Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలం వచ్చిందంటేనే బద్ధకం దరిచేరినట్లే. చలి కారణంగా పడక నుంచి దిగాలని అస్సలు అనిపించదు. వేడి కోసం దుప్పట్లోనే అలాగే ముడుచుకొని ఉండాలనిపిస్తుంది. ఫలితంగా దినచర్య కూడా మారుతుంది. వర్కౌట్ సెషన్లను తప్పించుకోవడం, ఎక్కువ సేపు నిద్రపోవడం వంటివి ఈ కాలంలో తరచూ చేస్తుంటారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సోమరితనం ఈ సమస్యలను తీవ్రతరం చేస్తుందని నిపుణులు తెలిపారు. చలికాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం: రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తృణధాన్యాలు, చేపలు, చికెన్, చిక్కుడు, విత్తనాలు, తాజా పండ్లు, కూరగాయలు లాంటి ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అధిక కేలరీలనిచ్చే ఆహారాలను ఈ కాలంలో తీసుకోకపోవడం మంచిది.
వ్యాయామం: ఫిట్‌గా ఉండాలంటే శారీరక శ్రమ అతిముఖ్యమైన అంశం. రోజువారీ వ్యాయామం మీలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ప్లూ, జలుబు లాంటి కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా, గుండె సమస్యలు, రేనాడ్స్ లాంటి అనారోగ్య పరిస్థితులు ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందు వైద్యులను సంప్రదించాలి.
ఒత్తిడిని నియంత్రించండి: ఒత్తిడిగా అనిపించినప్పుడు కాస్త విరామం తీసుకోండి. అంతేకాకుండా మీ మనసు ప్రశాంతంగా అయ్యే ఏదైనా కార్యచరణను అవలంభించండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి మీకు ఉపశమనంలభిస్తుంది.
తగినంత నిద్ర: తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మరుసటి రోజు శక్తి, ఆకలి స్థాయిలను స్థీరకరించి శరీరాన్ని పునరుత్పత్తి చేయడంలో నిద్ర సహాయపడుతుంది. నేషనల్ హార్ట్, లంగ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన డేటా ప్రకారం ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఎవరైనా నిద్రలేమితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.
సరైన దుస్తులు ధరించండి: ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాబట్టి అందుకు తగిన దుస్తులను ధరించాలి. కోటు, టోపీలు, పొరలుగా ఉండే దుస్తులు, చేతి గ్లౌజులు, భారీ సాక్సులు ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నియంత్రించవచ్చు.
తరచూ చేతులు కడుక్కోవడం: శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కాబట్టి సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా దీన్ని నివారించాలి. జ్వరం, వైరల్ దగ్గు లేదా శరీర నొప్పులు లేదా ఏవైనా ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే యాంటీ వైరల్ వైద్యుడిని సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి.
బయటకు వద్దు: శీతాకాలంలో ఎక్కువ సేపు బయట తిరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.