లం పొడి - కప్పు, పంచదార - రెండు టేబుల్ స్పూన్లు, కోకో పొడి - మూడు టేబుల్ స్పూన్లు, బటర్ - 150 మి.లీ. (కరిగించినది), వెనిలా ఎసెన్స్ -టేబుల్ స్పూను, కొబ్బరి పాలు - కప్పు, పెరుగు - పావు కప్పు (టాపింగ్ కోసం).
తయారుచేసే విధానం: ముందుగా కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. ఒవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి. ఒక బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. దీనిలో మెత్తగా చేసిన బెల్లం పొడి కలపాలి. అలాగే ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోయాలి. కరిగించిన బటర్, పెరుగు కూడా అందులో వేయాలి. ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, ఓవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి. ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.
న్యూ ఇయర్ కేక్
కావలసిన పదార్ధాలు: మైదా - నాలుగు కప్పులు, గుడ్లు - నాలుగు, వెనీలా ఎసెన్స్ - రెండు చెంచాలు, టూటీ ఫ్రూటీ - రెండు కప్పులు, కాండెడ్ పిల్ - రెండు కప్పులు, కిస్మిస్ - కొద్దిగా, జీడిపప్పు - తగినంత, వెన్న - ఒక కప్పు, కార్మేల్ కలర్ - రెండు చెంచాలు, చక్కెర - రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ - రెండు చెంచాలు.
తయారుచేసే పద్ధతి: ఒక గిన్నె తీసుకొని అందులో వెన్న, చక్కెర వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వెనీలా ఎసెన్స్, సన్నని ముక్కలుగా తరిగిన డ్రైఫ్రూట్స్, కార్మేల్ కలర్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. తరువాత కోడిగుడ్లను పగలగొట్టి తెల్ల సొనను వేరే గిన్నెలో తీసుకొని.. పసుపు సొనను ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో కలపాలి. తెల్లసొనను ఎగ్ బీటర్‌తో తెల్ల నురుగు వచ్చే వరకు గిలకొట్టి... దీన్ని కూడా మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు మైదాపిండి, బేకింగ్ పౌడర్ రెండింటిని కలిపి జల్లించి.. ఆ పిండిని గుడ్లు కలిపిన మిశ్రమానికి చేర్చి మెల్లగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దానిని కుక్కర్ గిన్నె లేదా కేక్ ఒవెన్‌లో పోసి పైన జీడిపప్పు చల్లి ఇరవై నిమిషాలు బేక్ చెయ్యాలి. అంతే న్యూ ఇయర్ కేక్ నోరూరించేలా సిద్ధమవుతుంది.
నట్టీ అల్మండ్ కేక్
కావాల్సిన పదార్థాలు: మైదాపిండి - కప్పు, బాదం - కప్పు, క్యాస్టార్ షుగర్ - కప్పు (పౌడర్ చేసిన షుగర్), కాఫీ పౌడర్ - టి స్పూన్, గుడ్డు - ఒకటి, వెన్న(బటర్) - టీ స్పూన్, డ్రామ్ (రమ్) - టీ స్పూన్, వెనీలా వెసేమ్స్ - టీ స్పూన్, పాలు - 120మి.లీ, బేకింగ్ పౌడర్ - రెండు టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒక కోడి గుడ్డు తీసుకొని దానిని పగులగొట్టి ఒక బౌల్ లోకి ద్రవాన్ని తీసుకొవాలి. అందులో క్యాస్టార్ షుగర్ వేసి పసుపు రంగు నుంచి కొంచెం తెలుపు రంగులోకి మారేంత వరకు కలుపుకోవాలి. ఇందులో టీ స్పూన్ వనీలా ఎసెన్స్ కలిపితే ఇంకొంచెం తెలుపు రంగులోకి మారుతుంది. దీనికి రమ్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా తయారైన కేక్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒవెన్‌ను 190 డిగ్రీస్ వద్ద వేడి చేసి వుంచుకోవాలి. ఒక కప్పు జల్లెడ పట్టిన మైదాపిండితో ముందుగా తయారుచేసి పెట్టుకున్న బాదం పౌడర్ (బాదం పప్పుని మిక్సిలో వేసి పౌడర్ చేసుకోవాలి) కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయనవసరం లేదు. ఇక ఈ మిశ్రమంలో రెండు టీ స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే మరికొన్ని పాలు పోసి కలపాలి. తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టి దానికి కొంచెం బటర్ రాసుకోవాలి. నాన్ స్టిక్ లేదా సిలికాన్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దానిలో కేక్ బ్యాటర్ వేసి ఓవెన్‌ని 190 డిగ్రీస్‌లో 20 నుంచి 25 ఉంచితే కేక్ రెడి...
చాక్లెట్ కేక్ పాప్స్
కావాల్సిన పదార్థాలు: కేక్ పాప్ స్టిక్స్ లేదా లాలీ పాప్ స్టిక్స్, పౌండ్ కేక్, చాక్లెట్, ఏదైనా క్రీమ్, స్ప్రింక్లర్స్.
తయారు చేసే విధానం: స్టావ్ వులిగించి చిన్న మంటపై క్రీమ్‌ని వేడి చేయాలి. మెల్లగా కలుపుతూ వుండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. కాస్త వేడైన క్రీమ్‌లో చాక్లెట్ కలుపుకోవాలి. కొంచెం మిక్స్ చేసి ఐదు నిమిషాల పాటూ పక్కన పెట్టేయాలి. చాక్లెట్లో మరి కొంత భాగం మైక్రోవేవ్‌లో 30 నుంచి 40 సెకన్ల పాటూ వేడి చేసి కరిగించుకోవాలి. పూర్తిగా కరిగేదాకా మైక్రోవేవ్‌లో పెడుతూ, తీస్తూ వుండాలి. వేడి కారణంగా చాక్లెట్ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రీమ్, చాక్లెట్ మిశ్రమంతో పాటూ కరిగిన చాక్లెట్ సిద్ధమవుతుంది. క్రీమ్, చాక్లెట్ మిశ్రమాన్ని గనాష్ అంటారు. అలాగే కొన్ని రంగు రంగుల స్ప్రింక్లర్స్ కూడా రెడీగా వుంచుకోవాలి. ఇవన్నీ సిద్ధమయ్యాక ఒక పౌండ్ కేక్ తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలు అయ్యేటట్టు పిసకాలి. ఆ ముక్కలైన పౌండ్ కేక్‌లో గనాష్ కలపాలి. గనాష్ కేక్‌కి బాగా పట్టేసేలాగా చేతులతో బలంగా కలపాలి. కేక్, గనాష్ పూర్తిగా మిక్స్ అయ్యాక ఆ పదార్థాన్ని చిన్న లడ్డూల మాదిరిగా కట్టుకోవాలి. ఆ లడ్డూ లాంటి కేక్, గనాష్ మిశ్రమాన్ని కేక్ పాప్ స్టిక్కి గుచ్చాలి. లాలి పాప్ మాదిరిగా తయారైన కేక్ పాప్‌ని కరిగించి వుంచుకున్న లిక్విడ్ కేక్‌లో ముంచాలి. మరింత మంచి లుక్, టేస్ట్ కోసం... కేక్ పాప్‌ని స్ప్రింక్లర్స్లో అద్దాలి. బాల్ లాంటి కేక్ పాప్కి రంగు రంగుల స్ప్రింక్లర్స్ అంటుకుంటే అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. ఇలాగే ఒక్కో చాక్లెట్ ముద్దా కట్టుకుంటూచాక్లెట్ ద్రవంలో ముంచుతూ మరిన్ని కేక్ పాప్స్ తయారు చేసుకోవాలి.