Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇడ్లి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. వేడి వేడి ఇడ్లి సాంబార్, కొబ్బరి చట్నీ ఆహా ఏమి రుచిలే.. మరి ఇడ్లీలు ఒక్కోసారి మిగిలి పోతుంటాయి. అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తూ వుంటారు. అలా మిగిలిపోయిన వాటితో ఇలా సింపుల్‌గా కొన్ని స్నాక్స్ చేసుకుందామా.... పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
స్పెషల్ స్నాక్
కావలసిన పదార్ధాలు: నాలుగు ఇడ్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగిన ముక్కలు ఒక చిన్న కప్పు, ఉప్పు, కొత్తిమీర, నూనె, పోపు దినుసులు, నిమ్మకాయ ఒకటి.
తయారు చేయు విధానం: ముందుగా ఒక మందపాటి బాండీలో నూనె వేసి పోపు దినుసులు వేసి అవి వేగాక తరిగిపెట్టుకున్న పచిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి పచ్చి పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత ఒక ఇడ్లీని ఆరు ముక్కలుగా చేసి బాండీలో బాగా కలియబెట్టి ఉప్పు తగినంత వేసి మూడు నిమిషాలు మూత పెట్టాలి. కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు. పైనుంచి కొత్తిమీర చల్లి నిమ్మ కాయ పిండుకుని తింటే చాలా బావుంటుంది. పిల్లలకు వెరైటీ స్నాక్స్ చేసి పెట్టినట్టు ఉంటుంది. ఇష్టంగా తింటారు.
ఇడ్లీతో ఉప్మా
కావలసిన పదార్ధాలు: ఎనిమిది ఇడ్లీలు, పల్లీలు గుప్పెడు, పచ్చి మిర్చి, అల్లం, ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా చేసుకున్నవి ఒక కప్పు, క్యారెట్ తురుము చిన్న కప్పు, పోపు దినుసులు, నూనె, ఉప్పు, కరివేపాకు.
తయారు చేయు విధానం: ఒక మందపాటి బాండీలో నూనె పోసి అది వేడి ఎక్కాక అందులో పోపు దినుసులు, పల్లీలు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అవి వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేయాలి. ఒక సారి బాగా కలిపిన తర్వాత ఇడ్లీలను ఉండలు లేకుండా చిదిమి బాండీలో వేసి గరిటతో బాగా కలియ బెట్టాలి. నూనె కొంచం ఎక్కువ వేస్తే ఉప్మా బావుంటుంది. తినే ముందు ఇష్టం ఉన్నావున్న వారు నెయ్యి, ఆవకాయ, నిమ్మకాయ రసం వేసుకుని తినవచ్చు. ఇది పెద్దలు, పిల్లలు ఇష్టపడతారు.
ఇడ్లిలతో బజ్జీలు
కావలసిన పదార్ధాలు: ఇడ్లీలు ఆరు, శనగపిండి, కారం, వాము, ఉప్పు, నూనె.
తయారు చేయు విధానం: ఇడ్లీలను నాలుగు ముక్కలు చేసుకోవాలి(పెద్ద ఇడ్లిలు అయితే). శనగపిండిలో ఉప్పు, కారం, వాము వేసి జారుగా కలుపుకోవాలి. చిటికెడు తినేసోడ కూడా వేయాలి. బాండీలో ఎక్కువ నూనె పోసి అది బాగా వేడి ఎక్కాక ముక్కలు చేసుకున్న ఇడ్లిలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత బండీలోంచి తీసి కొంచం చల్లారాక టమాటో సాస్‌తో కానీ కెట్చప్తో కానీ తింటే చాలా బావుంటాయి.
ఇడ్లి పులిహోర
కావలసిన పదార్ధాలు: ఇడ్లీలు పన్నెండు, నూనె, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ, పల్లీలు, పోపు దినుసులు, నిమ్మకాయ, పసుపు.
తయారు చేయు విధానం: ఒక వెడల్పాటి బేసిన్ తీసుకుని అందులో ఇడ్లీలను వేసుకుని బాగా చిదుముకోవాలి. ముద్దగా, ముక్కలుగా లేకుండా చూసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసి బాగా చేత్తో కలపాలి. తెలుపు అనేది కనపడకుండా ఉండాలి. ఆ తర్వాత బాండీలో కొంచం నూనె ఎక్కువ పోసి అందులో పోపు దినుసులు, పల్లీలు, ఎండు మిర్చి వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేసి కరివేపాకు, ఇంగువ వేయాలి. పోపు చల్లారిన తర్వాత మిశ్రమంలో కలపాలి.
- పాలపర్తి సంధ్యారాణి