Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షవంతి బిష్ట్... అసమానతలను బద్దలు కొట్టుకుంటూ పర్వతాలను అధిరోహిస్తున్నారు... పర్యావరణాన్ని రక్షించేందుకు తన వంతు కృషి చేస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పర్వతారోహణ పట్ల తనకున్న ఆసక్తే తనను ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్‌కు మొదటి అధ్యక్షురాలిని చేసిందంటున్నారు ఆమె. పర్వతారోహణలో యువతను, మహిళలను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణం కోసం, అడవులు, కొండల రక్షణ కోసం విశేషమైన కృషి చేస్తున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
64 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్‌కు లెజెండరీ పర్వతారోహకురాలు హర్షవంతి బిష్ట్ నాయకత్వం వహించనున్నారు. ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా హర్షవంతి చరిత్ర సృష్టించారు. బాధ్యత తీసుకోవడంతోనే సరిపోదు పర్వతాలు, పర్వతారోహణ కోసం తన వంతు కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరింత ఉత్సాహంగా...
''నేను గతసారి (దాదాపు ఆరేండ్ల కిందట) పోటీ చేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఈసారి నేను మరింత ఉత్సాహంగా పోటీలోకి దిగాను. మన దేశంలో పర్వతారోహణ పురోగతి కోసం ఇంకా చాలా చేయగలనని అధికారులను ఒప్పించేందుకు ఎక్కువ సమయం కేటాయించాను. ఈ రంగంలో యువకులకు కూడా అవకాశాలను కల్పించగలనని వారికి నమ్మకం కల్పించాను. అది నాకు అనుకూలంగా పని చేసిందని నేను భావిస్తున్నాను'' అని హర్షవంతి అంటున్నారు.
పురుషులతో సమానంగా ఉన్నాము
107 ఓట్లకు గాను 60 ఓట్లు సాధించి ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. ''పర్వతారోహణ రంగంలో మనం పురుషులతో సమానంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. అలాంటప్పుడు మనం ఆ స్థానాన్ని ఎందుకు పొందలేము?'' అంటున్నారు ఆమె. గత రెండు సంవత్సరాలుగా మహమ్మారి పర్వతారోహణ రంగంలో కూడా మందగమనానికి దారితీసింది. అయితే రాబోయే నెలల్లో పర్వతారోహణలో కొన్ని అవకాశాలు ఉండవచ్చని హర్షవంతి ఆశాభావం వ్యక్తం చేశారు.
సాహస రంగంలో మరిన్ని కార్యకలాపాలు
''పర్వతారోహణ రంగంలో ఎక్కువ మంది మహిళా అధిరోహకులను ప్రోత్సహించడం నా మొదటి ప్రాధాన్యం. గత రెండేండ్లలో మేము అనుకున్నంతగా చేయలేకపోయాము. అయితే సాహస రంగంలో మరిన్ని కార్యకలాపాలు చేయడానికి ఐఎంఎఫ్ కోసం మరిన్ని నిధులు, వనరులను సమీకరించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను'' అని ఆమె చెప్పారు.
పర్వతారోహణ పట్ల మక్కువ
1977లో నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్‌ఐఎం) నుండి పర్వతారోహణలో ప్రాథమిక కోర్సును ప్రారంభించినప్పుడు హర్షవంతి వయసు 21 సంవత్సరాలు. ఆమె తండ్రి సైన్యంలో పనిచేశారు. అయితే ఆమె కుటుంబంలో ఎవరూ పర్వతారోహకులు లేరు. కానీ తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హర్షవంతి పర్వత పర్యాటకంలో పిహెచ్‌డి చేయాలని నిర్ణయించుకున్నారు. ''నేను పర్వతారోహణ కోర్సు గురించి ఆలోచిస్తున్న సమయంలో పర్వతారోహణపై ఉపన్యాసం ఇవ్వడానికి కల్నల్ ఎల్‌పి శర్మ వచ్చారు. ఇది నాలోని ఆసక్తిని మరింత పెంచింది. ఆ సమయంలోనే నేను ప్రాథమిక కోర్సులో చేరాలని నిర్ణయించుకున్నాను'' ఆమె చెప్పారు.
నా పట్టుదల చూసి ఒప్పుకున్నారు
''నేను తీసుకున్న నిర్ణయం పట్ల మా నాన్న సంతోషంగా లేడు. కానీ నేను మాత్రం నా నిర్ణయం పట్ల దృఢంగా ఉన్నాను. నా పట్టుదల చూసి చివరకు ఇంట్లో వారు కూడా ఒప్పుకోవల్సి వచ్చింది'' అని ఆమె అంటున్నారు. పర్వతారోహణను కొనసాగించడానికి తన తల్లిదండ్రుల నుండి అనుమతి పొందడం ఆమెకు అతిపెద్ద సవాలు. ఎందుకంటే ఆ రోజుల్లో పర్వతారోహణకు వెళ్లే మహిళలు చాలా తక్కువ. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని సుకై గ్రామానికి చెందిన ఈ 67 ఏండ్ల పర్వతారోహకురాలు తన ఈ విజయాన్ని కలలో కూడా ఊహించలేదు.
