Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నెండు నెలలు... పది నగరాలు... ఒక సూట్కేస్‌తో ఆమె తన ఇంటితో పాటు మరెన్నో విషయాల కోసం శోధనను ప్రారంభించారు. గాయకురాలు, పాటల రచయిత, చిత్రనిర్మాత అయిన అమండా సోధి 2021లో ట్వెల్వ్ స్టెప్స్ టు హౌమ్‌లో భాగంగా తన యాత్రను కొనసాగించారు. విదేశాల్లో పుట్టి పెరిగిన ఈమె తన మూలల కోసం, సొంత వారి కోసం ఈ సుదీర్ఘ ప్రయాణం చేశానంటున్నారు. భారతదేశంలో అనేక నగరాలను సందర్శించి త్వరలోనే దీన్ని ఓ పుస్తకంగా తీసుకురాబోతున్న ఆమె అనుభవాలు ఏంటో ఈరోజు మానవిలో తెలుసుకుందాం...
వాషింగ్టన్ డిసిలో పుట్టి పెరిగిన అమండా సోధి 24 ఏండ్ల వయసులో లాస్ ఏంజిల్స్‌కు, 25 ఏండ్ల వయసులో ముంబైకి, 29 ఏండ్లకు కోల్‌కతాకు వెళ్లారు. ''డిసి నా స్వస్థలం అయినప్పటికీ అది ఎప్పుడూ నా ఇల్లు లాగా అనిపించలేదు. బహుశా నా కుటుంబంతో కలిసి నేను అక్కడ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నానేమో. ఒక దశలో ముంబై, కోల్‌కతా రెండింటినీ మరిచిపోలేను. ప్రధానంగా నేను ఏర్పరచుకున్న స్నేహాలు కాల పరీక్షగా నిలవలేదు. డిసిలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఒంటరిగా భావించాను'' అంటున్నారు ఆమె.
జాగ్రత్తలు తీసుకుంటూ...
మహమ్మారి సమయంలో నేను నా ప్రయాణాన్ని(శోధన) ప్రారంభించాను. కొంత వరకు విజయం సాధించాను. జాగ్రత్తల కోసం ఎప్పుడూ మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడంతో పాటు రాష్ట్ర నిర్దిష్ట ట్రావెల్ ప్రోటోకాల్‌ను అనుసరించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రారంభంలో 12 నెలల్లో 12 వేర్వేరు నగరాలను కవర్ చేయాలనేది నా ప్రణాళిక. అయితే కరోనా రెండవ దశ వల్ల నేను నా ప్రయాణాన్ని తదనుగుణంగా సవరించుకోవలసి వచ్చింది. బదులుగా 10 నగరాల్లో 12 నెలలు గడిపాను.
మళ్ళీ హైదరాబాద్‌కు...
జనవరిలో హైదరాబాద్, ఫిబ్రవరిలో అండమాన్, మార్చిలో ఊటీ, ఏప్రిల్‌లో కాశ్మీర్ సందర్శించాను. ఆ సమయంలోనే సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో నేను మే నెలలో చాలా వరకు కాశ్మీర్‌లోనే ఉండవలసి వచ్చింది. ఈ సమయంలో నా మానసిక ఆరోగ్యం అత్యంత దారుణంగా ఉంది. నాకు పిటిఎస్‌డి ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో కాస్త ప్రశాంతంగా స్నేహితులతో కలిసి గడిపేందుకు జూన్‌లో తిరిగి హైదరాబాద్‌కి వెళ్లాను. జూలైలో మనాలి, స్పితి, ఆగస్టులో ఇంఫాల్, సెప్టెంబర్‌లో పూరీ, అక్టోబర్‌లో చండీగఢ్, నవంబర్‌లో ఢిల్లీ, డిసెంబర్‌లో కేరళ వెళ్లాను.
ఇష్టమైన ప్రదేశాలు
అండమాన్, మనాలి, మణిపూర్ ఎల్లప్పుడూ నా లిస్ట్‌లో ఉండేవి. అందుకే 2021కి ఈ స్థలాలను షార్ట్‌లిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను గతంలో హైదరాబాద్, ఊటీ, కాశ్మీర్, కేరళను సందర్శించాను. అయినా ఈ ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నాను. 2021 ఇక్కడ ఇలా ముగించాను. పూరీ, చండీగఢ్, ఢిల్లీ నేను సందర్శించాలనుకున్న ప్రదేశాలు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ ప్రయాణం కోసం నేను ప్లాన్ చేసుకోగలిగిన దాన్ని బట్టే ఉంటుందని నాకు తెలుసు. ఒక పాయింట్ తర్వాత ప్రయాణం దాని సొంత మార్గాన్ని తీసుకోవలసి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణ అనుభవాలు, ఇందులోని మంచి, చెడు అన్నింటి గురించి ఒక పుస్తకం రాస్తున్నాను.
