Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణెలో బాలికల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే స్థాపించిన ఓ పాఠశాల బయట ఓ బోర్డు కనిపిస్తుంది. దీనిపైనా ఫాతిమా షేక్ పేరు వుంటుంది. చిందరవందరగా కనిపించే అక్కడి పాఠశాల గోడలను తీక్షణంగా పరిశీలిస్తే.. బాలికలతోపాటు ఇద్దరు మహిళలు కనిపిస్తారు. వారే సావిత్రీ బాయి, ఫాతిమా షేక్. దాదాపు 175 ఏండ్ల కిందట అదే ప్రాంతంలో ఓ విప్లవాత్మక మార్పుకు నాందిపలికిన వీర వనితలు వీరు. ఇవే గదుల్లో వారిద్దరూ కలిసి బాలికలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.
కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఫాతిమా జనవరి 9, 1831లో జన్మించినట్టు తెలుస్తుంది. ఈమె ఉస్మాన్ షేక్ చెల్లెలు. బ్రిటిష్ కాలంలో పుణెలో ఆమె సేవలందించినట్టు ఆధారాలున్నాయి. బాలికలకు విద్య నేర్పే సందర్భంలో సావిత్రి బాయికి ఎన్నో అవరోధాలు ఎదురైనట్టు చరిత్ర చెబుతోంది. దీనికి కారణం వారు దళితులు, అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడమే. ఈ అవరోధాలు, అడ్డంకులను ఫాతిమా షేక్ కూడా కచ్చితంగా ఎదుర్కొని ఉంటారు. ఫాతిమా ఎప్పుడూ సావిత్రిబాయి పక్కనే ఉండేవారంట. జ్యోతిరావు, సావిత్రి బాయి చేస్తున్న సామాజిక కార్యక్రమాలు నచ్చక జ్యోతిరావు తండ్రి వీరిద్దరిని ఇంటి నుండి పంపించేస్తారు. ఆ సమయంలో ఫాతిమానే తన ఇంట్లో వీరికి ఆశ్రయం ఇస్తుంది. ఆ ఇల్లు తర్వాతి కాలంలో దేశంలో మొదటి బాలికల పాఠశాలగా అవతరించింది. దాన్ని అప్పట్లో 'స్వదేశీ గ్రంథాలయం' అని పిలిచే వారంట. సావిత్రిబాయి, ఫాతిమా కలిసి అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ జంటతో కలిసి ఈమె కూడా అణగారిన వర్గాలకు ముఖ్యంగా అమ్మాయిలకు విద్యను అందించడంలో విశేష కృషి చేశారు. ఫూలే స్థాపించిన ఐదు పాఠశాలల్లో ఫాతిమా విద్యను బోధించడానికి వెళ్ళేవారంట.
ముస్లిం కుటుంబాల వద్దకు
వాస్తవానికి ఆమె అప్పట్లో చేసిన ఈ కృషి కారణంగా సావిత్రిబాయి కంటే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆమె ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. సాధారణ మహిళలే పరదాలు దాటి బయటకు రాలేని ఆ కాలంలో ఇక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఓ మహిళ అడుగు బయట పెట్టి అమ్మాయిలకు విద్యను అందించడమంటే మామూలు విశేషం కాదు. సావిత్రిబాయి ఏవిధంగా అయితే పేడ, రాళ్ళు భరించిందో అలాగే ఫాతిమా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. సావిత్రిబాయి లాగే ఫాతిమా కూడా ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా ముస్లిం కుటుంబాల వద్దకు వెళ్ళి తమ ఆడపిల్లలను పాఠశాలకు పంపించమని అడిగేవారు. పిల్లలను బడికి పంపించడం ఇష్టం లేని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఎన్నో గంటలు వారితో గడిపేవారని సావిత్రిబాయి రాసుకున్న లేఖల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అణగారిన వర్గాల కోసం
సావిత్రి బాయి, ఫాతిమాల మధ్య సన్నిహిత సంబంధాలకు సావిత్రిబాయి రాసిన లేఖలే ఆధారాలు. సావిత్రి బాయి ఓసారి తన పుట్టింటికి వెళ్లారు. అక్కడ ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె తిరిగి పుణెకు తిరిగివచ్చే పరిస్థితిలో లేరు. అప్పటికే పూణెలో అణగారిన వర్గాలు, మహిళల కోసం చాలా పాఠశాలలు నడుస్తుండేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. సామాజిక సేవ చేసేవారు చాలా తక్కువగా ఉండేవారు. ఈ పాఠశాలల గురించి ఆందోళన చెందుతూ సావిత్రి బాయి 10, అక్టోబర్ 1856లో ఓ లేఖ రాశారు. ''నా గురించి బాధ పడకండి. ఫాతిమాకు కూడా చాలా కష్టంగా ఉండే ఉంటుంది. కానీ ఆమె మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎలాంటి ఫిర్యాదులూ చేయదు'' అని సావిత్రి బాయి వివరించారు.
ఆమె కృషికి నిదరర్శనం
ఫాతిమా ఏ విషయంలో ఇబ్బంది పడతారు? ఎందుకు ఆమె జ్యోతిబాను ఇబ్బంది పెట్టరు? ఇది పాఠశాలకు సంబంధించిన విషయమే. ఫాతిమా కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు. అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతి కోసం ఆమె సావిత్రితో కలిసి పనిచేశారని చెప్పడానికి ఇంతకంటే మరో ఆధారం అవసరం లేదు. బాధ్యతలను పంచుకోవడంలోనూ వీరిద్దరూ సమానమే. వారిద్దరూ కలిసే పనిచేసినా వారి వ్యక్తిత్వాలు భిన్నమైనవి. అందుకే ఆమె పాఠశాలను సొంతంగా నడిపించగలిగారు. ఈ లేఖ ఫాతిమా కృషికి అతిపెద్ద నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ లేఖ ఫాతిమా జీవితానికి, ఆమె ఆలోచనా శక్తికి అద్దం పడుతోంది. ఫాతిమా ఎవరి ప్రభావానికీ లోనుకారు. ఆమెకు ప్రత్యేకమైన వ్యక్తిత్వముంది. అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి పోరాడేవారిలో ఆమె ముందువరుసలో ఉంటారు. కాబట్టే భాతరదేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారు. నేటి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు
ఈరోజు ఫాతిమాషేక్ జయంతి