Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం రోజు తినే ఆహారంలోగానీ, తినే సమయంగాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు.అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. చాలామంది బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటారు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు.
శరీరంలో పేరుకునే కొవ్వు క్రమక్రమంగా గట్టిపడి తొలగించడానికి క్లిష్టంగా తయారవుతుంది. నువ్వుల నూనె చర్మంలోకి ఇంకి, అడుగున ఉండే కణజాలానికి రక్తప్రసరణను పెంచి, విషాలను బయటకు విసర్జించేలా చేయడం ద్వారా మెటబాలిజంను పెంచుతుంది. ఇందుకోసం వెచ్చని గదిలో నువ్వుల నూనెతో 15 నుంచి 30 నిమిషాలపాటు శరీరాన్ని మర్దన చేయాలి. తర్వాత సూర్యరశ్మి తగిలేలా చేసి చమట పట్టనివ్వాలి. ఆ తర్వాత నీడపట్టున 10 నిమిషాలు ఉండి ఆ తర్వాతే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
శరీర వాపు శరీరంలో పేరుకున్న విషాల విసర్జనకు అడ్డుపడుతుంది. మరీ ముఖ్యంగా లింఫ్ వ్యవస్థలోని విషాల విసర్జనకు స్థూలకాయం అవరోధమవుతుంది. ఇందుకు కారణం శరీరంలో కఫ దోషం పెరిగిపోవడమే. కాబట్టి వారానికి ఒకసారి ఉప్పు కలిపిన వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఈ విషాలు స్వేద రంథ్రాల ద్వారా బయటకు వెళ్లిపోతాయి.