Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తరచుగా ఆటో నడిపే మగవారిని చూస్తుంటాము. కానీ ఆటో నడిపే మహిళలను ఎంత మందిని చూశాము. మనం డెలివరీ బార్సును రోజూ చూస్తూనే ఉన్నాము. కానీ డెలివరీ గర్ల్‌ని ఎంతమందిని చూశాము. పురుషాధిక్యత రాజ్యామేలుతున్న ఈ రంగాలలో మహిళలు అడుగుపెట్టాలంటే భద్రత సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ప్రజారావణా రంగంలో. మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే ప్రజారవాణా అత్యంత కీలకం. రావాణా భద్రత లేక ఎంతో మంది మహిళలు తమలోని శక్తి సామర్థ్యాలకు పరిమితులు పెట్టుకుంటున్నారు. అదే రవాణా వ్యవస్థలో కూడా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటే వారి నైపుణ్యం దేశానికి మరింత ఉపయోగపడుతుంది. దీనికోసం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె ఇంటి నుండి బయటకు కదిలితేనే దేశం ముందుకు సాగుతుంది.
షెల్ ఫౌండేషన్ బిజినెస్ డెవలప్మెంట్ అడ్వైజర్ షిప్రా నయ్యర్ మాట్లాడుతూ దేశంలోని మొత్తం డ్రైవర్లలో కేవలం పదకొండు శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే అనేక సామాజిక సంస్థలు మహిళలపై దృష్టి సారించడం ప్రారంభిస్తే ఈ సంఖ్యలో మార్పు వస్తుంది.
మిగతా మీనాక్షిలందరూ ఎటు పోయినట్టు
ఇది 1995 నాటి సంగతి... బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ సినిమా అయిన దిల్వాలే దులÛనియా లే జాయేంగే (డిడిఎల్జె) మొదటిసారిగా తెరపైకి వచ్చిన సంవత్సరం. ఇప్పుడు ఈ సినిమా చూడని వారు బహుశా దేశంలో ఎవ్వరూ ఉండరనుకుంటా... అదే సంవత్సరం మరొక చరిత్రాత్మక సంఘటన కూడా జరిగింది. చెన్నై నగరం మీనాక్షి అనే మొదటి మహిళా ఆటో డ్రైవర్‌ను చూసింది. ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆమె ఇప్పటికీ చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో తనకు ఇష్టమైన బీచ్‌లలో డ్రైవింగ్ చేస్తుంది. అంతేకాదు తనలాగే స్వతంత్రంగా బతికేలా 150 మంది మహిళలకు శిక్షణ కూడా ఇచ్చింది. మరి మిగతా మీనాక్షిలందరూ ఎటు పోయినట్టు.
11 శాతం మాత్రమే...
అసమానతలతో నిండివున్న మన భారతదేశంలో మహిళల పరిస్థితి చూస్తే అస్పష్టంగా వుంది. దేశంలోని మొత్తం డ్రైవర్లలో 11 శాతం మాత్రమే ఉన్నారు. భారతదేశంలో జారీ చేయబడిన వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లలో మహిళలు -1 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. భారతదేశంతో సహా దక్షిణాసియా ప్రాంతం, ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో మహిళా కార్మికులు అత్యంత తక్కువ వాటాలను కలిగి ఉన్నారు. మధ్యప్రాచ్యం కంటే ఇది స్వల్పంగా మాత్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇటీవలి వరకు కొన్ని దేశాల్లో మహిళలు డ్రైవింగ్ చేయకుండా చట్టపరమైన నిబంధనలు కూడా విధించబడ్డాయి.
భద్రతా సమస్యలు.. ఇంకా ఎన్నో...
మొత్తంమీద ప్రయాణం చేసే మహిళలకు భద్రత ప్రాథమిక అవసరం. జనాభా గణన డేటా (2011) జెండర్ పోలిక ప్రకారం బెంగళూరులో సగటున 43 శాతం మంది మహిళలు పనిలోకి వెళుతున్నారు. 24 శాతం మంది పురుషులతో పోలిస్తే, చెన్నైలో, పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ మంది మహిళలు (34 శాతం) పనిలోకి వెళుతున్నారు. (16 శాతం). ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధ్యయనాల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇది మనందరం చూస్తున్న వాస్తవం. ముఖ్యంగా తక్కువ వేతనం సంపాదిస్తున్నవారు ప్రజా రవాణాపై కచ్చితంగా ఆధాపడి ఉంటారు. సురక్షితమైన, విశ్వసనీయమైన రవాణా వారికి అందుబాటులో లేనపుడు వారికి ప్రతిరోజూ ఓ గండమే. లేదా వారి ఇళ్లకు సమీపంలోనే వారి ఉద్యోగ మార్గాలను పరిమితం చేసుకోసుకుంటారు. అవకాశం ఉన్న వారు ఏవో చిన్న వ్యాపారం చేసుకుంటారు.