పర్వతారోహణపై పీహెచ్‌డీ
హర్షవంతి పర్వత టూరిజంలో తన పీహెచ్‌డీకి అనుబంధంగా కోర్సు చేయాలనుకుంది. కానీ కొంత కాలం తర్వాత ఆమెలో ఆసక్తి మరింత పెరగడంతో ముందే పీహెచ్‌డీ సీటును తీసుకుంది. ''నేను నా పీహెచ్‌డీ పూర్తి చేశాను. పర్వతారోహణను ఆ సమయంలో ఎంతగానో ఆస్వాదించాను. దానిపై ఉన్న ఆసక్తితోనే పీహెచ్‌డీని కొనసాగించాను'' అంటున్నారు. అప్పటి నుండి కొండలు చాలా మారిపోయాయి. తన బ్యాచ్‌లో పర్వతారోహణను అభ్యసిస్తున్న మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారని, కేవలం 10-15 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని, అయితే నేడు ఆ సంఖ్య ఒక బ్యాచ్‌లో 60-70 మంది బాలికలకు చేరుకుందని ఆమె చెప్పారు.
మొదటి మహిళగా...
''ప్రస్తుతం రిజర్వేషన్లు కూడా ఉన్నందున బాలికలలో ఆసక్తి బాగా పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్ ఉంది. గేర్ కూడా మార్చబడింది. మేము భారీ గేర్లు, సాధారణ రక్‌సాక్‌లు, బూట్లను తీసుకువెళ్లేవాళ్లం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు'' అని హర్షవంతి చెప్పారు. పర్వతారోహణ రంగంలో ఒక లెజెండ్ అయిన హర్షవంతి 1981లో మరో ఇద్దరితో పాటు 7,816 మీటర్ల ఎత్తులో ఉన్న నందా దేవిని అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఆమె అర్జున అవార్డును కూడా అందుకున్నారు.
నన్ను నేను ప్రశ్నించుకున్నా
1977లో హర్షవంతి గంగోత్రి ప్రాంతంలో పర్వతారోహణలో ప్రాథమిక కోర్సు చేస్తున్నప్పుడు ఉత్తరకాశీ నుండి గంగోత్రికి నేరుగా బస్సులు లేవు. ''నేను ఒక స్నేహితురాలితో కలిసి మా వస్తువులను మోసుకుంటూ వెళుతూ చాలా అలసిపోయాము. అక్కడ నిటారుగా నిలబడే అవకాశమే లేదు. ఆ బాధ భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాము. నేను ఈ కోర్సు కోసం ఎందుకు వచ్చాను అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించుకున్నాను. నా నిర్ణయాన్ని నా కుటుంబం ప్రశ్నించడాన్ని గుర్తుచేసుకున్నాను'' అంటూ ఆమె ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
చావుకు దగ్గరగా...
''మేము భైరోంఘటికి చేరుకుని అక్కడి నుండి గంగోత్రికి బస్సులో వెళ్ళినప్పుడు కన్నీళ్లు మాయమయ్యాయి. కోర్సు తర్వాత నాకు గుర్తున్నదల్లా మంచి సమయాలు మాత్రమే. మేము మా వెన్నుపై మోసే భారం, బండరాళ్లు, రాక్ క్లైంబింగ్, ఐస్ క్రాఫ్ట్ ఇవేవీ పట్టించుకోలేదు'' అంటారు ఆమె. 1981లో హర్షవంతి నందా దేవి యాత్రకు వెళ్ళినప్పుడు చావును చాలా దగ్గరగా చూశారు. ''నేను క్యాంపు మూడు నుండి క్యాంపు నాలుగు వరకు భారాన్ని మోస్తున్నాను. షెర్పా నా కంటే ముందు నడుస్తోంది. నేను తాడు ఎక్కిన చివరి వ్యక్తిని. అకస్మాత్తుగా నేను పట్టును కోల్పోయాను. తాడుపై తలకిందులుగా ఉన్నాను. కానీ మాకు మా మనుగడ ప్రవృత్తి నేర్పించింది. తాడు బిగించిన యాంకర్ వైపు నేను నా శరీరాన్ని బలవంతంగా నెట్టుకున్నాను'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇటువంటి యాత్రలు మంచు పడటం, పెద్ద పగుళ్లు వంటి అనేక సవాలు పరిస్థితులను తీసుకువస్తాయి.
