Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి వయసు పెంచితే సాధికారత వస్తుందా... పేదరికాన్ని రూపుమాపకుండా ఉన్నత చదువులు చదువుతారా? పౌష్టికాహారం అందించకుండా మాతా శిశు మరణాలు తగ్గుతాయా..? అసమానతలు తొలగించకుండా సమానత్వం వస్తుందా..? ఇప్పటికే ఎన్నో రకాల అసమానతలతో పోరాడుతున్న మహిళలకు పురుషాధిక్య సమాజంలో ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా..? ఒక్క పెండ్లి వయసు పెంచేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయంటున్నారు... వింటుంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉందంటున్నారు మహిళా సంఘాల నాయకులు...
''ఇది నా మేనకోడలు... తల్లీతండ్రీ లేరు. నా దగ్గరే పెరుగుతుంది. నా కొడుక్కి ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటున్నా. ఇంట్లో ఉంచితే పిల్లకు రక్షణ లేదు. ఒంటరిగా వదిలే వెళ్ళే ధైర్యం లేదు. అందుకే పెండ్లి చేసేంత వరకు నాతోపాటు పనిలోకి తీసుకుపోతున్నా'' భవననిర్మాణ రంగంలో పని చేస్తున్న ఓ మేనత్త ఆవేదన.
''21 ఏండ్లు వచ్చే వరకు బిడ్డకు ఇంట్లోనే ఎలా వుంచుకోవాలి. పై చదువులు చదివించే స్థోమత మాకు ఎలాగో లేదు. ఇంటర్ తర్వాత పెండ్లి చేద్దామనుకుంటున్నాం'' ఇది మరో తల్లి ఆలోచన.
లక్ష్మి పదో తరగతి పూర్తి చేసి పాల్టెక్నిక్లో చేరేందుకు పరీక్షలు రాసింది. కానీ ఇంట్లో పెండ్లి చేయాలనుకుంటున్నారు. తల్లిదండ్రులతో పోరాడింది. చివరకు చదువుకోవడానికి ఒప్పించింది. కానీ కాలేజీలో చేరేందుకు ఇంట్లో వాళ్ళకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు లక్ష్మి ఏం చేయాలి? ఫీజు కట్టలేక పెండ్లి చేసుకోవల్సిందేనా..?
ఇలా ఎంతో మంది ఆడపిల్లలు ఆర్థిక ఇబ్బందులతో నచ్చిన చదువు చదవలేక మధ్యలోనే చవుదు ఆపేస్తున్నారు. రోజురోజుకు అమ్మాయిలపై పెరుగుతున్న దాడులు భరించలేక గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం మంది అమ్మాయిలకు తొందరగా పెండ్లి చేయాలనుకుంటున్నారు. ఆడపిల్లలకు ఉచిత ఉన్నత విద్య అందించకుండా పెండ్లి వయసు పెంచితే వాళ్ళు ఎలా చదువుకోగలుగుతారు. పేదరికం వల్ల కడుపు నిండా తిండి లేక మన దేశంలో 80శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చిన్నతనం నుండి పౌష్టికాహరం లేకుండా పెండ్లి వయసు పెంచినంత మాత్రానా బలమైన పిల్లలు ఎలా పుడతారు. మాతా శిశు మరణాలు ఎలా తగ్గుతాయి.
ఆర్థిక స్థోమత లేకనే...
పెండ్లికి 18 ఏండ్లు వయసు ఉంటేనే 60 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీటిని ఆపడం ప్రభుత్వాలకు చేతకావడం లేదు. తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఆర్థిక స్థోమత లేక, రక్షణ కల్పించలేకనే తమ ఆడ పిల్లలకు తొందరగా పెండ్లి చేయాలనుకుంటున్నారు. ఒక పక్క మహిళలు కరోనాతో ఉద్యోగాలు పోయి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా కాలంలో డిజిటిల్ విద్య విధానం వల్ల స్మార్ట్ ఫోన్ లేక ఎంతో మంది అమ్మాయిల చదువులు ఆగిపోయాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా పెండ్లి వయసు పెంచినంత మాత్రానా సాధికారత వస్తుంది అని చెప్పడంలో అర్థం లేదని అభ్యుదయ మహిళా సంఘాలు, కార్యకర్తలు అంటున్నారు.
