Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒమిక్రాన్ వైరస్‌కు వేగం చాలా ఎక్కువ. అంతే కాదు తాను మనిషి శరీరంలో ప్రవేశించినట్టుగా తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఇంతకు ముందు డెల్టా వేరియంట్ కోవిడ్ మనిషిలో చేరినపుడు జ్వరం, ఒళ్ళు నొప్పులు, నాలుక రుచిని కోల్పోవడం, తుమ్ములు, దగ్గులు, ఆయాసాలు వచ్చేవి. ఇపుడు ఒమిక్రాన్ వైరస్ మనిషిలో దూరి తన పని తాను చేసుకుపోతోంది. కానీ బయటకు కనపడనివ్వట్లేదు. ఏదో చిన్నపాటి తుమ్ములు, ముక్కు కారడం తప్ప వేరే లక్షణాలేవీ బయటకు కనబడకుండా జాగ్రత్తపడుతోంది. ఒమిక్రాన్ అమెరికా, బ్రటిన్లలో తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒమిక్రాన్ వలన యూకెలో మూడు వందలకు పైగా మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. భారత్‌లో లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. మూడో డోసు వ్యాక్సిన్‌ను ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వైద్యులకూ ఇస్తున్నారు. ఒమిక్రాన్ వైరస్ పార్లమెంట్, హైకోర్టులు, మెడికల్ కాలేజీలు, ప్రముఖుల ఇళ్ళలో దూరి ప్రభావితం చేస్తూ తన పేరుకు కీర్తిని తెచ్చుకుంటున్నది. త్వరగా పేరు రావాలంటే ప్రముఖులను కలవాలనే తెలివితో ఉన్నది. గాంధీ ఉస్మానియాలలో ఇరవై మంది వైద్యుల్లో పాజిటివ్ కలగజేసి వైద్యం చేయకుండా వారిని బెడ్‌పై పడవేస్తోంది. మనం కూడా తగ్గేదేలే. బయటకు పోకుండా మాస్క్‌తో ఉందాం. క్షేమంగా ఉందాం!
సపోట పండుతో
నేనీరోజు కోవిడ్ - 19, డెల్టా, ఒమిక్రాన్ వైరస్‌లను తయారు చేస్తున్నాను. వైరస్ రూపాలను తెలుసుకొని, దాని లక్షణాలను అది శరీరంలోకి వెళ్ళాక ఏమి చేస్తుందో తెలుసుకుంటే వెళ్ళగొట్టటం సులభం. అందుకే అసలు వైరస్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. వైరస్ అంటే ఒక ప్రోటీన్ పోగు. వైరస్లు వాటంతట అవే విభజన చెందలేవు. అంటే మనుగడ సాగించలేవు అన్నమాట. అవి బతికి ఉండాలంటే వేరే ఒక జీవకణం తప్పనిసరిగా ఉండాలి. అందుకే అవి ఆశ్రయం కోసం మానవులలో జొరపడతాయి. ఇవి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవులు. కాబట్టి మన శరీరంలోకి ప్రవేవించిన విషయం మనకు తెలియదు. ముక్కు ద్వారా, నోటి ద్వారా అవి లోపలికి వెళతాయి. అందు కోసమే ముక్కుకు మాస్క్ కట్టుకోమంటున్నారు. మన చేతుల మీద వాలి ఉన్న విషయం కనిపించదు కాబట్టి శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం అవసరం. ఆ విధంగా వాటి వ్యాప్తిని నిరోధించవచ్చు. ఒక మానవుడి శరీరంలో చేరి తన కణాలను పెంచుకొని అనారోగ్యం పాలు చేసి చివరకు మరణానికి దారి తీస్తుంది. అది కూడా తిన్న ఇంటి వాసాలను లెక్కపెడుతోంది అన్నమాట. వైరస్‌కు ఏ మనిషి జీవకణమూ దొరకకపోతే ఎనిమిది గంటల తర్వాత చనిపోతుంది. అది బతకటం కోసం మనిషిని చేరి చివరకు మనిషినే చంపివేస్తుంది. సపోటా పండుకు రంగుల పిన్నులు గుచ్చి వైరస్‌ను తయారు చేశాను. థర్డ్ వేవ్ మొదలైందని తయారు చేశాను.
రబ్బరు బంతితో
నేను దీన్ని సెకండ్‌వేవ్ సమయంలో తయారు చేశాను. డెల్టా వైరస్ మోడల్‌ను విద్యార్థులకు చూపించాలని తయారు చేశాను. మా పిల్లల అసుపత్రిలో రెండు సార్లు ఎగ్జిబిషన్ పెట్టాము. ఆసుపత్రికి వచ్చే పిల్లలకు, తల్లులకు అవగాహన కల్గించే ఉద్దేశ్యంతో దీన్ని సృష్టించాను. రబ్బరు బంతిని తీసుకుని దానికి చుట్టూరా రంగురంగుల ధర్మోకాల్ బాల్స్‌ను అతికించాను. ఇప్పుడు రబ్బరు బంతి వైరస్ ఆకారాన్ని పోలి ఉన్నది. వైరస్ అనే పదం లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. లాటిన భాషలో వైరస్ అంటే టాక్సిన్ అని అర్థం. టాక్సిన్ అంటే విషయం కదా! వైరస్లు ఇతర జీవుల కణాలపై దాడి చేసి వాటిని చంపేసి తన సంతతిని పెంచుకుంటుంది. మామూలుగా మన చుట్టూ గాలిలో లక్షల రకాల వైరస్లు ఉన్నా హానికరమైనవి తక్కువే ఉంటాయి. అతి సరళమైన జన్యుపదార్థం ప్రోటీనులతో చేయబడిన రక్షణ కవచంలో కప్పబడి ఉంటుంది. ''ఈ పొర కరిగి పోయిందా''? వైరస్ చచ్చిపోయినట్లే. కొన్ని గంటల పాటు మాత్రమే బతికి ఉంటుంది. అతి శీతల ప్రదేశాలలో ఎక్కువ సేపు బతికి ఉంటాయి. ఎండకు ఆ ప్రోటీన్ పొర కరిగిపోవడంతో చచ్చిపోతుంది. వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. మేము ఎమ్మెస్సీ చదివేటప్పుడు 'ధైరాలజీ' ఒక పేపర్‌గా పరీక్ష రాశాము. బిఎస్సీలో రేఖా మాత్రంగా ఉండే సిలబస్ ఎమ్మెస్సీలో విస్తృతంగా ఉంటుంది.
