Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంకేతికంగా ఎంతో ఎదిగామని చెప్పుకుంటున్నప్పటికీ ఆడదాన్ని వస్తువుగానో, ఏదో ఓ వికృతానికి చిహ్నంగా చూపడం... అనే బలహీనతను అధిగమించలేక పోతున్నారు. పైగా అందివచ్చిన సాంకేతికతను తమలోని అసభ్య ఆలోచనలకు అనుగుణంగా మహిళలను చిత్రీకరించేందుకు తమ శ్రమను ధారపోస్తున్నారు. ఖరీదైన విద్యను, మేధో వికాసాన్ని సామాజిక అంశాలకు ఖర్చు చేయకుండా రాత్రింబవళ్ళు మహిళలపై అశ్లీలతను సృష్టించేందుకు ఖర్చు చేయడం వారి భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగించే అంశం. పైగా మహిళల అశ్లీల చిత్రాలు సృష్టించడం, ఆ మహిళను వేలం వేస్తున్నట్టుగా ప్రకటించడం వంటివి చేస్తే తాము లక్ష్యంగా పెట్టుకున్న ఆడవారిని అవమానిస్తున్నామని భావించడం, ఒక వర్గపు మహిళను లక్ష్యంగా చేసుకుని వికృతంగా దాడికి పాల్పడడం వారి మానసిక పరిణతిని ప్రశ్నిస్తున్నది. ఈ భావజాలంతో పెరిగిన యువత దేశ భవిష్యత్తు కాబోతుందనే ఆలోచన అన్ని వర్గాల్లోనూ దిగులు పుట్టిస్తుంది. ఇటీవల వెలుగు చూసిన బుల్లీబారు ఉదంతం పట్ల వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు 'మానవి' తో తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. అవి మీకోసం...
- నస్రీన్ ఖాన్
మనకోసం మనమే
మహిళలను అవమానించడం కోసం పురుషులు వాడుతున్న పురాతన ఆయుధం. ఏ విషయానికైతే తీవ్రంగా కుంగిపోతామో, ఏం చెబితే అవమానంగా భావిస్తామో దానిని లక్ష్యంగా చేసుకోవడం లాంటివి. రేప్ చేస్తామని బెదిరించడం, సెక్స్ సింబల్‌గా చూపించడం వీటిల్లో భాగాలే. మనిషి మెదడు నిత్యం సెక్స్ గురించిన ఆలోచనల చుట్టూ తిరుగుతుండడమే ఇందుకు కారణం. నాపై అనేకమార్లు ఇటువంటి ట్రోల్స్‌కు పాల్పడ్డారు. తాటకి, రాక్షసి... ఇంకా ఎన్నో పేర్లతో మానసికంగా కుంగదీయాలని ప్రయత్నించారు. కా, ఎన్నార్సీ అంశం సమయంలో ముస్లిం మహిళలు బయటకు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. దళిత మహిళలు, గిరిజన మహిళల్లాగే ముస్లిం మహిళలూ బలమైన గొంతుకలుగా విస్తరిస్తున్నారనే రాజకీయ భయం ముప్పిరిగొంది. జెండర్ పరంగా, మత పరంగా, ప్రశ్నించే గొంతులను నొక్కేసే కుట్ర ఇది. ఇందుకు సాంకేతికత పైనా ఆధారపడ్డారు. బహిరంగంగా బాడీ షేమింగ్‌కు గురి చేస్తే మరికొన్ని కొత్త గొంతుకలు పుట్టుకు రావనే వ్యూహం వారిది. సామాజిక మాధ్యమాల్లో కనిపించకుండా పోవాలనేది వారి కుట్ర. పురుషస్వామ్య వ్యవస్థలో మహిళలకు రక్షణ లేదని మరోసారి నిరూపితమైంది. పురుషుల హక్కులకు భంగం వాటిల్లితే గళమెత్తేది మహిళలే. మహిళలకోసం పని చేయాల్సింది మహిళలే. నిత్యం అందరినీ వేధిస్తున్న విషయం ఏమంటే దేశానికి భవిష్యత్తుగా ఆశలు పెంచే యువతరం ప్రమాదంలో పడబోతున్నది. వారి తాత్కాలిక అవసరాలకోసం పసి మనసులపై విద్వేషాన్ని లిఖిస్తున్నారు. వారి భవిష్యత్తు ఏం కానున్నదో పట్టించుకోని నిర్లక్ష్యం ఈ స్వార్థపరులది.
- ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి
దళిత మహిళా ఉద్యమ నాయకురాలు
పునర్నిర్మితమవాలి
ఇవాళ్టి యువతరం ఎటు వెళ్తుందనే అంశాన్ని పట్టి ఇస్తుందీ ఘటన. స్త్రీలను వేధించడానికి ఆధునికతను ఆయుధంగా మలుచుకుంటున్న తీరుపై తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. దీనిని జెండర్ ఇష్యూగా, ముస్లిం ఇష్యూగా చూడాలి. ఇదే తరహాలో హిందూ అమ్మాయిలను వేధించిన వారిని వెంటనే పట్టుకున్నారు. ముస్లిం స్త్రీల విషయంలో అలసత్వం కనిపిస్తుంది. ముస్లిం స్త్రీలు అనే కోపం ద్వేషం వల్లే ఈ అలసత్వం. సోషల్ మీడియాలో మహిళలు ఎందుకు యాక్టివ్‌గా ఉండకూడదు? ఇటువంటి దాడులకు గురయిన వాళ్ళు కూడా ఆయా రంగాలలో పోరాడుతున్నావారే. దాక్కుని బతకడానికి మనం మత రాజ్యాల్లో జీవించడంలేదు. ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. కానీ దురదృష్ట వశాత్తు స్వేచ్ఛ అనే పదం అర్ధం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితి చుట్టూ ఉంటే ఎవరు మాత్రం ఎట్లా ధైర్యంగా ఉంటారు? ఎక్కడ కెమెరాలు ఉన్నాయో... ఎవరితో మాట్లాడాలో.. వద్దో తెలియని పరిస్థితి. అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రేమ, ద్వేషం, పెళ్లి, ఉద్యోగం, అధికారం... అన్నీ డబ్బు చుట్టూ భ్రమణం చేస్తున్నాయి. ఏం చేసైనా డబ్బు సంపాదించాలనే మనఃస్థితి పోవాలి. స్త్రీలను గౌరవించే సమాజం పునర్నిర్మితం కావాలి.
- డాక్టర్ షాజహానా, రచయిత్రి
నాగరికత పతనానికి చిహ్నం
ప్రశ్నించే మహిళలను అసభ్యంగా చిత్రించడం, వేలం వేయడం సంఘ విద్రోహ చర్య. మానవులమైన మనం ప్రతి ఒక్కరమూ దీనిని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే. 21వ శతాబ్దంలోనూ ఆడదాన్ని వస్తువుగా చిత్రీకరించడం దారుణమైన సంఘటన. నాగరికత, మానవీయ విలువల పతనానికి నిదర్శనం. సమాజంలోని ఒక పార్శ్వమే ఇటువంటి నేరాలకు పాల్పడేలా చేస్తుంది. లైంగిక వేదింపులు, దాడులు, అసభ్య పదజాలంతో కూడిన తిట్లు, తమ ఆధీనంలో బంధించాలనే భావజాలం అంతా మహిళలు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న హింసే. 1970, 80 దశకాలలో వచ్చిన సినిమాల్లో ఆడదాని నోరు మూత బడాలంటేనో, ఆమె పొగరు దించాలంటేనో... ఆమెను పురుషుడు ముద్దు పెట్టుకోవడం, లైంగిక దాడి చేయడం... లేదా మరో విధంగా వేధించేవారు. ఆ తరువాత ఆమె అతడి ప్రేమలో పడినట్టు చూపేవారు. ఇదంతా పురుషస్వామిక వ్యవస్థ ఆడదాన్ని తమ గుప్పిట బంధించడానికి పెట్టుకున్న ఆయుధం. చరిత్రలో చూసుకున్నా స్త్రీ ని వేలం వేయడమో, ఉంపుడుగత్తెగా ఉంచడమో, జోగినిగా నిర్దేశించి వదలడం... ఎక్కడ చూసినా మహిళను కామ వస్తువుగా మార్చడానికే ప్రయత్నించారు. లైంగిక దాడి, బూతులతో నిందించడం అనేది వారు తమ అధికారానికి మరింత బలం చేకూర్చుకునేందుకు పన్నిన కుట్ర. మహిళలను భయపెట్టేందుకు వేసిన ఎత్తుగడలు. కొన్నేండ్ల కిందటి వరకూ ముస్లింలను ఓటు బ్యాంకుగా చూసేవారు. ఇప్పుడు వారిపై ఎంతగా ద్వేషం పెంచుకుంటూ పోతే అంతగా మెజారిటీ వర్గాల మద్దతు లభిస్తుందనే లాజిక్‌తో ముందుకు వెళ్తున్నారు. 'ముస్లింలను ఎంతగా అసహ్యించుకుంటే అంతగా సమాజంలో భద్రంగా జీవించగలుగుతావు' అనే ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. విలువలపై దెబ్బ కొట్టాలని చేసిన ఒక కుయుక్తి ఇది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే భయంకర అణచివేతకు ఇదో ఉదాహరణ.