ఉన్న సమస్యలు పరిష్కరించండి
ఆడపిల్లలకు చిన్న వయసులో పెండ్లి చేయవద్దు. వారిని చదువుకోనీయండి. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళను నిలబడనీయండి. అప్పుడు వారి జీవితం సంతోషంగా ఉంటుందంటూ గ్రామ గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రులను చైతన్య పరిచే సంఘం మా ఐద్వా. అలాంటి మేము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెండ్లి వయసు పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దీని వల్ల ఆడపిల్లలకు ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం పేదరికం వల్ల చాలా మంది తమ ఆడపిల్లలను చదివించలేకపోతున్నారు. తిండి పెట్టలేకపోతున్నారు. పేదరికాన్ని నిర్మూలించకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, పౌష్టికాహారం అందించకుండా కేవలం వయసు పెంచితే సరిపోతుందా? కేవలం తమ లోపాలను కప్పిపుచ్చుకొని మేమేదో ఆడపిల్లలను ఉద్ధరిస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడానికే మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిజంగా అమ్మాయిలపై ప్రేమ ఉంటే ఉచిత విద్య అందించండి. ఉపాధి అవకాశాలు కల్పించండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ వివాహాలు చేసుకుంటుంటే కులం పేరుతో హత్యలు చేస్తున్నారు. అలాంటి కులదురహంకార హత్యలకు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురండి. గృహహింస చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి. వయసు పెంపు వెనుక ఉన్న అసలు ఆంతర్యాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.
- మరియం ధావలే, ఐద్వా ఆలిండియా కార్యదర్శి
మనుధర్మశాస్త్రాన్ని ముందుకు తెచ్చేందుకే
మహిళల సమస్యలన్నీ పక్కనపెట్టి పెండ్లి వయసు పెంచితే సరిపోతుందా. ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటానికి ఈ నిర్ణయాన్ని చేసింది. దీని వల్ల అమ్మాయిలకు ఎలాంటి ఉపయోగం లేదు. యువత తమ ఇష్ట ప్రకారం చేసుకుంటున్న కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాలను నియంత్రించడానికే ఈ నిర్ణయం. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే ఇది. అమ్మాయిల స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదు. అట్టడుగు వర్గాల ప్రజల ఇండ్లలో సమస్యలను మరింత పెరుగుతాయి. దీని వెనుక ఉన్న అసలు కుట్రను ప్రజలకు అర్థం చేయించాలి. ముఖ్యంగా దీని వెనకున్న అసలు నిజాలను తెలుసుకోలేక యువత, మధ్యతరగతి ప్రజలు భ్రమల్లో ఉన్నారు. కాలేజీల్లో వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. వాస్తవాలను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి.
- హిమబిందు, కన్వీనర్, టీపీఎస్కే
అమ్మాయిల గొంతు కోయడానికే
వివాహ వయసు పెంచితే అమ్మాయిలు ఎలాంటి అడ్డంకి లేకుండా చదువుకుంటారని అంటున్నారు. విద్యా అవకాలు పెంచకుండా అసలు ఎలా చదువుకుంటారు. చదువుకునే అవకాశాలు లేకపోవడం వల్లే ఆడపిల్లలకు తల్లిదండ్రులు పెండ్లి చేస్తున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ అమ్మాయిల కోసం ఇప్పటి వరకు ఒక్క కాలేజీ పెట్టలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు ఆడపిల్లల పీకలు కొయ్యడానికే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చేసింది. పేద కుటుంబాల్లో చిన్న వయసులో జరిగే పెండిండ్లను ఎలా ఆపుతారు. వయసు పెంచడం వల్ల ఇప్పుడు ఆ పిల్లకు ఎలాంటి హక్కులు లేకుండా పోతాయి. గృహహింసకు గురైతే కోర్టుకు వెళ్ళలేరు. వారి సమస్యలు పరిష్కరించానికి కౌన్సిలింగ్ సెంటర్లు సరిపోవు. బేటి పఢావో - బేటి బచావో అని గొప్పగా చెబుతున్నారు. దీనికి కోసం కేటాయించిన వంద కోట్లలో కనీసం 20 కోట్లు కూడా సరిగా ఖర్చుచేయలేదు. కరోనా కాలంలో బాల్య వివాహాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉన్న సమస్యలు పరిష్కరించకుండా అవసరంలేని బిల్లులు తీసుకొచ్చి అమ్మాయిల గొంతు కోస్తున్నారు.
- దేవి, సామాజిక కార్యకర్త
- సలీమ