Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించడం దగ్గర నుండి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్‌కు మొట్టమొదటి మహిళా, అతి పిన్న వయస్కురాలు సిఇఓ అయ్యే వరకు 2021లో భారతీయ మహిళలు వజ్రాల్లా మెరిసిపోయారు. సైన్స్ నుండి కార్పొరేట్ వరకు ఎంటర్టైన్మెంట్ ఇండిస్టీ వరకు ప్రతి రంగంలోనూ మహిళలు ప్రధాన స్థానానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడం నుండి ఇతర జాతీయ రికార్డులను బద్దలు కొట్టేందుకు సమాజంతో పోరాటం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అలాంటి స్ఫూర్తి దాయక మహిళల్లో కొందరి గురించి నేటి మానవిలో...
గగన్‌దీప్ కాంగ్
కరోనావైరస్ మహమ్మారి సమయంలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అద్భుతమైన సేవలు అందించారు వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్. ఈమె వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్లపై ఈమె పరిశోధన చేశారు. కరోనా కాలంలో ఆమె ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ పాలసీ అండ్ ఆరోగ్య వ్యవస్థ నిపుణుడు చంద్రకాంత్ లహరియా అలాగే న్యూఢిల్లీలోని ఎఐఐఎంఎస్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో కలిసిTill We Win: India's Fight Against The COVID-19 Pandemic అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 2020 నుండి స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ద్వారా స్థాపించబడిన కోవిడ్-19 వ్యాక్సిన్లపై వర్కింగ్ గ్రూప్‌లో ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా కూడా ఉన్నారు.
మీరాబాయి చాను
ఈ సంవత్సరం మహిళలు టోక్యో ఒలింపిక్స్‌లో విజయ భేరి మోగించారు. 49 కేజీల విభాగంలో దేశానికి మొట్టమొదటి సారి వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతాన్ని గెలుచుకున్న మీరాబాయి చాను నిజంగా మెరిసిన భారతీయ మహిళల్లో ఒకరు. ఆమె మొత్తం 202 కేజీలు (87 కేజీ+115 కేజీలు) ఎత్తి పతకం సాధించారు. మణిపూర్‌కు చెందిన మీరాబాయి ఎప్పటికప్పుడు తన ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించారు. గత ఐదేండ్లలో కనీసం ఐదు రోజులు కూడా ఆమె తన ఇంటికి వెళ్లలేదు. 2021లో ఒలింపిక్ పతకంతో తన ఇంటికి వెళ్ళింది. 2021 ఏప్రిల్‌లో తాష్కెంట్లో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 86 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లో మొత్తం 205 కిలోలకు 119 కిలోలు ఎత్తి ప్రపంచ రికార్డు సృష్టించారు.
లీనా నాయర్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పెరిగిన లీనా నాయర్ ఇటీవలే యూనిలీవర్లో 30 ఏండ్లు పనిచేశారు. ఇటీవలె ఆమె ఆ సంస్థ సిఇఓగా బాధ్యతలు తీసుకున్నారు. సంస్థలో ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి మహిళా అలాగే అతి పిన్న వయస్కురాలు కూడా ఆమెనే. బ్రిటీష్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్‌గా యూనిలీవర్ మానవ మూలధనాన్ని నిర్వహించింది. ఇది 190 దేశాలలో విస్తరించి ఉన్న బహుళ నియంత్రణ, కార్మికులతో కలిసి పనిచేస్తుంది. ఈ నెలలో నాయర్ గ్రూప్‌లో చేరతారని చానెల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కెప్టెన్ జోయా అగర్వాల్
నలుగురు వాణిజ్య మహిళా పైలట్లు గత ఏడాది జనవరి 10న శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగుళూరు వరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణాన్ని చేసి భారతదేశంలో చరిత్ర సృష్టించారు. దాదాపు 14,000 కి.మీ దూరం కాక్‌పిట్‌లోని పైలట్లు మాత్రమే. ఎయిర్ ఇండియాకు చెందిన కెప్టెన్ జోయా అగర్వాల్... పైలట్లు కెప్టెన్ శివాని మనాÛస్, కెప్టెన్ ఆకాన్షా సోనావానే, కెప్టెన్ తన్మయి పాపగిరితో కూడిన మహిళా సిబ్బందికి నాయకత్వం వహించారు. వారు రెండు నగరాల మధ్య ప్రయాణిస్తూ ఉత్తర ధృవం మీదుగా ప్రయాణించి గమ్యానికి చేరుకున్నారు. ఈ ప్రయాణానికి దాదాపు 13.5 గంటల సమయం పట్టింది. బోయింగ్-777ను నడిపిన అతి చిన్న వయస్కురాలు. గత సంవత్సరం ప్రారంభంలో ఆమె యునైటెడ్ నేషన్స్ ద్వారా జనరేషన్ ఈక్వాలిటీకి ప్రతినిధిగా కూడా ఎంపికైంది.