- జాహా ఆరా
న్యాయవాది, సామాజిక కార్యకర్త
బాధితురాలిని కాదు లక్ష్యితురాలను
ఎవరైతే అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారో, ఎవరైతే ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారో వారి గళాన్ని నొక్కేసేందుకు జరిగిన కుట్ర. ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని హీనంగా వేలం వేశారు. గతంలో సుల్లీ డీల్స్ ద్వారా ఇలాంటి దుర్ఘటన బయటపడినప్పుడు నోయిడాలో, ఢిల్లీలో ఫిర్యాదులు చేసాము. ఆ సమయంలోనే దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు బుల్లీబాయి రూపంలో మరో దుస్సంఘటన బయటపడేది కాదు. నాలాగా గొంతెత్తే 112మంది ముస్లిం మహిళలను యాప్‌లో పెట్టడం కుటిలమైన చర్య. నాకు యాప్ తయారు చేసిన ఆ పిల్లలపై జాలి, దయ కలుగుతుందే తప్ప కోపం, భయం వేయడం లేదు. 20,30ల్లో ఉన్న అమ్మాయిలపై ఇటువంటి దాడులు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 67 ఏండ్ల నన్ను, తప్పిపోయిన కొడుకును వెతుక్కుంటున్న 60 ఏండ్లు పైబడిన నజీబ్ తల్లి కూడా ఆ యాప్‌లోని అశ్లీల చిత్రాలుగా కనిపించడం ఏహ్యంగా ఉంది. ఈ తరంలో ఇటువంటి మైండ్ సెట్‌తో పెరిగిన పిల్లలతో దేశం ఏం కాబోతుందనేదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. నా ఫొటోను మార్ఫింగ్ చేయడంపై నేనేమీ సిగ్గు పడటంలేదు. నేను బాధితురాలిని కానే కాదు. కానీ లక్ష్యితురాలిగా చెప్పుకుంటాను. నా ఆదుర్దా అంతా చిన్న వయసులో ఉన్న అమ్మాయిల గురించే. వారు సోషల్ మీడియాలో రావడం మామూలు విషయమే. అలాంటి వారు వారి వారి కుటుంబాల నుంచి ఎదుర్కొనే ఒత్తిడికి బాధ్యులు ఎవరు? మనం నీటి బుడగను కాదు చూడాల్సింది ఆ బుడగకు ఉన్న మూలం చూడాలి. అసలు ఇలాంటి యాప్‌లను ప్రోత్సహించేవారెవరు? అసలు దోషులను పట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
- ఖాలిదా పర్వీన్
సామాజిక హక్కుల కార్యకర్త
గుట్టు విప్పినందుకే నాపై ట్రోల్స్
నేను ఇప్పటివరకు చేసిన వీడియోల్లో మతానికి సంబంధించినవి. లేదా మతాన్ని ప్రస్తావించిన వీడియోలు మీకు కనిపిస్తాయి. కానీ అవి ఏ ఒక్క మతానికి చెందినవో, ఏదో ఒక మతానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో చేసిన వీడియోలు కావు అవి. మత రాజకీయాలు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఆధారాలతో వీడియోలు చేసేందుకు ఎక్కువగా ప్రయత్నించాను. ఇటువంటి వీడియో రూపొందించిన ప్రతిసారీ ఇటువంటి అంశాన్ని నాలాంటి సున్నిత మనస్కులు చేయకపోవడమే మంచిదని అనిపిస్తుంటుంది. కానీ నిత్యం ఎదురవుతున్న రకరకాల సంఘటనలు నన్ను ఇటువంటి వీడియోలు చేసేందుకే ప్రేరేపిస్తున్నాయి. ఒక మానవతావాది గా, మనుషులంతా సమానమేనని నమ్మే వ్యక్తిగా నాలో రేకెత్తే ప్రశ్నలే నన్ను ఈ వీడియోలు చేయడానికి పురిగొల్పుతున్నాయి. వయసుతో, విద్యతో సంబంధం లేకుండా నా చుట్టుపక్కల ఉన్నవారే 2014 తరువాత పరిమత ద్వేషిగా తయారయ్యారు. అంటే వారు ఎటువంటి ప్రభావాలకు లోనై ఉంటారు? పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లల్లోనూ ఈ దేశ వాసులు ఎవరు, కాని వారిని తరిమేయాలనే ప్రశ్నలు ఎలా పుడుతున్నాయి? ఆడవాళ్ళ బట్టల్లోనే దేశ సంస్కృతి ఉందని ఎవరు నూరిపోస్తున్నారు వీళ్ళకు? తాజాగా బుల్లీబారు యాప్ లో ముస్లిం మహిళలను జుగుప్స కలిగించేలా మార్ఫింగ్ చేసారు. ఈ దారుణమైన వార్తలు చదువుతున్నప్పుడే నా ఫొటో మార్ఫింగ్ తో కనిపించింది. నాతోపాటు సిఎమ్ ఎస్ రమ, దేవి, అరుణ గోగులమండ కూడా ఉన్నారు ఆ ఫొటోలో. వీళ్ళంతా ప్రజా సమస్యలపై నిత్యం తమ గళాన్ని వినిపించే శక్తిమంతమైన మహిళలు. నాలా వీడియోలు చేసేవారు కాదు. బాధితుల పక్షాన నిలబడి పోరాడే మహిళలు. ఇంకా చాలా మందిని ప్రముఖులను ఇలాగే మార్ఫింగ్ చేసారు. వాటిని తొలగించాలని రిపోర్ట్ చేసినా ఫేస్బుక్ స్వీకరించకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఫిర్యాదు చేసాను. ఈ సంఘటనల ద్వారా కచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఇళ్ళల్లో పెరుగుతున్న పిల్లలే రేపటి రోజున ప్రమాదకరంగా మారతారు.
- తులసి చందు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్, యూట్యూబర్