బిళ్ళలు, గొట్టాలతో
ఎక్స్పైరీ డైట్ అయిపోయిన టాబ్లెట్లు, క్యాప్స్యూల్స్‌ను నేను దాచిపెట్టి బొమ్మలు చేస్తున్నాను. ఎక్కువగా చెట్లు, పక్షులు, వర్లి ఆర్ట్‌లోని జంతువుల్ని తయారు చేశాను. ఇప్పుడు కోవిడ్-19 వైరస్‌ను తయారు చేశాను. కరోనా విజృంభించి భారతదేశం లాక్డౌన్లోకి వెళ్ళిన మార్చి నెలలో దీనిని తయారు చేశాను. ఈ కరోనా వైరస్‌ను నేను రాసిన 'క్వారంటైన్' పుస్తకానికి కవర్‌పేజీగా వేసుకున్నాను. నేను ఆసుపత్రి వ్యర్థాలతోనూ, వెంటిలేటర్ వేస్టుతోనూ తయారు చేసిన వైరస బొమ్మల్ని అన్నింటినీ క్వారంటైన్ పుస్తకంలో ప్రింట్ చేశాము. మొదట్లో బాక్టీరియాలు, వైరస్లు వేర్వేరని తెలియలేదు. మైక్రోస్కోపు కనుక్కునే దాకా ఇలాంటి అతి సూక్ష్మజీవులు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. వైరస్లు బాక్టీరియా కంటే చాలా చిన్నవనీ ఇవి కూడా వ్యాధుల్ని కలగజేస్తాయనీ ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. అంతేకాక వైరస్లు బాక్టరీయాలపై కూడా దాడి చేస్తాయని 20వ శతాబ్ద ప్రారంభంలో కనుగొన్నారు.
ఆకుకుచ్చుల పూలతో
కాగితంపై పెన్నుతో రకరకాల హావభావాలతో కరోనా వైరస్‌ను చిత్రించాను. కాలేజీలో ఉన్నప్పుడు రికార్డుల్లో వేసిన వైరస్ చిత్రాలను రకరకాల వస్తువులతో తయారు చేసి సైన్స్ ఛార్టులను తయారు చేశాను. ఈ సైన్స్ ఛార్టులను కొన్ని స్కూళ్ళలో ఎగ్జిబిషన్‌గా పెట్టి విద్యార్థులకు వైరస గురించి చెప్పాను. ఆటలమ్మ, దాగర, మశూచి, పోలియో, ఎయిడ్స్, ఎల్లోఫీవర్, రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని కలగజేసేది వైరస్‌లే. ప్రాచీన ఈజిప్టు రాజ్యంలో కూడా పోలియో వ్యాధి ఉన్నట్టుగా ఆనాటి చిత్రాల ద్వారా తెలుస్తున్నది. ఎడ్వర్డ్ జెన్నర్ తన ప్రయోగాల ద్వారా ఒకసారి మశూచి వచ్చాక మరల రావడం లేదని తెలుసుకున్నాడు. దాని వలననే 1879వ సంవత్సరంలో ఎడ్వర్డ్ జెన్నర్ టీకాలను తయారుచేశాడు. ఆ టీకాల వలననే మశూచిని ప్రపంచం నుండే పారద్రోలారు.
వెంటిలేటర్ వేస్టుతో
కరోనా వైరస్ సోకిన వాళ్ళు వ్యాధి తీవ్రతరమైన సందర్భంలో వ్యాధిగ్రస్తుల్ని వెంటిలేటర్ మిషన్ మీద పెడతారు. ఆ వెంటిలేటర్ మిషన్‌లో వచ్చే వ్యర్థాలతో కరోనా వైరస్‌ను తయారు చేస్తున్నారు. ఇవి తెల్లగా గుండీల ఆకారంలో ఉండే ప్లాస్టిక్ పదార్థాలు. వైరస్‌లను విభజించటం కష్టమైన పని. అసలు వీటిని జీవులా, నిర్జీవులా అనేది ఇంత వరకూ ఎవరూ తేల్చలేకపోయారు. అంతర్జాతీయ వైరస్ల వర్గీకరణ కమిటీ కొన్ని ప్రామాణికాలతో ఒక వర్గీకరణను చేసింది. వైరస్‌లో ఉండే కేంద్రకామ్లం ఒక పోగుగా ఉన్నదా, రెండు పోగులుగా ఉన్నదా, వీటికి కవచం ఉన్నదా లేదా అనే విషయాలు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోల్ ఒక వర్గీకరణను ప్రతిపాదించాడు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్