Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవితా జైస్వాల్... ఉత్తరప్రదేశ్‌లోని రారుబరేలీకి చెందిన ఈ 17 ఏండ్ల అమ్మాయి... మహమ్మారి సమయంలో పాఠశాలలు మూసివేయడంతో ఎంతో పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. ఎక్కువ శాతం ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. మరి ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేని నిరుపేదల సంగతేంటి. అలాంటి అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు చదువు చెప్పేందుకు ఆమె ముందుకొచ్చింది. అంత చిన్న వయసులోనే సేవాదృక్పథంతో సమాజం గురించి ఆలోచించిన ఆ అమ్మాయి గురించిన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం...
యుపిలోని రారుబరేలీ జిల్లాలోని ఒక కుగ్రామమైన కల్లు కా పూర్వాలోని పిల్లలు మహమ్మారి కారణంగా పాఠశాలకు హాజరు కాలేకపోయారు. అలాంటప్పుడు కవితా జైస్వాల్ వారి చదువులో అంతరాయం లేకుండా చూసేందుకు ఆక్స్‌ఫామ్ ఇండియా వారి మొహల్లా స్కూల్ ద్వారా వారికి బోధించడం ప్రారంభించింది.
తదుపరి చదువు కష్టం
కవితా జైస్వాల్ 11వ తరగతి విద్యార్థిని. తన గ్రామంలోని పాఠశాలలో గ్రేడ్ 5 వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చాలా మంది తల్లిదండ్రులు తమ అమ్మాయిలను తదుపరి చదువుల కోసం పట్టణానికి పంపడానికి ఇష్టపడరు. కానీ కవిత మాత్రం కుగ్రామంలో పుట్టినప్పటికీ దగ్గరలోని పట్టణానికి వెళ్ళి చదువుకోగలుగుతుంది.
ఎలాగైనా చదువు చెప్పాలని
2020లో కరోనా ప్రారంభమైన తర్వాత లాక్డౌన్ల కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేని అమ్మాయిలు ప్రాథమిక విద్యను కూడా పొందలేకపోయారు. తన గ్రామంలోని అమ్మాయిలకు ఎలాగైన చదువు చెప్పాలనే ఉద్దేశంతో కవిత ఆక్స్‌ఫామ్ ఇండియా వారి 'మొహల్లా స్కూల్' ద్వారా వారికి చదువు చెప్పడం ప్రారంభించింది.
ఉన్నత విద్య ఓ కల
''ఇక్కడి చాలా మంది ఆడపిల్లలకు ఉన్నత విద్య ఒక కల. తల్లిదండ్రులు తమ బాలికలను తదుపరి చదువుల కోసం సమీపంలోని పట్టణానికి పంపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో సంఘ వ్యతిరేక శక్తుల అల్లర్లు, ఈవ్ టీజింగ్ సంఘటనల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ అమ్మాయిలకు విద్య నిజంగా ఒక ప్రత్యేకం'' అని కవిత అంటుంది.
సంతోషంగా అంగీకరించాను
కవితకు బోధించడం అంటే చాలా ఇష్టం. తన తోబుట్టువులకు, పొరుగు ఇళ్లలోని కొంతమంది పిల్లలకు క్రమం తప్పకుండా పాఠాలు చెప్పేది. ''పాండమిక్ సమయంలో పాఠశాల మూసివేయబడినప్పుడు, పాఠశాల అధికారులు, ఆక్స్‌ఫామ్ ప్రతినిధులు నన్ను మొహల్లా పిల్లలకు నేర్పించగలవా అని అడిగారు. అప్పుడు నేను చాలా సంతోషించాను. అడిగిన వెంటనే పాఠాలు చెప్పేందుకు అంగీకరిచాను'' ఆమె చెప్పింది. కల్లు కా పూర్వ ప్రైమరీ స్కూల్ (రారుబరేలి)లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షురాలితో పాటు కవిత తల్లి కూడా పాఠాలు బోధించేందుకు కూతురిని ప్రోత్సహించింది. దాంతో ప్రతిరోజూ కొన్ని గంటలపాటు అక్కడి పిల్లలకు ఆమె పాఠాలు చెప్పేది.
సొంత గ్రామంలో అయితే...
ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ బినోద్ కుమార్ సాహా వారు మొహల్లా పాఠశాలలను ఎలా ప్రారంభించారో వివరిస్తూ ''పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం లేక ఎంతగా నష్టపోతున్నారో నష్టంతో మేము గమనించాము. చాలా చోట్ల అమ్మాయిలు చదువుమానేశే ప్రమాదం కూడా ఉంది. ఇదే ఆందోళనను ఎస్ఎంసి ఫోరమ్ మీటింగ్‌లో తల్లిదండ్రులు మాతో పంచుకున్నారు. ఎవరైనా తమ సొంత గ్రామాల్లో తరగతులు తీసుకుంటే వారు తమ సమస్యను అధిగమించగలమని సూచించారు'' అన్నారు. మొహల్లా తరగతులను నిర్వహించాలనే ఆలోచన ఈ విధంగా వచ్చింది. తరువాత వారు ఎస్ఎంసి నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రధాన్ గ్రామ వాలంటీర్లను ఈ పనిలో నిమగం చేయడానికి చొరవ తీసుకున్నారు.
