Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీషా కళ్యాణ్... గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారిణి... కాంటినెంటల్ క్లబ్ టోర్నమెంట్లో స్కోర్ చేసిన మొదటి భారతీయ మహిళ. ఫుట్‌బాల్‌పై తనకున్న అమితమైన ఆసక్తితో ఆడేందుకు కాలినడకన 15 కిలోమీటర్లు ప్రయాణించేది ఈ 20 ఏండ్ల భారత మిడ్‌ఫీల్డర్. పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో నుండి వచ్చిన ఆమె ఫుట్‌బాల్‌లోకి ఎలా అడుగుపెట్టిందో, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డినోÛ తర్వాత 'దినోÛ' అనే పేరు ఎలా వచ్చిందో... తాను సాధించిన విజయాల వెనక దాగిన శ్రమ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
నిన్నటి నుంచి భారత్‌లో జరగుతున్న ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి సమయం అది. గత ఏడాది ఆగస్టులో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు బాధ్యతలు స్వీకరించిన స్వీడిష్ కోచ్ థామస్ డెన్నర్బీ, టోర్నమెంట్ కోసం 23 మంది సభ్యులతో కూడిన జట్టును నియమించారు. వీరిలో ఫార్వర్డ్ ప్లేయర్లలో మనీషా కళ్యాణ్ కూడా ఒకరు.
మొదటి భారతీయ మహిళగా...
పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని మొగువాల్ గ్రామానికి చెందిన మనీషా 2021లో జరిగిన ఎఎఫ్‌సి మహిళల ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌సి బున్యోద్కోర్పై స్కోర్ చేయడంతో కాంటినెంటల్ క్లబ్ టోర్నమెంట్లో గోల్ చేసిన మొదటి భారతీయ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా నిలిచింది. దీని తర్వాత 20 ఏండ్ల ఎఐఎఫ్ఎఫ్ మహిళా ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎంపికైంది. ఇంత చిన్న వయసులోనే ఫుట్‌బాల్ కెరీర్లో అద్భుతమైన చరిత్ర సృష్టించింది.
గర్వ పడుతున్నారు
''నేను ఆ గోల్ సాధించినందుకు నా కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉన్నారు. ఎంతో గర్వ పడుతున్నారు. మన తల్లిదండ్రులు మన గురించి గర్విస్తున్నప్పుడు ఇది చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఆ రోజు నాకు చాలా కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను'' అని మనీషా అంటుంది. మనీషా జాతీయ జట్టులో చేరినప్పటి నుండి యువకులలో అత్యంత ఉత్తేజకరమైన క్రీడాకారిణిలలో ఒకరిగా నిలిచింది.
ఎంత ఆడితే అంత ఆత్మవిశ్వాసం
భారత జట్టులో చేరిన అనుభవం గురించి ఆమె చెబుతూ ''నేను జాతీయ జట్టులో చేరినప్పటి నుండి అండర్-17 ఏజ్ గ్రూప్‌తో ప్రారంభించి నన్ను నేను మరింత ప్రొఫెషనల్‌గా భావించాను. చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. నేర్చుకోవలసింది చాలా ఉందని భావిస్తున్నాను. గత రెండేండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆడాము. ఎన్ని మ్యాచ్‌లు ఆడితే అంత ఆత్మవిశ్వాసం పెరిగింది. మా బలం, సత్తువ కోసం మేము చాలా కృషి చేశాము. ఆడిన మ్యాచ్‌లలో చాలా పెద్ద జట్లతో పోటీ పడ్డాము. మా శక్తి కంటే ఎక్కువ ర్యాంక్‌ని పొందాము. ఇది మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అలాగే మనం ఎక్కడ మెరుగుపడాలో తెలుసుకునేలా చేసింది'' అంటుంది.
ప్రతి మ్యాచ్ నేర్పుతుంది
తన జట్టులోని సీనియర్ క్రీడాకారిణులైన అదితి చౌహాన్, ఆశాలతా దేవిలతో పాటు ఇతరులతో కూడా తన అభిప్రాయలను పంచుకుంటుంది. ప్రతి మ్యాచ్ తర్వాత వారు ఎక్కడ తప్పులు చేశారో, ఎక్కడ మెరుగుపడాలి అనే దానిపై యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తుంది. ''నేను వింగర్‌గా ఆడినప్పుడు మొదట్లో నా మొదటి టచ్ బయటకు వెళ్లేది. ఇప్పుడు నేను దానిని ఎలా ఉంచాలో నేర్చుకున్నాను. నా షూటింగ్ కచ్చితత్వంపై కూడా పనిచేశాను'' అని ఆమె చెప్పింది.
ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ప్రయాణం
ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించే ముందు అంటే ఆరవ తరగతి వరకు మనీషా స్ప్రింటింగ్‌లో ఉంది. దాదాపు అదే సమయంలో జిల్లా ఫుట్‌బాల్ జట్టు ట్రయల్‌కు సెలెక్టర్‌గా నియమితులైన పిటి టీచర్ మనీషాను క్రీడను ఆడాలనుకుంటున్నావా అని అడిగారు. మనీషా వెంటనే అంగీకరించింది. తన గ్రామంలో ఫుట్‌బాల్ జనాదరణ పొందిన క్రీడ కాదు. అయినప్పటికీ ఆమె అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ క్రీడను నేర్చుకోవాలని నిర్ణయించుకుంది.
