Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శుభి జైన్... 24 ఏండ్ల ఈ యువతి ఉదయం ఆర్.జె.గా... పగలంతా వ్యాపారవేత్తగా సాయంత్రం అయితే చాలు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారిపోతుంది. ఇండోర్ నగరంలో వినూత్నంగా ట్రాఫిక్‌ను నిర్వహిస్తుంది. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దాంతో ఇప్పుడు అక్కడ చర్చంతా ఈమె గురించే... ఈ చర్చల్లో మనమూ భాగస్వాములమవుదాం...
మన దగ్గర మహిళలు ట్రాఫిక్‌ను నిర్వహించడం అనేది ఇప్పటికీ చాలా అరుదైన విషయం. అయితే ఇండోర్‌కి చెందిన శుభి జైన్ ఈ ఆలోచనను మార్చాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె ఇండోర్‌లో ట్రాఫిక్ వాలంటీర్ మాత్రమే కాదు ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రత్యేకమైన వినూత్న మార్గాలను కూడా ఉపయోగిస్తుంది.
చిరునవ్వు అంటువ్యాధి
''నేను ట్రాఫిక్ వాలంటీర్‌గా చేరిన కొత్తలో ప్రజలను ఆపి, నిబంధనలను పాటించమని చెప్పినప్పుడు వారు చిరాకుగా కనిపించడం నేను గమనించాను. కాబట్టి నేను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వారు నాపై చెడు అభిప్రాయం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను నిబంధనలను అనుసరిస్తున్న వ్యక్తులకు చిరునవ్వుతో ధన్యవాదాలు తెలుపుతూ నా పనిని చేస్తున్నాను. తమ సొంత భద్రత కోసం చేస్తున్న పనులకు ఎవరైనా వారికి కృతజ్ఞతలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మనం నవ్వుతూ పలకరించినప్పుడు వారు కచ్చితంగా నవ్వి తీరాలి. ఎందుకంటే చిరునవ్వు అంటువ్యాధి'' అని శుభి అంటుంది.
వాలంటీర్‌గా మారడం
2019లో పూణేలోని సింబయాసిస్‌లో ఎంబిఏ గ్రాడ్యుయేట్ చేసే సమయంలో శుభి తన కళాశాలలో 20 రోజుల సోషల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండోర్ ట్రాఫిక్ పోలీసులతో వాలంటీరింగ్ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో ఇండోర్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు, నిర్వహణ అవగాహన కోసం కళాశాల విద్యార్థులతో వాలంటీరింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఆమె 1,800 మంది విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బృందంలో చేరింది.
వీలైనంత వరకు చేస్తాను
ఇంటర్న్‌షిప్ వ్యవధి ముగిసిన తర్వాత కూడా శుభి తన వాలంటీరింగ్ డ్యూటీకి కట్టుబడి ఉంది. ట్రాఫిక్ వాలంటీర్ జాకెట్‌ను ధరించి 24 ఏండ్ల ఆమె ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ సిగల్ వద్ద ఉన్నప్పుడు ఆమె డ్యాన్స్ చేసేది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ''నేను ఒక ప్రయోజనం కోసం దానిలో చేరాను. సామాజిక కారణం రీత్యా నేను రహదారి భద్రతతో ప్రేమలో పడ్డాను. దీని వల్ల నాకు ఎలాంటి ఆదాయం లేదు. కానీ నేను ఇప్పటికీ స్వచ్ఛంద సేవను కొనసాగిస్తున్నాను. నాకు వీలైనంత కాలం నేను వాలంటీరింగ్ ఉంటాను'' ఆమె చెబుతుంది.
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత
ఒక నెల వాలంటీరింగ్ తర్వాత ఆమె తన చదువును పూర్తి చేయడానికి పూణేకు తిరిగి వెళ్ళింది. అయితే కరోనా వల్ల లాక్‌డౌన్ విధించబడింది. దాంతో ఆమె మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా, బినాలోని తన సొంత స్వగ్రామానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత డిసెంబర్ 2020లో ఇండోర్‌కి తిరిగి వచ్చింది. అప్పటి నుండి ట్రాఫిక్ వాలంటీర్‌గా ఉంది. అలాగే ఆమె ఆరు నెలల పాటు విజరు నగర్ స్క్వేర్‌లో స్వయంసేవకురాలిగా కూడా పని చేసింది. ప్రస్తుతం ఇండోర్‌లోని ఇంద్రప్రస్థ స్క్వేర్‌లో పోలీసింగ్ ట్రాఫిక్‌గా కనిపిస్తుంది.