మహిళల సంఖ్య పెరిగినపుడు
బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది మహిళలు కనిపించడం అనేది మహిళల భద్రతకు ఓ సవాలుగా మారింది. మహిళలు తమ ప్రయాణాన్ని ఎప్పుడు సురక్షితంగా భావిస్తారు? ఉదాహరణకు బస్సులు, రైలు కోచ్‌లలో మహిళలకు ప్రత్యేకించబడినపుడు. అలాగే వారు రోజులో ఏ సమయంలోనైనా పురుషుల కంటే మహిళా క్యాబ్ డ్రైవర్లతో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా వాణిజ్య డ్రైవర్లుగా మహిళల సంఖ్య పెరిగినపుడు. అది ప్రజా రవాణా లేదా టాక్సీలు, ఆటో రిక్షాలు వంటి ఇతర సేవలు అయినా మహిళలు అయితే వారిని అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 'పురుషుల పని' వర్సెస్ 'స్త్రీల పని' అనే మూస పద్ధతులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
మారుతున్న కాలం
సాధారణంగా తరతరాలుగా రవాణా రంగం అంటే కేవలం మగవారే నిర్వహంచాలి అనే ఆలోచన ఉంది. అది సాంప్రదాయకంగా పురుషాధిక్యత కలిగిన రంగం. ఇలాంటి శ్రామికశక్తిలో ఉద్యోగాన్ని కోరుకునే స్త్రీకి చాలా ధైర్యం పట్టుదల ఉండాలి. అలాగే అందులో పని చేసే మహిళలకు కష్టతరం చేసే వివిధ నిర్మాణ సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక సామాజిక సంస్థలు ప్రయాణీకులుగా అలాగే వాణిజ్య వాహనాల యజమానులు-డ్రైవర్లుగా మహిళలపై దృష్టి సారించడం ప్రారంభించాయి. తక్కువ ఆదాయ నేపథ్యాల నుండి వస్తున్న మహిళలను కలిసి డ్రైవింగ్ నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సామాజిక-సాంస్కృతిక అడ్డంకులను, భద్రతకు సంబంధించిన ఆందోళనలను అధిగమించి వారి కుటుంబాలు గడవడం కోసం వారు ఈ పని చేస్తున్నారు. ఈ సంస్థలు తక్కువ ఆదాయ కుటుంబాల మధ్య కొత్త తరం మహిళా సూక్ష్మ పారిశ్రామికవేత్తలను సృష్టిస్తున్నాయి.
ముందుకొచ్చిన సామాజిక సంస్థలు
ఉదాహరణకు ఈవెన్ కార్గోను తీసుకోండి ఢిల్లీలో ఉన్న ఒక మహిళా లాస్ట్ మైల్ ఈకామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ. డ్రైవింగ్ చేయడం ఎలాగో నేర్పించడం ద్వారా వారు డెలివరీ ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణనిస్తోంది. ఇప్పటి వరకు 500 మంది మహిళలకు శిక్షణనిచ్చింది. భారతదేశం అంతటా 250 మంది మహిళలను డెలివరీ అసోసియేట్లుగా ఉంచింది. ఇలాంటిదే మరో చొరవ... మూవింగ్ ఉమెన్ సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ చేసింది. హైదరాబాద్‌లో 1500 మంది మహిళలకు ద్విచక్ర వాహనాలు నడపడంలో శిక్షణ ఇచ్చింది.
తెలంగాణ మొదటి రాష్ట్రంగా...
హైదరాబాద్‌లో మొదటి సారి ప్రత్యేకంగా మహిళల కోసం ''మహిళల మోటారు శిక్షణా కేంద్రం'' ప్రారంభించి దేశంలోనే ఇలాంటి ఓ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఈ కేంద్రం మహిళలకు శిక్షణనిచ్చేందుకు 'మూవింగ్ ఉమెన్ సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్'తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మహిళలకు జీవన నైపుణ్యం, జీవనోపాధిని పొందేందుకు సురక్షితమైన మార్గాన్ని అందించడంతో పాటు, ఈ సంస్థలు తక్కువ వడ్డీలకు ఫైనాన్సింగ్ ద్వారా వారి ఎలక్ట్రిక్ వాహనాలను సొంతం చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తాయి. రవాణా రంగంలో మహిళల ప్రవేశాన్ని విజయవంతం చేయడానికి, భారతదేశం అంతటా మరింత మంది మీనాక్షిలను సృష్టించగల సంస్థలను నిర్మించడానికి లోతైన నిబద్ధత, అంకితమైన మూలధనం, ఎనేబుల్ విధానాలు అవసరం.
తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే తప్ప
రావాణా రంగంలో మహిళలను ఎక్కువగా ప్రోత్సహించాలంటే భారతదేశం తన డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అయితే మన దేశంలోని అర బిలియన్కు పైగా మహిళలను కదిలించి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే తప్ప వారికి మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలను పొందలేరు. మహిళలు తాము చేస్తున్న ఉపాధిని సురక్షితంగా భావించే వరకు వారు తమ శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం లేదు. ఆమె కదిలినప్పుడే దేశం ముందుకు సాగుతుంది.
- సలీమ