Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె భారత చలన చిత్ర రంగంలో 'తొలి డ్రీమ్ గర్ల్'. తొమ్మిదేళ్ల కాలంలో నటించిన చిత్రాలు డజనుకు ఒకటి తక్కువే, అయినా శతాధిక చిత్రాలకు సరిపడ పేరు, ప్రజాదరణను సంపాదించుకుని, తొలి 'సూపర్ హీరోయన్'గా గుర్తింపు పొందింది. ఆమెతోనే 'స్టార్ డమ్' ప్రారంభమైందని చెబుతారు. అందం, అభినయం, మధురస్వరం ఆమెను అనతికాలంలోనే అందలం ఎక్కించాయి. తెలుగు తెరపై తొలి తరం గ్లామరస్ హీరోయిన్స్‌లలో ఒకరిగా ఆనాటి యువతరం ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్ర వేసిన ఆమె ఎవరో కాదు... 'క్వీన్ ఆఫ్ బ్యూటీ' కాంచనమాల. ఆమె తన నటనద్వారా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడమే కాకుండా, నాటి ప్రేక్షకులకు 'కలల రాణి'గా నిలిచి వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
కాంచనమాల 1917 మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లాలోని 'ఆంధ్రాప్యాలెస్'గా పేరొందిన తెనాలి సమీపంలో ఉన్న కూచిపూడిలో జన్మించారు. తండ్రి పేరు దాసరి నారాయణదాసు. బాల్యం నుంచే కాంచనమాలకు సంగీతం, నటన మీద మక్కువ ఎక్కువ. తన చిన్నాన దగ్గర సంగీతం నేర్చుకుంది. అలా నేర్చుకుంటూనే మొదట నాటక రంగం, ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి ప్రవేశించింది.
రంగస్థల నటిగా
ప్రఖ్యాత నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం తమ 'సారంగధర' నాటకంలో స్త్రీ పాత్రలను స్త్రీలతోనే ధరింపజేయాలని నిర్ణయించి ప్రకటించిన నేపథ్యంలో కాంచనమాల తండ్రి నారాయణదాసు వెల్లి చిలకమర్తిని కలవగా, ఆ నాటకంలో కాంచనమాలకు 'చిత్రాంగి' వేషం ఇచ్చారు. అప్పటి వరకు పురుషులే స్త్రీ పాత్రలను పోషిస్తుండగా, 'స్త్రీ పాత్రలను స్త్రీలే పోషిస్తున్న తొలి నాటకం' అన్న ప్రచారంతో ఆ ప్రదర్శనను చూసేందుకు ప్రేక్షకులు వరుస కట్టారు. అలా నటజీవితాన్ని ప్రారంభించిన కాంచనమాల 'విప్రనారాయణ', 'సక్కుబాయి' తదితర నాటకాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలలో కొంతకాలం నటించిన, తిరిగి నాటక రంగమే కాంచనమాలకు కొంతవరకు బతుకుతెరువైంది.
సినీరంగ ప్రవేశం
నాటకాలలో కాంచనమాల విశాలనేత్రాలు, మధురస్వరం, అందమైన ముఖం చూసి ముగ్ధులైన ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య 1935లో వై.వి.రావు నిర్మించిన 'కృష్ణ తులాభారము'లో 'మిత్రవింద' వేషం ద్వారా సినీరంగంలో అవకాశం కల్పించారు. ఆ సినిమాతోనే కాంచన తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 1936లో 'వీరాభిమన్యు', 'విప్రనారాయణ', చిత్రాలలో నటించింది. 1938లో వచ్చిన 'గృహలక్ష్మి' చిత్రంలో వాంప్ పాత్రను పోషించింది. ఆ పాత్రలో కాంచనమాల పూర్తిగా ఒదిగిపోయి, ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనే కాంచనమాల నటించిన 'మాలపిల్ల' చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో ఒక సాంప్రదాయపు బ్రాహ్మణ యువకుడు, ఒక గ్రామీణ మాలపిల్లను ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఆ రోజుల్లో, ఈ ఇతివృత్తంతో సినిమా తీయటమే ఒక సాహసం. ఈ సినిమా మొదటి భాగంలో నిరక్షురాలైన గ్రామీణ యువతిగా అద్భుతంగా నటించిన కాంచనమాల రెండవ భాగంలో చదువుకున్న ఒక అధునాతన యువతిగా అదే ప్రతిభను కనబరచింది. ఈ చిత్రంతోనే ఆమె 'తొలితరం గ్లామర్ క్వీన్'గా పేరు సంపాదించుకుంది. ఆమె అందాన్ని చూసేందుకు థియేటర్లో ఆడా, మగా తేడా లేకుండా క్యూ కట్టేవారు. 1939లో 'వందేమాతరం', 'మళ్ళీపెళ్ళి' చిత్రాలు విడుదల అయ్యాయి. 'వందేమాతరం' దక్షిణ భారత దేశంలో రజతోత్సవం జరుపుకొన్న మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ చిత్రం విజయవంతమవ్వగా, ఈ సినిమాలో నాగయ్య కాంచనమాల కలసి పాడిన యుగళ గీతం 'మధురా నగరిలో చల్ల నమ్మబోవుదు' అనే పాట ప్రతి ఇంటిలోనూ మార్మోగింది. 'మళ్ళీపెళ్ళి' చిత్రం వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. 