మొదట సందేహించారు
''ప్రారంభంలో కోవిడ్-19 తమని ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి, గ్రామాలను సందర్శించడానికి ఉపాధ్యాయులు సందేహించారు. అందుకే మేము ఒక పరిష్కారాన్ని కనుగొన్నాము. ఉపాధ్యాయులు వాలంటీర్లకు ఫోన్లో ఓరియంటేషన్ అందించాలని నిర్ణయించారు. వారు బోధనలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, వాలంటీర్లు వారి నుండి సహాయం తీసుకుంటారు'' అని వారు చెప్పారు.
నిరంతరాయ అభ్యాసం
ఆక్స్‌ఫామ్ ఇండియా రారుబరేలీతో పాటు బండా జిల్లాల్లో దాదాపు 120 మంది స్వచ్ఛంద సేవకులను గుర్తించింది. వారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సహాయంతో శిక్షణను అందించింది. వారి సొంత పరిసరాల్లో మొహల్లా తరగతులు తీసుకునేలా చేసింది. గ్రామ పంచాయతీ, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో దాదాపు 120 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. కల్లు క పూర్వాలో ప్రాథమిక పాఠశాల ఆక్స్‌ఫామ్ అధికారులకు, పాఠాలు బోధించే కవితకు చాలా దూరంలోని మైదానంలో మొహల్లా పాఠశాల తరగతులు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్-19 బారిన పడుతుందనే భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి మొదట్లో సందేహించారని కవిత చెప్పింది. భౌతిక దూరం వంటి అన్ని భద్రతా ప్రోటోకాల్‌లు అమలులో ఉంటాయని, పిల్లలు మాస్కులు ధరించి పాఠశాలకు వచ్చేలా చూడమని తల్లిదండ్రులను ఒప్పించేందుకు కవిత తన తల్లితో పాటు ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించింది.
పుస్తకాలు లేక ఇబ్బంది
తరగతులు ప్రారంభించిన తర్వాత పుస్తకాలు, బోధనా సామగ్రి దొరకడం ఓ సవాలు. అయితే లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చని, వాటి సంరక్షణకు పూర్తి బాధ్యత వహించాలని ఎస్ఎంసి సభ్యులు సూచించారు. ఉపాధ్యాయులు కూడా దీనికి సమ్మతించారు. పాఠశాలలు తిరిగి బోధన ప్రారంభించే వరకు పిల్లలు వారి విద్యను కొనసాగించేందుకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేసేందుకు ఎస్ఎంసి సభ్యులు ముందుకు వచ్చారు. మొదట 10 మంది పిల్లలతో ప్రారంభించిన కల్లు కా పూర్వాలోని మొహల్లా పాఠశాల ఇప్పుడు 30 కంటే ఎక్కువ మంది విద్యార్థులను కలిగి ఉంది. వారు ఇంగ్లీష్, గణితం, సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్టులను నేర్చుకునేందుకు ప్రతిరోజు గంటన్నరపాటు తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతారు.
దారిలోకి తీసుకొచ్చేందుకు
''మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పిల్లలు దాదాపు మూడు నెలలు పాఠశాలకు హాజరుకాకపోవడంతో వారు నేర్చుకున్న చాలా విషయాలు మర్చిపోయారు. దాంతో వారు ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేకపోయారు. మళ్ళీ వారిని తీర్చిదిద్దడానికి కొంత సమయం పట్టింది. పట్టుదలతో అందరం కలిసి పిల్లలను మళ్లీ నేర్చుకునే దారిలోకి తెచ్చాం'' అని కవిత చెబుతుంది.
బోధన కొనసాగిస్తూనే...
గత నెల నుండి పిల్లలు తిరిగి పాఠశాలకు వెళుతున్నారు. అయితే కవిత వారిలో కొందరికి ఇంటి నుండి బోధించడం కొనసాగించాలని భావిస్తోంది. బినోద్ మాట్లాడుతూ ''లాక్డౌన్ సమయంలో మొహల్లా తరగతుల ద్వారా క్లాసులకు హాజరైన పిల్లలు పాఠశాలలు తెరిచిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కానీ పాఠశాలను పునఃప్రారంభించిన వారికి అదనపు తరగతులను అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా వారు వయసుకు తగిన అభ్యాసాన్ని పొందవచ్చు. మళ్ళీ గ్రామంలో తరగతులను ప్రారంభించగల కొంతమంది వాలంటీర్లను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అన్నారు. ఇక కవిత విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ చదివి ఉద్యోగం చేయాలని ఆశగా ఎదురుచూస్తోంది. కానీ బోధన మాత్రం ఆమెకు ఓ అభిరుచిగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆమె పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉంది.
- సలీమ