Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పై చదువుల కోసమో... ఉద్యోగం కోసమో... విదేశాలకు వెళ్ళడం సహజమే. అలా వెళ్ళిన వారిలో తమ జీవితమేదో తాము చూసుకోకుండా నలుగురి కోసం ఏదైనా చేయాలని భావించేవారు కొందరుంటారు. అలాంటి వారిలో ప్రియదర్శిని తీగుల్ల కూడా ఒకరు. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఆమె తెలంగాణ అసోసియేషన్ ఇన్ ఫ్రాన్స్‌తో కలిసి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. చదువు కోసం అక్కడికి వెళ్ళే తెలుగు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా అసోసియేషన్ తరఫున వారు చేస్తున్న కార్యక్రమాల గురించిన వివరాలు మానవి పాఠకుల కోసం...
ప్రియదర్శిని పుట్టింది మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట. తల్లి ధనలక్ష్మి, గృహిణి. తండ్రి జనార్థన్, కాలేజీ లెక్చరర్. ఈయన ఉద్యోగ రీత్యా, పిల్లల చదువుల కోసం వీరి కుటుంబం తర్వాత కాలంలో మరిపెడ గ్రామానికి వెళ్ళిందే అక్కడే ప్రియ పదవ తరగతి వరకు చదువుకున్నారు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న ఈమె ఇంటర్ ఇంగ్లీష్ మీడియం చదవాల్సి వచ్చింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డారు. చివరకు ఇంటర్ 90శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
పెండ్లి తర్వాత ప్యారిస్
ఇంటర్ తర్వాత వరంగల్‌లో బి.ఫార్మసి, సంగారెడ్డిలో ఎం.పార్మసి పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత తనలోని నైపుణ్యం పెంచుకునేందుకు కొంత కాలం వరంగల్ కాలేజీలోనే ఫ్యాకల్టీగా పని చేశారు. కొంత అవగాహన పెరిగిన తర్వాత హెట్రో ఫార్మా కంపెనీలో రెండేండ్ల పాటు ఉద్యోగం చేశారు. 2015లో సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెండ్లి తర్వాత ఈ జంట కొంత కాలం చెన్నైలో ఉన్నారు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ఇద్దరూ ఫ్రాన్స్ వెళ్ళాల్సి వచ్చింది.
ఫ్రెంచ్ నేర్చుకుంటేనే
చదువుకోసంగానీ, ఉద్యోగం కోసం గానీ అక్కడికి వెళ్ళే వారు ఆ భాషను సంబంధించిన కోర్సును తప్పకుండా చేసి తీరాలి. అలా భర్తతో పాటు ప్యారిస్ వెళ్ళాల్సిన ప్రియ విద్యార్థిగా అక్కడ అడుగుపెట్టారు. వెళ్ళే ముందు హైదరాబాద్‌లో ఫ్రెంచ్ భాషలో ఇంటర్ లెవల్ వరకు నేర్చుకున్నారు. అక్కడకు వెళ్ళిన తర్వాత వ్యాక్సినాలజీ అనే కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేస్తున్నారు. భర్త శ్రీనివాస్ ఆటోమోటివ్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు.
తెలంగాణ అసోసియేషన్ ఇన్ ఫ్రాన్స్‌తో...
ఉద్యోగం చేసుకుంటూనే అక్కడ ఉన్న తెలుగు వారితో ప్రియ పరిచయాలు పెంచుకున్నారు. అప్పటికే అక్కడి తెలుగువారి కోసం పని చేస్తున్న తెలంగాణ అసోసియేషన్ ఇన్ ఫ్రాన్స్ అనే సంఘంలో సభ్యురాలిగా మారారు. ఈ సంస్థలో ఆమె కల్చరల్ అసోసియేట్ బాధ్యతలు చూస్తున్నారు. మన పండుగులు, సంప్రదాయాలను అక్కడ ఉన్న మన తెలుగు వారు మర్చిపోకుండా జరుగుతుంటారు. అలాగే ఈసంస్థ చేస్తున్న ముఖ్యమైన పని అక్కడికి వెళ్ళే మన విద్యార్థులకు అక్కడి సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం. మన దగ్గర ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు నమస్కారం ఎలా చెప్పుకుంటాము ఫ్రాన్స్‌లో కూడా ఒకరికి ఒకరు ఎదురు పడ్డప్పుడు బొంజార్ అని పలకరించుకుంటారు. దాని మళ్ళీ తిరిగి మనం బొంజార్ అని తిరిగి నమస్కారం చేయాలి. ఇలాంటి వాటికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ఫ్రాన్స్‌లో ఇంగ్లీషు మాట్లాడేవారు చాలా తక్కువగా ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళేంటే కచ్చితంగా ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలి.