పని పట్ల చాలా గౌరవం
''నేను వాలంటీర్‌ని అయినప్పటికీ నా శక్తి ఒక పోలీసు కంటే తక్కువ కాదు. నేను ఇప్పటికీ స్పష్టంగా వారితో పోల్చుకోలేను. ఎందుకంటే వారు 12 గంటల పాటు తమ విధిని నిర్వహిస్తారు. నేను కేవలం రెండున్నర గంటలు మాత్రమే చేస్తాను. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 వరకు. పోలీసులు కష్టమైన ఈ పనిని నిర్వహించడం పట్ల నాకు చాలా గౌరవం ఉంది'' అంటూ ఆమె పంచుకున్నారు.
సమస్యలేమీ లేవు
ప్రస్తుతం బహిరంగ ప్రదేశాలు మహిళలకు సురక్షితం కావు. అయితే తను అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడం లేదని శుభి చెప్పారు. ''డిపార్ట్‌మెంట్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నా గురించి తెలిసిన సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వారు నాపై నిఘా ఉంచారు. అలాగే కంట్రోల్ రూమ్‌ల నుండి రోడ్లను చూస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు, కాబట్టి నాకు భద్రత సమస్య కాదు'' అని శుభి చెప్పారు.
ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది
ఈ పని శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్నదని ఆమె అంటున్నారు. ''ఒక్కరే అనేక పనులు చేయాల్సి వస్తుంది. పరుగెత్తాలి, మాట్లాడాలి, ఈల వేయాలి. ఈల వేయడం నిరంతరం చేయవలసి వచ్చినప్పుడు దానికి చాలా శక్తి అవసరం. స్క్వేర్‌లు అన్నీ దాదాపు కాలుష్యంతో కూడుకొని ఉంటాయి. కాబట్టి అది మరొక సవాలు. నేను సాయంత్రం చేస్తాను కాబట్టి నాకు ఎండ వల్ల ఇబ్బంది లేదు. కానీ వేసవి వాతావరణంలో ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది'' అని ఆమె అంటున్నారు. శుభి తన పాఠశాల, కళాశాల జీవితంలో జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌గా ఉంది. వాలీబాల్, ఖో-ఖో ఆడుతూ తన జీవితమంతా అథ్లెట్‌గా ఉంది. కాబట్టి ట్రాఫిక్ వాలంటీర్‌గా పని చేయడానికి తనకు ఎల్లప్పుడూ శక్తి ఉంటుందని ఆమె నమ్ముతుంది.
మొక్కలపై ప్రేమతో...
ట్రాఫిక్ వాలంటీర్‌గానే కాకుండా జనవరి 2021లో ఆమె ఇంటిలో గార్డెనర్‌ని బుక్ చేసుకోగలిగే అన్ని గార్డెనింగ్ అవసరాల కోసం వన్-స్టాప్ షాప్ అయిన తన స్టార్టప్ మాటివాలాను ప్రారంభించింది. ''నాకు మొక్కలు, ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. అందుకే దీనికి సంబంధించిన ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాను. నేను దీనిని ఇండోర్‌లో సెటప్ చేసాను. ఇది ఇప్పటివరకు బాగా నడుస్తుంది. మా వెబ్‌సైట్ నుండి అన్ని గార్డెనింగ్ సేవలు, ఉత్పత్తులను సులభంగా పొందవచ్చు'' అని శుభి చెప్పారు.
రేడియో జాకీగా...
ప్రస్తుతం ఆమె బృందంలో ఐదుగురు తోటమాలీలు ఉన్నారు. ఆమె తన పట్టణం నుండి వారిని పిలిపించుకుంది. ''వారు ఇప్పుడు వారి కుటుంబంతో పాటు నగరంలో నివసిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ పని వారి జీవన ప్రమాణాన్ని పెంచడంలో సహాయపడింది'' అంటున్నారు శుభి. సాయంత్రం ట్రాఫిక్ వాలంటీర్, పగటిపూట ఒక వ్యాపారవేత్తగా ఉన్న శుభి ఉదయం రేడియో మిర్చితో రేడియో జాకీగా ప్రారంభమవుతుంది. ఆమె రేడియో మిర్చిలో చేరి మూడు నెలలైంది. ఇప్పుడు ఆమె సొంతంగా హారు ఇండోర్ రేడియో షోను నడిపిస్తుంది.
- సలీమ