నోదీప్ కౌర్
పంజాబ్‌కు చెందిన నోదీప్ కౌర్ దళిత కార్మిక హక్కుల కార్యకర్త. గత ఏడాది జనవరి 12న రాజధాని ఢిల్లీ శివార్లలోని ఫ్యాక్టరీ వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపినందుకు ఆమెను అరెస్టు చేశారు. హత్యాయత్నం, దోపిడీ, అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన చట్టంలోని సెక్షన్ల కింద ఆమెపై అభియోగాలు మోపారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్‌తో సహా అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులు ఆమెను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన ఒక నెల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. అలాగే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనలో కూడా ఆమె ప్రముఖంగా పాల్గొన్నారు. తన పిటిషన్లో రైతులకు అనుకూలంగా పెద్దఎత్తున మద్దతు ఇచ్చినందుకు ఆమెను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులో ఇరించారు.
రేష్మా పటేల్
రేస్‌వాకర్ రేష్మా పటేల్ గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-18 బాలికల 5000 మీటర్ల రేస్ వాక్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 23 నిమిషాల 38.57 సెకన్లతో 2014లో గోవాలోని బాంబోలిమ్‌లో నెలకొల్పిన 24:11.70 రికార్డును బద్దలు కొట్టారు. రెండు వారాల వ్యవధిలో అదే జనవరిలో భోపాల్‌లో జరిగిన జూనియర్ ఫెడరేషన్ కప్‌లో 10,000 మీటర్ల రేస్ వాక్‌లో అండర్-20 మార్క్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంక గోస్వామి జాతీయ రికార్డును బద్దలు కొట్టి రేష్మా రెండవ రికార్డ్ బ్రేక్ ఇది.
దిశా రవి
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరసనకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేసి పబ్లిక్ ఎనేబుల్డ్ టూల్‌కిట్ గురించి మాట్లాడినందుకు దేశద్రోహం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఈ 22 ఏండ్ల దిశారవిని అరెస్టు ఢిల్లీ పోలీసులు గత ఏడాది ఫిబ్రవరి 4న అరెస్టు చేశారు. దిశా అరెస్ట్ ప్రపంచ విమర్శలకు దారితీసింది. ఎంతో మంది వ్యతిరేకించారు. చివరకు ఫిబ్రవరి 23న ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇన్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎప్ ఇండియా) వ్యవస్థాపకులలో దిశారవి ఒకరు.
ప్రియా రమణి
జర్నలిస్ట్ ప్రియా రమణి గత ఏడాది ఫిబ్రవరిలో మాజీ జర్నలిస్ట్, బిజెపి మంత్రి ఎంజె అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో నిర్దోషిగా విడుదలైంది. ఆమె 2018లో మీటూ ఉద్యమంలో పాల్గొన సమయంలో లైంగిక వేధింపులకు గురయింది. గత ఏడాది చివర్లో ట్రయల్ కోర్టు ఈమెపై ఉన్న కేసును కొట్టివేసింది. ఈ కేసు గురించి న్యాయమూర్తి రవీంద్ర కుమార్ పాండే మాట్లాడుతూ ''కొంతమంది వ్యక్తులు సమాజంలో ఎంత గౌరవప్రదంగా ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో, ఆడవారి పట్ల తీవ్ర క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు. లైంగిక వేధింపులు, బాధితులపై దాని ప్రభావాలను మన సమాజం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది'' అన్నారు.