1940లో కాంచన నటించిన 'ఇల్లాలు' చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ, ఆంధ్ర పత్రిక ఫిలిం బ్యాలెట్లో ఉత్తమనటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. కాంచనమాల స్నేహితురాలు, నటి లక్ష్మీరాజ్యం 1963లో 'నర్తనశాల' చిత్రం నిర్మించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు వచ్చినా తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కష్టాల్లో ఉన్న కాంచనమాలను ఆదుకునేందుకు లక్ష్మీరాజ్యం 'నర్తనశాల'లో బలవంతం చేసి వేషం వేయించారు. కాంచన మళ్ళీ నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది ఆమెను చూడటానికి వస్తే, ఆమె ఎవ్వరినీ గుర్తు పట్టకపోగా, మీరెవరూ నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏండ్ల తర్వాత మేకప్ వేసుకున్నా కాంచనమాలలో ఏ మాత్రం ఆనందం కంపించలేదు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కండ్లు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట. నటిగా కొనసాగినంత కాలం విలాసవంతమైన జీవితం గడిపిన కాంచనమాల 1981 జనవరి 24న చెన్నైలో మరణించారు.
జెమినీ వాసన్‌తో విబేధాలు
కాంచనమాల కెరీర్ పరంగా 1942లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 'జెమినీ అధినేత వాసన్'కు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. వాసన్ కాంచనమాలతో జెమిని సంస్థ వరుసగా ఐదు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. అప్పటి వరకూ ఇతర నిర్మాతల సినిమాల్లో చేయకూడదు. ఒకవేళ చేస్తే వాసన్ అనుమతి తీసుకోవాలి. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే, కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. ఈ అగ్రిమెంట్ జరిగాక కొన్ని రోజులకు వాసన్ ఆమె అందానికి మోహితుడై ఆమెను వేధించటం ప్రారంభించాడట. ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా వాసన్ మాయలో చిక్కకపోవడంతో ఆమె అతని ఆగ్రహానికి గురి అయింది. ఒప్పందం ప్రకారం ఆ సినిమా నిర్మాణం పూర్తి కాకుండా ఆమె మరే చిత్రంలో నటించటానికి వీలులేదు. ఆ సమయంలో వాసన్ కూడా కొత్త సినిమాలు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్‌తో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా, ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాటమాట పెరిగి వాసన్ని ''నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి?'' అని కాంచనమాల అనడంతో పాటు, వాసన్ ని అసభ్య పదజాలంతో దూషించగా, ఆవేశంతో అన్న ఈ మాటలన్నీ కాంచనమాలకు తెలియకుండా జెమినీ వాసన్ తన స్టూడియోలో తెలివిగా టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ గోడవలతో 'బాల నాగమ్మ' సినిమాను విడుదల చేయకుండా చాలా రోజులు ఆపి, ఉజ్వలంగా ఉన్న ఆమె సినీ జీవితాన్ని వాసన్ నాశనం చేసాడని ఇండిస్టీ పెద్దలు అంటారు. ఇలా విబేధాలు మరింత ముదిరాయి. ఒప్పందానికి కట్టుబడి మరో సంస్థలో సినిమాలు చేయలేని పరిస్థితులు. 'సినిమా రాజకీయ వల'లో చిక్కుకుపోయిన కాంచనమాల ఆ సంస్థలో కూడా నటించడానికి వీలు లేకుండా పోయింది. తన చుట్టు జరిగిన కుట్రల కారణంగా తర్వాత ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఇలా తన 'సినీ జీవితం' అర్ధాంతరంగా ముగియడంతో తీవ్రంగా కుంగిపోయి మతి స్థిమితం కోల్పోయింది. ఈ సమయంలోనే ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త గాలి వెంకయ్య క్షయ వ్యాధితో మరణించారు. దాంతో ఆమె తిరిగి ఏ ప్రయత్నమూ చేయలేదు. అభిమానుల కండ్లన్నీ తన వైపుకి తిప్పుకున్న కాంచన కండ్లు ఈ షాక్‌తో శూన్యంలోకి చూడటం మొదలుపెట్టాయి. బతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. అయితే 'బాలనాగమ్మ' చిత్రం ఇదే సమయంలో విడుదల అయి అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్‌కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచనమాల నటనకు ఈ సినిమా గీటురాయిగా నిలిచినప్పటికి ఈ సినిమానే 'హీరోయిన్' గా ఆమెకు ఆఖరి చిత్రం అయింది. ఈమె తన కెరీర్ మొత్తంలో 11 సినిమాల్లో మాత్రమే నటించింది.
