Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉప్మా అనే పదం మన దక్షిణ భారత దేశంలో ప్రతి ఇంటా వింటూనే ఉంటాము. ఉప్మాని కూడా ఎన్నో రకాలుగా, ఎన్నింటితోనో చేసుకోవచ్చు. పోషక విలువలు ఉండేలా చూసుకుని తయారు చేయవచ్చు. పిల్లలకు ఏదైనా వెరైటీగా ఉండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. ఉప్మా అంటే మూతితిప్పుకునే మీ పిల్లల కోసం కొన్ని వెరైటీ ఉప్మాలు తయారు చేయండి. మరెందుకు ఆలస్యం ఆ ఉప్మాలు ఏంటో మనమూ తెలుసుకుందాం...
బియ్యపు రవ్వతో
కావలసిన పదార్ధాలు: బియ్యపు రవ్వ - ఒక కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, పచ్చి బఠానీలు - ఒక గుప్పెడు, ఉల్లి గడ్డ తరుగు -అర కప్పు, పల్లీలు - గుప్పెడు, పొడవుగా చీల్చిన పచ్చి మిర్చి - నాలుగు, కరివేపాకు - కొంచం, ఉప్పు, నూనె, పోపుదినుసులు - తగినంత.
తయారు చేయు విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో నాలుగు చెంచాల నూనె పోసి వేడిచెయ్యాలి. తర్వాత పోపుదినుసులు, పల్లీలు వేసుకోవాలి. అవి కొంచం గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము, బఠాణీలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత మూడు కప్పుల నీళ్లు పోయాలి. అందులోనే తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతుండగా స్టవ్ మంటను తగ్గించి బియ్యపు రవ్వను వేస్తూ కలుపుతూ ఉండాలి. రవ్వ మొత్తం వేశాక ఒక సారి గరిటీతో బాగా కలియ పెట్టి మూత పెట్టాలి. మొత్తం ఉడికి కొంచం గట్టిగా కాగానే స్టవ్ ఆపేసి పైనుంచి మూడు చెంచాల నెయ్యి పోసుకోవాలి. కొంచం వేడి మీద తింటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళూ ఆవకాయ, టమాటో పచ్చడితో, నిమ్మకాయ ఊరగాయతో కానీ తినవచ్చు.
సేమ్యా ఉప్మా
కావాల్సిన పదార్ధాలు: సేమ్యా - కప్పు, ఒక చిన్న టమాటో ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, చిన్న అల్లం ముక్క, పచ్చి మిర్చి ముక్కలు - రెండు చెంచాలు, నూనె, పోపుదినుసులు, కరివేపాకు, ఉప్పు, పసుపు - సరిపడా.
తయారు చేయువిధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెలో నాలుగు చెంచాల నూనె పోసి అది వేడెక్కాక పోపు దినుసులు, కరివేపాకు వేసి రంగు మారేదాక వేయించాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి వేయించు కోవాలి. ఆ తర్వాత రెండు కప్పులకు కొంచం తక్కువగా నీళ్లు పోసి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. నీళ్లు మరుగుతుండగా అందులో సేమ్యావేసి ఒక సారి కలిపి మూత పెట్టాలి. నీరు మొత్తం ఇంకి పోయాక స్టవ్ ఆపేసి కొంచం వేడి తగ్గాక నిమ్మరసం కలుపుకుని తింటే చాలా బావుంటుంది.
సూచన: సేనగపప్పు పోపులో కొంచం ఎక్కువ వేస్తే చూడటానికి బావుంటుంది. ఫుడ్‌కలర్‌కి బదులుగా పసుపు వేస్తే మంచిదని ఇందులో పసుపు ఉపయోగించాను)
మరమరాలతో
కావలసిన పదార్ధాలు: మరమరాలు - ఒక చిన్న గిన్నెడు, నూనె, పోపుదినుసులు, పల్లీలు, ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి - ఒక చిన్న కప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు - తగినంత, క్యారెట్ తురుము - నాలుగు స్పూన్లు.
తయారు చేయు విధానం: ఒక మందపాటి బాండీలో నూనె పోసి అది వేడెక్కాక పోపు దినుసులు, పల్లీలు వేసి గోధుమరంగులోకి వచ్చాక కరివేపాకు తరిగిన ముక్కలు, క్యారెట్ తురుము వేసి ఒక సారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గాక మరమరాలు ఒక నిమిషం పాటు నీళ్లలో ముంచి ఆ తర్వాత నీటిని పిండేసి బాండీలో వేసి ఒక సారి ముక్కలు బాగా కలిసేలా కలియబెట్టాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. కొంచం వేడి తగ్గాక ఇష్టమున్న వారు నిమ్మకాయ రసం చల్లుకుని లేదా కొత్తిమీర వేసుకుని తినవచ్చు.
మల్టీ గ్రైన్‌రవ్వతో
కావలసిన పదార్ధాలు: మల్టీ గ్రైన్ రవ్వ (మార్కెట్లో దొరుకుతుంది) - ఒక కప్పు, పోపు దినుసులు, నూనె, ఉప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా, క్యారెట్, బీన్స్, సన్నగా తరిగి పెట్టుకోవాలి (కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది), జీడిపప్పు బద్దలు - ఎనిమిది.
తయారు చేయువిధానం: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో నాలుగు చెంచాలు నూనె పోసి అది వేడెక్కాక పోపుదినుసులు, జీడిపప్పు, కరివేపాకు వేసి కొంచం రంగుమారేదాక తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి. నీళ్లు మరుగుతుండగా అందులో మల్టీ గ్రైన్ రవ్వ వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. నీళ్లు అయిపోయి రవ్వ అంత బాగా ఉడికిన తర్వాత కొంచం నెయ్యి పోసి దింపేయాలి. ఇది వేడిగానైనా, చల్లారినా రుచిగానే ఉంటుంది. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా పెరుగు, నిమ్మకాయ ఊరగాయ వేసుకుని తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహ గ్రస్తులకు ఇంకా మంచిది.