అవగాహన కల్పిస్తున్నాము
ఎక్కువ మంది మన తెలుగు వారు ఇక్కడికి చదువు కోసమే వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో రాయితీలు ఇస్తుంది. ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా చదువుకునేందుకు రుణాలు కూడా ఇక్కడ ఇస్తారు. అయితే చాలా మందికి వాటిపై అవగాహన ఉండదు. ఒకవేళ తెలిసినా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటి వారికి మా అసోసియేషన్ ద్వారా అవగాహన కల్పిస్తాము. అలాగే వచ్చిన వెంటనే ఎక్కడ ఉండాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి వసతి కల్పించడంతో పాటు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు కావల్సిన ఏర్పాట్లు చేయడం వంటివి మా అసోసియేషన్ ద్వారా చేస్తుంటాము. విద్యార్థులు ఏమైన అవసరం ఉంటే ్‌వశ్రీaఅస్త్రaఅaaరరశీషఱa్ఱశీఅఱఅటతీaఅషవఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కి తమ సందేహాలను పెట్టవచ్చు. ఇంకా బతుకమ్మ, దసరా, సంక్రాంతి, ఉగాది వంటి మన తెలుగు పండుగులను కూడా ఘనంగా జరుపుకుంటాము.
చదువుంటే గౌరవంగా బతకొచ్చు
ప్రస్తుతం నేను ఒక స్టూడెంట్ను దత్తత తీసుకొని చదివిస్తున్నాను. భవిష్యత్‌లో చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పని చేయాలనుకుంటున్నారు. ఇప్పటికీ చాలా చేయాలనుకున్నాను. కానీ కోవిడ్ వల్ల వాయిదా పడింది. కనీసం 50 మంది పేద, అనాథ పిల్లలకు చదువు అందించాలి. సమాజంలో గౌరవంగా బతకాలంటే చదువు చాలా ముఖ్యమైనది. అందుకే ఆ పిల్లలకు చదువు అందించగలిగితే వారి కాళ్ళపై వాళ్ళు బతకగలుగుతారు. అందుకే చదువు చెప్పించాలనుకుంటున్నాను. మావారు కూడా నేను చేసే ప్రతి కార్యక్రమానికి ఎంతో సహకరిస్తుంటారు. నేను ఫ్రెంచ్ నేర్చుకోవడానికి, ప్యారిస్ వెళ్ళాక కోర్సు చేయడానికి, అసోసియేషన్ తో కలిసి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన ఎంతో ప్రోత్సహించారు. అలాగే కరోనా సమయంలో ఇండియాలో ఉన్న కొంతమందికి కూడా సహాయం చేశాము.
మేమున్నామంటూ...
కరోనా సమయంలో చాలా మంది పిల్లలు మానసికంగా కుంగిపోయారు. అప్పుడే కొత్తగా వచ్చిన వారైతే తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఒకవైపు కరోనా మరోవైపు దాంతో చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి వారికి మేమున్నామని ధైర్యం చెప్పాము. వారిలో మానసిక థైర్యం పెంచేందుకు నిత్యం వారితో కలిసి మాట్లాడుతుంటేవాళ్ళం. అవసరమైన విద్యార్థులకు నిత్యావసర సరుకులు కూడా అందించాము. ఇది మా మనసకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనవారికి తోడుగా నిలబడ్డాం అనే తృప్తిని ఇచ్చింది. అలాగే గత సంవత్సరం ఒక విద్యార్థి అనారోగ్యంతో చనిపోయాడు. కోవిడ్ నిబంధనల వల్ల బాడీని ఇండియాకు పంపడం చాలా కష్టంగా మారింది. అయితే అసోసియేషన్ తరపున చాలా ప్రయత్నం చేసి చివరకు బాడీని చివరకు అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగాము. ఇది కూడా మాకు తృప్తినిచ్చింది. ఓ తల్లి తన కొడుకును చివరి చూపు చూసుకునేలా చేయగలిగాం.
- సలీమ