Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలు తల్చుకుంటే రెండు నెలల్లోనే ప్రభుత్వాలను కూల్చేయగలరు'' ఇది గాంధీ మహాత్ముని సందేశం... అదే జరిగింది. 1980, 90 దశకాల్లో ప్రభుత్వాలను మట్టి కరిపించి కూల గొట్టింటి ఆనాటి మహిళాశక్తి. అదే తెలుగు మహిళలు సాగించిన సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమానికి అక్షరాల రుజువు. ప్రస్తుతం సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. జీవితాలను పట్టి పీడుస్తున్న మద్యాన్ని తరిగికొట్టేందుకు మహిళలందరూ మరొక్కసారి ఉద్యమించాలని కోరుకుంటున్నాను. మహిళా సమస్యలపై, సమానత్వం కోసం నిత్యం కృషి చేసే సీపీఐ(ఎం) పార్టీ మహాసభలు ఇందుకు స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నాను. అందుకే ఆనాటి ఉద్యమాన్ని నేటి తరానికి గుర్తు చేస్తున్నాను.
1920వ దశకంలో ఏర్పడి సమస్త భారతావనిలో బలమైన శక్తిగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడిండి కూలగొట్టిన తెలుగు మహిళల మహాప్రళయాన్ని చరిత్ర ఏనాటికి మరువదు. అధికారమత్తులో మునిగి, మాదేరాజ్యం, మా పెత్తనానికి తిరుగులేదు అని విర్రవీగుతున్న పాలక వర్గాలకు, మహిళా శక్తి మత్తు వదిలిస్తుంది. గుణపాఠం చెప్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. తల్లి ఒడిలాంటి సోషలిస్టు వ్యవస్థ రూపం.
భారతావని అల్లాడుతోంది
బంగారు పంటలు పండించిన ధనరాశులతో తులతూగే భారతావనని ఆకలిరాజ్యంగా చేసిన, పాలనాధికారాన్ని, మహిళా లోకం ఇక సహించదు. సత్యా అహింసల భారతావనిని ప్రభోధించిన మహాత్ముని, ఆదిలోనే కడతేర్చిన అధికార వర్గం చేతిలో ప్రస్తుతం భారతావని అల్లాడుతోంది. లౌకికరాజ్యాంగాన్ని అంతం చేసే దుష్ట శక్తుల చేతిలో భారతమ్మ నలిగిపోతోంది. కుల మతాల, వైషమ్యాల చిచ్చు పెట్టే, మతసామరస్యాన్ని అంతం చేసే దుర్మార్గ విధానాలతో దేశాన్ని హింసా పూరితం చేశారు. ''హిందూ, ముస్లిం భాయి భాయి'' అన్న మహాత్ముని సందేశాన్ని చెరిపేశారు.
ఆకలి కడుపులతో...
భావితరం భారతమ్మ బిడ్డలైన మహిళలను మార్కెట్ సరుకుగా అమ్ముకుంటున్న పెట్టుబడిదారీ పాలన విశ్వరూపం ఈనాటి దుస్థితి. దేశంలో ఎటు చూసినా ఆకలి చావులు. విద్య, విజ్ఞానాలకు దూరమై భావితరం బిడ్డలు పెంట కుప్పల మీద బతుకుతూ బాలకార్మికులుగా ఆకలి కడుపులతో అల్లాడుతున్న దుర్గతి. నిరుద్యోగం పెరిగి తాగుడుకు బానిసలైన యువతరం మానవత్వాన్ని కోల్పోయి, హింసా పూరితమైన భయంకర సంఘటనలతో దేశం అట్టుడుకుతోంది. బంగారు పంటలు పండించే రైతన్నలు అప్పులపాలై ఆకలి చావులతో, ఆత్మహత్యలతో దేశం అల్లాడుతోంది.
స్త్రీలోకం తల్లడిల్లుతోంది
ఒకవైపు సారా, మద్యం వ్యాపారాన్ని పెంచుకుంటూ ధనార్జన పెంచుకుంటున్న ప్రభుత్వ విధానం. మద్యం వ్యసనం తారా స్థాయికి చేరి కన్నతల్లిదండ్రులను, భార్యా బిడ్డలను డబ్బుల కోసం హింసిస్తున్నారు. మానవత్వాన్ని కోల్పోయి రాక్షసంగా హింసించి కడతేరుస్తున్న వార్తలు సమాజాన్ని వణికిస్తున్నాయి. జాతికి జన్మనిచ్చిన తల్లులుగా స్త్రీలోకం తల్లడిల్లుతోంది. ఇలాంటి బాధల బతుకులతో స్త్రీలకు బిడ్డలకు ఏమాత్రం రక్షణ ఇవ్వలేని, పెట్టుబడిదారి వర్గానికి ఊడిగం చేసే ఈ పాలక వర్గాలను స్త్రీలోకం ఎంత కాలం భరిస్తుంది?
లోలోపలే కుమిలిపోతున్నారు
ఒకవైపు మహిళల మూల్గులు పీల్చే శ్రమలతో, కన్నబిడ్డల పోషణ భారంతో, చాలీ చాలని సంసారాలతో నలిగి, విసిగి వేసారి స్త్రీలోకం కన్నెర్ర చేస్తోంది. ధనవంతుల ఇళ్లలోని స్త్రీలు కూడా తాగుడుకు బానిసలైన భర్తల చేతిలో బాధలకు గురౌతూ సంసారాల్లో సుఖశాంతులు కరువై లోలోపలే కుమిలిపోతున్నారు. పరువు, ప్రతిష్టకు భయపడి తమ కష్టాలను కనీసం బటయకు కూడా చెప్పుకోలేక అజ్ఞాత హింసలు అనుభవిస్తున్న దుర్గతి.
ఎంతకాలం సహిస్తారు..?
సమాజంలో నలువైపుల స్త్రీ శక్తి మేల్కొంటుంది. చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా దగాకోరు మాటలతో మహిళలను వంచించే ఈ దుర్మార్గ రాజ్యాన్ని స్త్రీలోకం ఇక సహించదు. సమాజాన్కి జన్మనిచ్చిన తల్లులుగా తమ భావితరం బంగారు భవిత కోసం నడుం బిగిస్తారు. గత సారా, మద్య నిషేధ ఉద్యమాల సందర్భంగా పల్లెల్లో, పట్టణాలలో, గుడిసెల్లో, మేడల్లో ఉండే మహిళలంతా ప్రభుత్వంపై విరగబడ్డారు. అంతా ఒక్కటై వీధుల్లోకి వచ్చాచరు. ప్రభుత్వ సారా వ్యాపారాన్ని ధ్వసం చేశారు. బ్రాందీ సారాలను రోడ్లపై గుమ్మరించారు. మహిళల తిరుగుబాటు చూసి ప్రభుత్వం దద్దరిల్లింది. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమయింది. పభుత్వం చేష్టలుడిగింది. అధికారం కుప్పకూలింది. మహిళా ఉద్యమానికి ప్రభుత్వాలు దాసోహమయ్యాయి. బహిరంగంగా, దర్జాగా సాగే సారా, బ్రాందీల వ్యాపారానిది దొంగ బతుకు అయింది. స్త్రీశక్తి పళయాంతకం అన్నది రుజువయింది. అందుకే సారా, మద్య నిషేధ ఉద్యమాలను అధికార బలంతో తులతూగే ప్రభుత్వాలు గుణపాఠాలుగా గుర్తించాలి. లేకపోతే అధికార వర్గానికి అధోగతే...
- పి.వసంత