Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరి ఇండ్లల్లో సందడిగా ఉంటుంది. తెలుగు లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో మురిసిపోతుంటాయి. పిండివంటలతో ఘుమఘుమలాడతాయి. కొత్త పంట ఇంటికి రావడమే దీనికి కారణం. ఇక అందరి ఇళ్లల్లో పిండి వంటలు గుమగుమలాడి పోతాయి. సంక్రాంతి వంటకాల్లో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. వీటితో ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి వంటకాల్లో కొన్నింటిని ఈ రోజు నేర్చుకుందాం...
వరిపిండి చెక్కలు
కావలసిన పదార్ధాలు: బియ్యంపిండి - ఒక గ్లాసు, ఉప్పు - 1 / 2 చెంచా, శెనగ పప్పు - రెండు చెంచాలు, నువ్వులు - చెంచా, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - 8 లేదా 10 రెమ్మలు, అల్లం - అంగుళం ముక్క, బటర్ - రెండు చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేయు విధానం: పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర కచ్చగా దంచుకోవాలి. నీళ్లు సుమారు అర గ్లాసు తీసుకుని దళసరి గిన్నెలో వేడిచేసి అందులో బటర్ (లేదా) నూనె, ఉప్పు వేసి మరిగే నీటిలో శెనగసపప్పు, నువ్వులు వేసి దంచి ఉంచుకున్న పచ్చి మసాలా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి వరిపిండి కొద్దిగా వేస్తు నీళ్ళలో ఉండలు లేకుండా కలుపుకుని మూతపెట్టి ప్రక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఈ వరిపిండి ముద్దను నూనె చేతితో బాగా కలుపుకుని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కవరు మీద పలుచని పూరీల్లా వత్తుకుని నూనెలో వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చేలా కరకర లాడేలా వేయించుకుని టీష్యూ పేపరు పైకి తీసుకోవాలి. ఈ చెక్కలను పూరీ మిషన్‌తో కూడా వత్తుకోవచ్చు. రెండు వారాలపైగా నిలువ వుండే ఈ చెక్కలు చాలా రుచిగా ఉంటాయి.
అరిసెలు
కావలసిన పదార్థాలు: బియ్యం: ఒక కేజీ, బెల్లం తరుము: అర కేజీ, నువ్వులు - 100 గ్రాములు, నీరు: తగినంత, యాలకులు: 2 - 4 (మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి - అర కప్పు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేయు విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టౌ మీద పెద్ద మందపాటి గిన్నె పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి. ఇలా పిండి పాకం తయారు చేసుకొన్న తర్వాత స్టౌపై ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్ కవర్ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. బంగారు రంగు రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి.
సకినాలు
కావాల్సిన పదార్ధాలు: నూనె - తగినంత, నువ్వులు - టీ స్పూను, వాము - టీస్పూను, కారం - అరటీస్పూను, ఉప్పు - తగినంత, బియ్యం పిండి - కప్పు.
తయారు చేయు విధానం: బియ్యం రెండు గంటలు నీటిలో నానబెట్టి నీళ్ళు వంచి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి. బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు వేసి కలిపి నీళ్ళు పోసి జిగురుగా కలపాలి. దీనిని చేతితో ఒక క్లాత్ మీద సకినాలుగా గుండ్రంగా వెయ్యాలి. వీటిని కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాలు వేసి రెండు పక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.
నువ్వుల లడ్డు
కావాల్సిన పదార్ధాలు: టేబుల్ స్పూన్ నెయ్యి, పావుకిలో బెల్లం, పావుకిలో నువ్వులు.
తయారు చేయు విధానం: నువ్వులు శుభ్రం చేసి దోరగా వేయించుకోవాలి. బెల్లం చిన్నముక్కలుగా చెయ్యాలి. నువ్వులు రోట్లో వేసి దంచి మెత్తగా అయ్యిన తర్వాత బెల్లం వేసి దంచితే గట్టిగా ముద్దలా అవ్వుతుంది. దీనిలో నెయ్యి కలిపి ఉండలు చుట్టుకోవాలి. అంతే నువ్వుల లడ్డూ రెడీ...
(నువ్వులు కమ్మని వాసనతో చాలా రుచిగా ఉంటాయి. నువ్వులలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది భలవర్ధకమైన ఆహారం ప్రతిరోజు ఒక లడ్డు పిల్లలకు ఇస్తే వారిలో ఎముకలు బలపడుతాయి.)