హిందీ సినిమాలను తిరస్కరించింది
తన అందంతో ఉత్తరాది వారినీ కట్టిపడేసిన కాంచనమాలకు బొంబాయి చిత్ర పరిశ్రమ నుంచి అనేక అవకాశాలు వచ్చాయి. హిందీ చిత్రపరిశ్రమ ప్రముఖులు మెహబూబ్ ఖాన్, మోతీలాల్, సురేంద్ర బొంబాయిలో జరుగుతున్న 'వీరాభిమన్యు' సినిమా చిత్రీకరణలో కాంచనమాలను చూసి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నర్గీస్ తల్లి జద్దన్ బాయి మరో అడుగు ముందుకు వేసి ఆమెకు హిందీ నేర్పించి మరీ నటింపచేసుకుంటామని చెప్పారట. కానీ హిందీలో ఎన్నో అవకాశాలు వచ్చినా.. తెలుగు మీద వుండే మమకారంతో ఆ సినిమాలన్నింటినీ తిరస్కరించింది. ఒకవేళ ఈమె బొంబాయి చిత్ర పరిశ్రమకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ ఆమె నిర్ణయం 'రెంటికి చెడిన' సామెతలా మారిందని కాంచనమాల అభిమానులు బాధపడ్డారు.
అందరి ఇండ్లల్లో...
గూడవల్లి రామబ్రహ్మం ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న కాలంలో కాంచనమాలను చూసి 'ఈమె ఫొటోకు తగిన మొహం కాదు. సినిమాకు పనికిరాదు' అని వ్యాఖ్యానించిన, గూడవల్లి రామబ్రహ్మం దర్శకుడిగా మారిన తర్వాత అభిప్రాయం మార్చుకొని తాను తీస్తున్న 'మాలపిల్ల' చిత్రానికి ఆమెనే నాయికగా ఎంచుకోవడం విశేషం. క్యాలెండర్‌కు ఎక్కి అభిమానుల ఆరాధనలు అందుకున్న తొలి కథానాయిక కాంచనమాల. 1938 - 40 ప్రాంతాల చాలా మంది ఇళ్లలో గోడ మీద కాంచనమాల కాలెండర్ వేలాడుతూ వుండేది. సంవత్సరం అయిపోయి, డేట్ కాలెండర్ చిరిగిపోయినా, ఆమె చిత్రం మాత్రం చాలా మంది ఇళ్లలో కనిపించేది.
భానుమతికి కాంచనమాల అభిమాన నటి
అలనాటి మరో అందాల తార 'భానుమతి' సైతం కాంచనమాల అందచందాలను.. అభినయాన్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నారట. భానుమతి సాధారణంగా ఎవ్వరిని మెచ్చుకోరన్న టాక్ ఉంది. అలాంటిది ఆమె కూడా కాంచనమాలను అభిమానించడం విశేషం. కాంచన నటిగా ఎంతటి గ్లామర్ సొంతం చేసుకున్నారంటే 'మా ఇంటి మీదుగా వెళ్లే ఆమెను చూడాలని ఎంతో ఉవ్విళ్లూరేదాన్ని' అని భానుమతి తన ఆత్మకథలో రాసుకున్నారు. నటనలో కాంచనమాల నుండి స్ఫూర్తి పొందిన మరో నటి జి.వరలక్ష్మి. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి తాను తీసిన 'దాంపత్యం' సినిమా సమయంలో కాంచనమాలపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయా చిత్రాన్ని సెట్లో ఉంచారు.
-పొన్నం రవిచంద్ర, 9440077499.