పరిచిపోలేని అనుభవాలు
అండమాన్ వెళ్ళినపుడు స్థానికులతో స్నేహం చేశాను. అక్కడ నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వారు నాకు అనేక అద్భుతమైన ప్రదేశాలను చూపించారు. హైదరాబాద్‌లోని స్నేహితుల వద్దకు మళ్ళీ వెళ్ళడం, అక్కడ కూడా కొత్త స్నేహితులను సంపాదించడం చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్‌లో ఒకరితో ప్రేమలో పడ్డాను. హదయ విదారకానికి కూడా గురయ్యాను. పూరీలోని నా ఇంటి యజమానురాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యంత రుచికరమైన భోజనం వండి పెట్టింది. వాండర్‌ఆన్ ద్వారా స్పితికి గ్రూప్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఇతర ప్రయాణికులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైతిరి రిసార్ట్ నుండి నాకు లభించిన ఆహ్వానం, ఒక అడవిలోని చెట్టు ఇంట్లో ఉండడం నాకు ఓ సాహసం.
సవాళ్ళు కూడా ఉన్నాయి
ఒక సంవత్సరం పాటు ఒకే సూట్‌కేస్‌లో వస్తువులను ప్యాకింగ్ చేయడం కొంచెం సవాలుగా అనిపించింది. ట్రావెల్ ప్రోటోకాల్ ఏడాది పొడవునా అభివద్ధి చెందింది. ఫలితంగా నేను సందర్శించిన నగరాల తుది జాబితా సవరించబడింది. పోర్ట్ బ్లెయిర్‌లోని ఒక హౌటల్ యజమాని కుమార్తె నా వివరాలను పోలీసులను పంపడం వంటి కొన్ని ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. ఊటీలోని ఒక హాస్టల్లో అసహ్యకరమైన అనుభవం ఎదురైంది. అక్కడ నేను మరుసటి రోజు చెక్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఎదురైనా ప్రయాణం మాత్రం అద్భుతమైనది.
స్థానిక పరిస్థితులు తెలుసుకున్నాను
పర్యాటకులు సాధారణంగా కొన్ని రోజులు వచ్చి వెళ్లిపోతారు. కానీ నేను కనీసం ఒక నెలపాటు ఒక ప్రదేశంలో ఉంటున్నాను. దాంతో స్థానిక సంస్కతికి సంబంధించిన విషయాలను తెలుసుకోగలిగాను. వాటిని ఆస్వాదించగలిగాను. ప్రత్యేకించి స్థానిక వంటకాలకు రుచి చూశాను. గడిపిన ప్రతి చోట వీలైనంత వరకు ఎక్కువ మంది స్థానికులతో సంభాషించాను. ఇది ఆ 30 రోజుల వ్యవధిలో ప్రతి ప్రదేశంలోని స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడింది.
ఇంకా నా వ్యక్తులను చేరుకోలేదు
సాంకేతికంగా నేను ఈ నగరాల్లో దేనిలోనైనా నివసించగలను. నేను డిజిటల్ సంచారిని. ఇంటర్నెట్‌ని కలిగి ఉన్న ఏ ప్రదేశం నుండి అయినా పని చేయగలను. ఇంకా నాకు ఒకే సమయంలో ఎన్నో ప్రదేశాల్లో ఉన్నట్టు అనిపించేది. ఇల్లు ఒక స్థలం కాదు. ఇది ప్రజలతో కూడుకున్న ప్రదేశం. అయితే నేను ఇంకా నా వ్యక్తులను చేరుకోలేదు. అలాగే నేను నా కుటుంబాన్ని ఇంటితో సమానం అని చెప్పలేను. ఇది నా మనసులో శాశ్వతమైన వింత అనుభూతి. ఈ ఏడాది హైదరాబాద్, శ్రీనగర్ మధ్య నా సమయాన్ని విభజించుకోవాలని ప్లాన్ చేస్తున్నాను.
ఒంటరి ప్రయాణం ఎన్నో నేర్పుతుంది
ఓ స్త్రీగా ఇన్ని రోజులు ఒంటరిగా ప్రయాణించడం కష్టమే. అయితే పురుషులైనా, మహిళలైనా అప్పడప్పుడూ ఒంటరిగా ప్రయాణించాలి. మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రయాణాలే మనకు నేర్పుతాయి. ఇది మన సొంత సంస్థలో సౌకర్యవంతంగా ఉండటానికి, మన అంతర్గత శత్రువులను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. ఇది మొదట్లో భయానకంగా అనిపించినప్పటికీ మనం ఒంటరిగా ప్రయాణించిన తర్వాత అది అంత కష్టం కాదని కచ్చితంగా భావిస్తాము.
ఇంటికి పన్నెండు అడుగులు
నేను నా ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను నా ఇనిస్టాగ్రామ్ పేజీ, ఏaఎaఅసaరశీసష్ట్రఱలో పోస్ట్ చేస్తున్నాను. నా ఫోన్‌లో వీడియో ఫుటేజీని కూడా సేకరించాను. ఈ ఏడాది విడుదల చేయబోయే కొత్త సింగిల్ కోసం మ్యూజిక్ వీడియోలో వీటిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను. నేను సంగీతాన్ని సృష్టించి చాలా కాలం అయ్యింది. ఈ ప్రయాణం గురించి నేను రాసే పుస్తకం కోసం ప్రతిరోజూ నోట్స్ తయారు చేసుకుంటున్నాను. ప్రస్తుతం దీనికోసం ''ఇంటికి పన్నెండు అడుగులు'' అనే శీర్షిక అనుకుంటున్నాను.