Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బియ్యం, పప్పులు, పిండిలో పురుగులు పట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అవి తెల్లవి లేదా లక్క పురుగు నలుపు రంగులో ఉంటాయి. అయితే, ఇలా బియ్యం పప్పులు పురుగు పట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ముందుగా మనం స్టోర్ చేసుకునే ఈ వస్తువుల గది చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. అంటే గాలి, ఎండ వెలుతురు తగిలేలా ఉండాలి. లేకపోతే పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వంటివి అప్పుడప్పుడు ఎండ బెట్టుకోవాలి. ఇలా ఎండబెడితే ఈ పప్పులను మళ్లీ ఎయిర్ టైడ్ డబ్బాలో వేసి పెట్టుకోవాలి.
బియ్యం డబ్బాలో పురుగులు వస్తే.. వేపాకు తీసుకువచ్చి ఆరబెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లిపొట్టు, వేపాకు, లవంగాలు మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ తర్వాత కొబ్బరినూనె కలిపి ఉండలు తయారు చేయాలి. గాజుగుడ్డ లేదా పట్టి గుడ్డలో మూటలు కట్టుకోవాలి. వీటిని బియ్యం డబ్బా అడుగు భాగాన ఒక మూట పెట్టి ఆపైన బియ్యం పోసి మళ్లీ ఇంకో మూట పెట్టి బియ్యం పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ బియ్యం డబ్బాలోకి తెల్లపురుగు రాదు, నల్ల పురుగు అస్సలు పట్టవు. వేపాకులు ఉండే ఔషధ గుణాలు వల్ల బియ్యం పాడవ్వకుండా ఉంటాయి.
చింతపండు, పసుపు, కారం కూడా చెడిపోతాయి. వీటిని ఎక్కువగా ఈమధ్య కాలంలో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేస్తున్నారు. వీటిని మనం తెచ్చి నిల్వ చేసుకునే సరికే పాడవుతుంటాయి. వీటిని సంరక్షించాలంటే ఆముదం గింజలను ఉపయోగించి పాడవ్వకుండా చూడచ్చు. సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో తెచ్చుకోవాలి.
కొంతమంది బియ్యంలో బోరిక్ యాసిడ్ కలుపుతారు. దీనికంటే వేపాకు శ్రేష్టమైంది. మరికొంతమంది కర్పూర బిళ్లలు, ఇంగువ, కాకరకాయలు మూటకట్టి పెడతారు. కానీ ఇవి అంతగా పనిచేయవు.
నిల్వ ఉంచుకునే డబ్బా ఎయిర్ టైట్‌గా ఉంటే.. పురుగు పట్టడానికి అవకాశం తక్కువ.
పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే కేజీ వరకు ఫ్రిడ్జో పెట్టుకోవచ్చు. కారం, పసుపు, చింతపండును కూడా రీఫ్రిజీరేటర్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు.
వంటింట్లో బొద్దింకలు, చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే కొన్ని రసాయనాలు వాడి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పురుగుల బాధ నుంచి తప్పించుకోవచ్చు.