అడ్డంకులను సృష్టిస్తాయి
పర్వతాలలో ఉన్న అడ్డంకులను అధిగమించడం తనకు బాగా పని చేస్తుందని హర్షవంతి నమ్ముతుంది. 67 ఏండ్ల ఆమె ఇలా అంటున్నారు ''కొందరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవితంలో ఎలాంటి సవాలునైనా అధిగమించగలరని భావిస్తారు''. బహిష్టు సమయంలో అమ్మాయిలకు పర్వతారోహణ ఎలా పని చేస్తుందనే దానిపై హర్షవంతి ఇలా అంటున్నారు ''మనం ఏదైనా రంగంలో ఏదైనా చేస్తున్నప్పుడు ఇవి మన జీవితంలో చిన్న అడ్డంకులను సృష్టిస్తాయి. మరుగుదొడ్లు పురుషులకు కూడా అవరోధంగా ఉండవచ్చు. అయితే పర్వతారోహణ చేయాలని నిశ్చయించుకున్న వారు దానిని నిర్వహిస్తారు. క్రమపద్ధతిలో ప్లాన్ చేస్తారు''.
గంగోత్రి ప్రాజెక్ట్‌ను సేవ్ చేయండి
1984లో హర్షవంతి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లారు. అయితే ఆమె దానిని విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. ఆ సమయంలో ఆమె పర్వతారోహణను విడిచిపెట్టి విద్యావేత్తల వైపు తన దృష్టిని మరలించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఎవరెస్ట్ సందర్శన సమయంలో సోలు-ఖుంబు ప్రాంతంలో సర్ ఎడ్మండ్ హిల్లరీ పనిని గమనించడానికి ఆమెకు అవకాశం లభించింది. అక్కడ అతను పాఠశాలలను ప్రారంభించాడు. ఆసుపత్రులను నిర్మించాడు. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేశాడు. సర్ ఎడ్మండ్ ఒక న్యూజిలాండ్ పర్వతారోహకుడు. అతను టెన్జింగ్ నార్గేతో కలిసి 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అధిరోహకుడు.
పర్యావరణ పరిరక్షణ కోసం...
''ఇది నా ప్రాంతంలో ఏదైనా చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చింది. పాఠశాలలు, వైద్య సదుపాయాల కోసం నా దగ్గర లేని చాలా నిధులు అవసరమని నేను గ్రహించాను. నేను గంగోత్రి-గౌముఖ్ ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణ తీసుకున్న ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పని చేయడం నాకు సరైనదనిపించింది. అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున బిర్చ్ చెట్లు, జునిపెర్ పొదలు, అటవీ నిర్మూలన చూశాను. పర్యాటకుల ప్రవాహం కారణంగా అడవులు నాశనమవుతున్నాయి. ఇది స్థానికులకు, జీవావరణ శాస్త్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది'' అని హర్షవంతి చెప్పారు.
పర్యావరణపరంగా నష్టపోతున్నాం
ఆమె 1989లో ఈ ప్రాంతంలో పరిశోధనా పనిని ప్రారంభించారు. 1992లో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు పర్యావరణ సమస్యలపై ఒక అధ్యయనాన్ని సమర్పించారు. ''ఈ ప్రాంతంలో తీర్థయాత్రలు, పర్యాటక ప్రభావంపై అధ్యయనం కేంద్రీకృతమై ఉంది. ఆర్థికంగా మనం లాభపడుతున్నాం కానీ పర్యావరణపరంగా నష్టపోతున్నాం అనే వాస్తవంతో నా అధ్యయనాన్ని ముగించాను. ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం నేను ఏదైనా చేయాలని భావించాను'' అని చెప్పారు.
మొక్కలు పెంచుతూ...
హర్షవంతి భోజ్‌పాత్ర ప్లాంటేషన్‌లో పని చేయడం ప్రారంభించారు. ''నేను 11,700 అడుగుల ఎత్తులో ఉన్న చిర్బాసా వద్ద భోజ్‌పాత్ర మొక్కల నర్సరీని పెంచాను. ఇది 11,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గంగోత్రి నుండి గౌముఖ్‌కు వెళ్లే మార్గంలో 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో బిర్చ్ చెట్లు, జునిపెర్‌తో సహా దేశీయ చెట్ల మొక్కలు ఉన్నాయి'' అంటున్నారు. 1996లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో భోజబాసకు సమీపంలోని 2.5 హెక్టార్ల భూమిలో ప్లాంటేషన్ పనులు చేసేందుకు అటవీశాఖ అనుమతి తీసుకుంది.
సంతోషకరమైన అనుభూతి
''నేను ఆ ప్రాంతంలో దాదాపు 2,500 మొక్కలు నాటాను. దాదాపు 60-70 శాతం మొక్కలు విజయవంతంగా బతికాయని తెలుసుకోవడం చాలా సంతోషకరమైన అనుభూతిని కలిగించింది'' అంటున్నారు ఆమె. ఆ తర్వాత ఆమె మరో ప్లాంటేషన్ ప్రాజెక్ట్‌ను నిర్వహించారు. ఈసారి 5.5 హెక్టార్లలో దాదాపు 10,000 దేశీయ చెట్లతో సమానమైన మనుగడ విజయవంతమైన రేటుతో ఉంది. ''ఈ రోజు నా చెట్లు నా కంటే పొడవుగా ఉన్నాయి. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది'' అని హర్షవంతి చెప్పారు.
- సలీమ