నడవాలి లేదా పరిగెత్తాలి
''నేను బాలికల జట్టులో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడాలనుకున్నప్పుడల్లా దాదాపు 15 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేది. అక్కడ మా నాన్న కోచ్. కొన్నిసార్లు నేను నా సైకిల్‌పై అక్కడికి వెళ్లేదాన్ని. కానీ చాలా సమయం పట్టేది. నేను ఆ 15 కిలోమీటర్లు నడవాలి లేదా పరుగెత్తాలి'' అని ఆమె గుర్తుచేసుకుంది. మనీషా అబ్బాయిలతో కలిసి ఆడుతుందని తన గ్రామంలోని ప్రజలు తన తల్లిదండ్రులను ఎప్పుడూ ప్రశ్నిస్తూ వుండేవారు. కానీ ఆమె కుటుంబం అలాంటి వ్యాఖ్యలను ఎప్పుడూ పట్టించుకోలేదు.
అబ్బాయిలతో ఆడుతుంటే
''నేను ఉండేది ఓ గ్రామం. కాబట్టి మీ కుమార్తె అబ్బాయిలతో ఆడుకుంటోందని కొన్నిసార్లు ప్రజలు నా తల్లిదండ్రులతో చెప్పేవారు. మా ఊరిలో నాకు అమ్మాయిల బృందం లేదు కాబట్టి నేను అబ్బాయిలతో ఆడుకునేదాన్ని. అయితే మా అమ్మాయి ఆడదలుచుకుంటే ఆడుకోనివ్వండి అని నా కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలకు సమాధానం చెప్పేవారు. నేను ఒక ప్రొఫెషనల్ అమ్మాయిల టీమ్‌తో ఆడాలనుకుంటే నేను కొంచెం వెనక్కి వెళ్లాల్సి వచ్చేది'' ఆమె అంటుంది.
పిర్యాదు చేసినవారే
ఏది ఏమైనప్పటికీ 2021 అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆఫ్ మనౌస్లో బ్రెజిల్‌పై 6-1 తేడాతో ఓడిపోయిన తర్వాత మనీషా చరిత్ర సృష్టించడంతో ఆమె పరిస్థితి మారిపోయింది. ''మా గ్రామంలో నాపనై ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఇంతకుముందు ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఇప్పుడు వచ్చి నన్ను క్రీడలలో వృత్తిని కొనసాగించడానికి మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు నా తల్లిదండ్రులను అభినందించారు'' అని మనీషా చెప్పింది.
పంజాబ్ 'దినో'
మనీషా బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారులైన నెరుమార్, రొనాల్డినోలను ఎంతగానో అభిమానిస్తుంది. దాంతో ఇంట్లో వారితో పాటు ఆమె స్నేహితులు కూడా ఆమెకు 'దినోÛ' అని ముద్దుపేరు పెట్టారు. ''వారు ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. నా హెయిర్‌స్టైల్, నేను ఆడిన విధానం కారణంగా నా స్నేహితులు నన్ను 'దినోÛ' అని కూడా పిలిచేవారు'' అని ఆమె జతచేస్తుంది.
ఎప్పటికీ గుర్తుండిపోయే గోల్
తన అత్యున్నత విజయాల గురించి మాట్లాడుతూ ''భారత యు-17 జట్టుకు నా మొదటి కాల్ అప్, నవంబర్‌లో బ్రెజిల్‌పై నా గోల్ ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గోల్. నేను ఎఫ్‌సి మమహిళల ఆసియా ఛాంపియన్షిప్ సమయంలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌సి బున్యోద్కర్పై స్కోర్ చేశాను. ఇలాంటి క్షణాలు ఇంకా ముందు ముందు చాలా రావాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఇది నాకు గర్వంగా ఉంది'' అంటుంది.
అమ్మాయిలకు మద్దతు ఇవ్వండి
ఆమె ఆసియా కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్ఐఎఫ్ఏ మహిళల ప్రపంచ కప్‌కు కూడా అర్హత సాధించాలనుకుంటోంది. ''నేను నా దేశం కోసం మరిన్ని గోల్స్ చేయాలనుకుంటున్నాను'' అంటుంది. చివరగా ఆమె ఇలా చెప్పింది ''ఫుట్‌బాల్‌లో కూడా అమ్మాయిలు తమ కెరీర్‌ను కొనసాగించవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు వారి బిడ్డలు ఆడుకోవడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలను ఆడుకునేలా ప్రోత్సహించండి. తద్వారా మన భారతీయ ఫుట్‌బాల్ గతంలో కంటే బలంగా పెరుగుతుంది'' అని విన్నవించుకుంటుంది మనీషా.
- సలీమ